ఒకసారి పేరొచ్చేస్తే ఇక అదెక్కడికీ పోదు. ఆ పేరున్న చోటికే అందరూ వచ్చేస్తారు. వీణా నాగ్దాకు బాలీవుడ్ పెళ్లిళ్ల ‘మెహందీవాలా’ అనే పేరు వచ్చేసింది. ఎవరింట్లో పెళ్లి జరిగినా, పెళ్లికూతురు చేతులపై పండేది వీణ పెట్టిన గోరింటాకే. నిన్న సోనం పెళ్లి జరిగింది కదా! ఆమె చేతులకు మొన్న ‘మెహందీ ఫంక్షన్’లో గోరింటాకు పెట్టింది కూడా వీణమ్మే! గుండెల్ని మీటేలా గోరింటాకు పెట్టడంలో ఆమె ఎక్స్‌పర్ట్. సోనమ్ పెళ్లి మాట అటుంచండి, సోనమ్ చిన్నప్పట్నుంచి కూడా ఆమెకు మెహందీ దిద్దుతోంది ఈ మెహందీ క్వీనే. శిల్పాశెట్టి, ఆసిన్ కూడా తమ పెళ్లికి వీణ దగ్గరే గోరింటాకు పెట్టించుకున్నారు. ఏటా ‘కర్వాచాత్’కి శ్రీదేవి తప్పనిసరిగా వీణను పిలిపించుకుని తన అరిచేతుల్ని పండించుకునేవారు. పెళ్లిళ్లకే కాదు, పెద్ద పెద్ద ఈవెంట్‌లకు పెద్దవాళ్లు ఎవరు పిలిచినా వెళ్లి గోరింటాకు పెడుతుంటారు వీణ. సీనియర్ క్రికెటర్ వెంగ్‌సర్కార్ కూతురు పెళ్లికీ, కరిష్మా కపూర్ మెహిందీ ఫంక్షన్‌కీ, దీపికా పదుకోన్ చేతులకు ఈవిడే మెహందీని డిజైన్ చేశారు. ఇదంతా వింటున్నప్పుడు.. నిజానికి పండింది వీణ పంటే అనిపిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. పెద్దవాళ్ల చేతుల్ని అలంకరించే అవకాశం రావడం మాటలా మరి!
అరిచేతులపై అదృష్టరేఖలు
వీణా నాగ్దా ముప్పై ఏళ్లుగా గోరింటాకు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా గోరింటాకు పెట్టగల మెహందీ డిజైనర్‌గా ఆమె పేరున ఒక రికార్డు కూడా ఉంది! అంతే కాదు, ఓ నమ్మకం కూడా ఉంది. వీణ గోరింటాకు పెడితే అదృష్టం కలిసి వస్తుందని! అందుకే లిజ్ హర్లీ నుంచి కాజోల్ వరకు, కరిష్మ దగ్గర్నుంచి సోనమ్ వరకు ఆమె ముందు చెయ్యి చాపారు. ఆమెకు మెహందీ క్వీన్ అని పేరు పెట్టిందెవరో తెలుసా? కరణ్ జోహార్! వీణ ముంబైలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. టెన్త్ వరకే చదివారు. ఆర్థికంగా బాగోలేక కాదు. చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేక! ఆ తర్వాత మెల్లిగా మెహందీ డిజైనర్ అయిపోయారు. బ్రైడల్, నెయిల్ పాలిష్, షేడెడ్, హీరా–మోటీ, జర్దోసీ, అరబిక్, బ్లాక్ మెహందీ, స్టోన్/సీక్వెన్స్/స్వీరోస్కీ డైమండ్ మెహిందీలు పెట్టడంలో వీణ స్పెషలిస్ట్. ఈ కళలో అప్‌డేట్ అవడం కోసం ఆమె విదేశాల్లో కూడా తిరిగొచ్చారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లు ఖుషీ కభీ ఘమ్, కల్ హో న హో, మేరే యార్ కీ షాదీ హై, గాడ్ తుస్సీ గ్రేట్ హో, యు మి ఔర్ హమ్, పాటియాలా హౌస్, ఏ జవానీ హై దివానీలలో కనిపించే మెహందీ వర్క్ అంతా వీణదే. ఇక వాడుకగా ఈమెతో మెహందీ పెట్టించుకునే వాళ్ల లిస్టు కాస్త పెద్దదే. డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, రేఖ, ట్వింకిల్ ఖన్నా, శ్వేతాబచ్చన్, రాణీ ముఖర్జీ, ఫరా ఖాన్, నేహా దుపియా, ప్రీతీ జింతా, నీతా అంబానీ, ప్రఫుల్ పటేల్ కూతురు అంజలీ పటేల్.. ఆ జాబితాలోని కొందరు సెలబ్రిటీలు.
Comments
Please login to add a commentAdd a comment