
ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు. గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎల్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు.
బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు. కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, ‘నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను’ అన్నాడు. పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment