మంచి కోసం మనువాడారు!
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, చుట్టూ వందలాది మంది అతిథులు, నగల ధగధగలు, అలంకరణల మిలమిలలు... ఇవి లేకుండా పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆ ఇద్దరూ ఇవేమీ వద్దనుకున్నారు. అసలు తమ పెళ్లి తమ ఆనందం కోసం కాకుండా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అనుకున్నారు. ఇందుకే ఈ రోజున అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, తనని ఎంత బాగా చూసుకుంటారు అని అంచనా వేసుకున్న తరువాతే ఎవరైనా పెళ్లికి సిద్ధపడతారు. కానీ చెన్నైకి చెందిన తిలక్, ధన ఇవేమీ చూసుకోలేదు. ఎంత మంచివారు, ఎంత సేవ చేస్తారు, ఇతరుల కోసం జీవితాన్ని ఎంతవరకూ అంకితమివ్వగలరు అని చూసుకున్నారు. తిలక్ తన స్నేహితుడు నందన్‌తో కలిసి ఓ సేవాసంస్థను నడుపుతున్నాడు. గ్రామాల్లోని పేద పిల్లలను చదివిస్తుంటాడు. ఓ కార్యక్రమంలో అతడికి పరిచయమయ్యింది ధన. అతడు చేస్తోన్న సేవ గురించి తెలిసి ముగ్ధురాలయ్యింది. ఆమెలో ఉన్న సేవాగుణం అతడినీ ఆకర్షించింది. కొన్ని మంచి పనుల కోసం ఇద్దరూ కలిసి అడుగులు వేయాలనుకున్నారు. తరువాత ఆ ఆశయం వారితో ఏడడుగులు వేయించింది.
ఓసారి ఎయిడ్‌సతో బాధపడుతోన్న ఓ చిన్నారిని చూసింది ధన. ఆ బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిలక్‌ని అడిగింది. అంతలోనే మరో మనసున్న దంపతులు ఆ పాపని దత్తత చేసుకున్నారు. అయితే ఇద్దరూ కలిస్తే కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు అన్న ఆలోచన బలపడింది. సేవ చేయడం కోసం ఇద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. చివరకు తమ పెళ్లి కూడా పేదపిల్లలకే ఉపయోగపడేలా చేయాలనుకున్నారు. అందుకే తమ పెళ్లికి వచ్చేవారిని బహుమతులు తీసుకురావొద్దని, ఏదిచ్చినా ధన రూపంలోనే ఇవ్వాలని ముందే చెప్పారు.
అతిథులతో పాటు పేదపిల్లలను కూడా పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లిరోజున వాళ్లిద్దరూ పట్టుబట్టలు కట్టుకోలేదు. పందిళ్లు వేయలేదు. అలంకరణలు లేవు. అతి సింపుల్‌గా మనువాడారు. వచ్చిన కానుకల్ని, తమ పెళ్లికి ఖర్చు చేయాలని ఇంట్లోవాళ్లు దాచిన మొత్తాన్నీ కూడా పేదపిల్లల సంక్షేమానికి వినియోగించారు. నాటినుంచి నేటివరకూ... అంటే దాదాపు రెండేళ్లుగా వారు చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దేందుకే పాటు పడుతున్నారు. ఆదర్శ దంపతులుగానే కాదు... ఆదర్శనీయమైన వ్యక్తులుగానూ అభినందనలు అందుకుంటున్నారు!