ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. వేదిక మీదకు చక్కగా అలంకరించుకున్నచిన్నారి ఏంజిల్స్ ఒక్కొక్కరే వస్తున్నారు. చప్పట్ల మోతలో వెలుగుతున్న ముఖాలతో ముందుకు కదులుతున్నారు. వారిలో ఒకమ్మాయి రీనీ. ఫెయిరీ డ్రెస్‌లో ఉంది రీనీ. అందమైన డ్రెస్‌లో, వీపుకు రెక్కలు కట్టుకుని నడుస్తోంది. స్నిగ్ధత్వంతో కూడా ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో. గుంపులో నుంచి ఓ గొంతు... ‘నల్లటి ఫెయిరీని చూడండి’! ఆ మాటకంటే, ఆ మాట తర్వాత వినిపించిన నవ్వులే ఆమెను విపరీతంగా గాయపరిచాయి. కన్నీళ్లతో వేదిక దిగింది మూడేళ్ల రీనీ. మనదేశంలో తెల్లదనం మీదున్న విపరీతమైన వ్యామోహానికి పరాకాష్ట ఈ సంఘటన!
ఆ రోజు... ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌తో ఎదురైన చేదు అనుభవంతో అక్కడే ఆగిపోయి ఉంటే... ఈ రోజు రీనీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు! అయితే రీనీ ఆగిపోలేదు. ఈ రోజు ప్రముఖ మోడల్. ఇటీవలే మొదలైన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రెండువేలకు పైగా ఫాలోవర్లున్నారు. గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావడానికి ఒంటి రంగు కారణంగా ఎన్ని రకాలుగా వివక్షకు లోనయిందో పూసగుచ్చినట్లు చెప్తోందామె రీనీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో.చత్తీస్‌ఘర్‌లోని బగీచా గ్రామానికి చెందిన అమ్మాయి రీనీ కంజూర్. నలుపును తెలుపు చెయ్యడం గొప్పా!!
మోడలింగ్ మీద రీనీ పెంచుకున్న అభిరుచిని చంపేయడానికి అడుగడుగునా ఒకరుండేవాళ్లు. ‘ఈ రంగం గురించి నీకు తెలియదు, ఇందులో రాణించాలంటే క్లయింట్స్ సంతృప్తి చెందాలి. నీ స్కిన్ కలర్ చూస్తే దగ్గరకు రానివ్వరు. మిగిలిన మోడల్స్ చూడు ఎలా ఉన్నారో’.. ఇలా మాటలు ఆమెను శరాఘాతంలా తాకాయి. ఒక ఫొటోగ్రాఫర్ అయితే... ‘ఆమెకు మూడు–నాలుగు టచప్‌లిచ్చి కొంచెం తెల్లగా కనిపించేట్టు చేయి’ అని రీనీకి తెలియకుండా మేకప్‌మన్‌కి చెప్పాడు. ఆ మేకప్‌మన్ కూడా ఫొటోగ్రాఫర్‌కంటే తక్కువ వాడేమీ కాదు. ‘నల్లగా ఉన్న అమ్మాయిని అందంగా చూపించడం పెద్ద చాలెంజ్, నా మేకప్ నైపుణ్యంతో ఆ పని చేయగలిగాను’ అన్నాడు. అది తెలిసి రీనీ బాధపడింది. ఇదిలా ఉంటే... తీసిన ఫొటోలను ఫొటోషాప్‌లో తెల్లగా చేసే ప్రయత్నం జరిగేది. ‘నన్ను నన్నులా ఉండనివ్వండి. నా ఒంటి రంగు ఉన్నదున్నట్లు్ల కనిపించమే నాకిష్టం, లేని తెల్లదనాన్ని అద్దవద్దు’ అని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ వినేవారు కాదు.
రిహాన్నాతో పోలిక ఓ మలుపు
మోడలింగ్‌లో రీనీకి ఎదురవుతున్న విమర్శలు, కామెంట్‌లతో పోరాడుతూనే ఆ రంగంలో కొనసాగుతున్న రీనీకి ఓ రోజు ఆమె ఫ్రెండ్స్ చెప్పిన మాట ఎక్కడ లేని ఉత్సాహాన్నిచ్చింది. ‘బార్బేడియన్ సింగర్ రిహాన్నా కూడా నీలాగే ఉంటుంది’ అని స్నేహితులు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది.రిహాన్నా గాయని మాత్రమే కాదు, పాటల రచయిత్రి, నటి, బిజినెస్ ఉమన్ కూడా. ఆ తర్వాత.. మేకప్ లేకుండా, ఫొటోగ్రఫీ మెళకువలతో తెల్లగా చేయకుండా యథాతథంగా రీనీని ఫొటోలు తీశారు స్నేహితులు. రీనీ, రిహాన్నా ఫొటోలను పక్క పక్కన పెట్టి ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో రీనీకి విపరీతమైన గుర్తింపు వచ్చింది.
కలువలతో పోల్చడం తప్పు
దేహఛాయ దేనికీ ప్రామాణికం కాదు, అందానికి అసలే కాదు. అసలైన అందం ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది. అందుకు నిదర్శనమే రీనీ, రిహాన్నా. నల్లగా ఉన్న అందమైన అమ్మాయిని ‘నల్ల కలువ’తో పోలుస్తారు. ఆ పోలిక మరింత అగౌరవపరచడమే. కలువ ఏ రంగులో ఉన్నా కలువే. కలువకు రంగును ఆపాదించకుండా... నల్లగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ... చర్మాన్ని తెల్లబరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను నిరభ్యంతరంగా పక్కన పెట్టేయాలి. ఆ డబ్బుని, సమయాన్ని తమను తాము వ్యక్తిగా నిలబెట్టుకోవడానికి చేస్తే పరిపూర్ణత్వం వస్తుంది. అదే అసలైన అందం.
రిహాన్నాను కలవడమే నా కల
ఒకప్పుడు మోడలింగ్‌కి పనికిరావన్న ఫొటోగ్రాఫర్లే ఇప్పుడు క్లయింట్లతో ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ గురించి చెప్తున్నారు. పాప్ స్టార్ రిహాన్నా అందగత్తె కాదని ఎవరూ అనలేరు, కాబట్టి రీనీని కూడా అందగత్తె కాదనే సాహసం చేయడంలేదెవ్వరూ ఇప్పుడు. ‘నలుపులో అందం ఉండదనే అభిప్రాయాలను మార్చుకోండి, ఇప్పటి వరకు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోండి’ అంటోంది రీనీ. రీనీ స్ఫూర్తితో ఇప్పుడు మోడలింగ్‌లోని సాంకేతిక నిపుణులు ఇప్పుడు వాళ్ల రూల్స్‌ని మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ‘తెల్లటి దేహ ఛాయలోనే అందం ఇమిడి ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటున్నారు. ‘‘కొత్త నియమావళి రూపొందుతోందంటే మార్పు మొదలైనట్లే. ఒక మార్పుకు నేను కారణమైనందుకు సంతోషంగా ఉంది. దీనికంతంటకీ కారణమైన రిహాన్నాను కలవడమే ఇప్పుడు నా ముందున్న కల’ అంటోంది రీనీ.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment