మంత్రిగారి పడిశం
హ్యూమర్‌ప్లస్
ఒక మంత్రిగారికి పడిశం పట్టింది. మూడుసార్లు బర్రున ముక్కుని చీదేసరికి లోకం అల్లకల్లోలమైపోయింది. భర్త మీద దిగులుతో మొదట భార్య మంచం పట్టింది. ఆయుర్వేద వైద్యుడొచ్చాడు. మంత్రి ముక్కుని సున్నితంగా బిరడా తిప్పినట్టు తిప్పాడు. ‘‘డబ్బుని ఎక్కువగా వాసన చూడ్డం వల్ల వచ్చిన జలుబు ఇది. నాసికా రంధ్రాల్లో మందార తుషార సప్తవర్ణ ద్రావకాన్ని పోస్తే తగ్గిపోతుంది’’ అని నాలుగు చుక్కలు ముక్కులోకి జారవిడిచి వెళ్లిపోయాడు. ఆ ఘాటుకి మంత్రి నాలుగుసార్లు తుమ్మాడు. వెంటనే ఒక సిద్ధాంతి వచ్చి రాహుకాలంలో తుమ్మడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోడానికి ముప్పయి రెండు గళ్లతో కూడిన చతురస్రాన్ని గీశాడు. గవ్వలను పలుమార్లు విసిరి గుణించి, గణించి, ఏం పరవాలేదని వ్యాఖ్యానించి నిష్ర్కమించాడు.
ఈలోగా మంత్రి అభిమానులు ఆయన జలుబు గురించి ఫేస్‌బుక్‌లో పెట్టారు. కన్ఫ్యూజన్‌లో మొదట కొన్ని వేలమంది లైక్స్ కొట్టారు. తరువాత నాలుక కరుచుకుని మంత్రిగారి ముక్కు తొందరగా కోలుకోవాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. కొంతమంది గుళ్లల్లో పూజలు కూడా మొదలుపెట్టారు. టీవీల వాళ్లు ఇది తెలిసి కెమెరాలు, మైకులు పట్టుకుని ఒక్క దూకు దూకారు. మంత్రి మొహంపై కెమెరాలు పెడితే ఆయన కర్చీఫ్‌ని ముక్కుకు పెట్టుకుని చిర్రుమని సౌండ్ చేసి ఏం మాట్లాడకుండా కళ్లు, ముక్కు తుడుచుకున్నాడు.
‘‘పడిశం వల్ల ప్రజాసేవ చేయలేకపోతున్నందుకు ఆయన కన్నీళ్లు పెడుతున్నాడు’’ అని ఓ యాంకర్ చెప్పగానే టీవీ స్టూడియోలో చర్చ మొదలుపెట్టారు. గ్రేట్ రాబరీ ఆస్పత్రి ఇఎన్‌టి స్పెషలిస్ట్‌లు తమ అభిప్రాయాల్ని చెప్పారు. ‘‘ప్రజల్నే తమ ఊపిరిగా భావించేవాళ్లకి గాలి ఆడకపోతే చాలా ప్రమాదం. అనాటమీ దృష్ట్యా అందరి ముక్కు నిర్మాణం ఒకటే అయినప్పటికీ అధికారంలో ఉన్న వారి ముక్కు కొంత ప్రత్యేకతని కలిగి ఉంటుంది’’ అని ఒకాయన చెప్పాడు. ‘‘అసలు జలుబు, పడిశం ఒకటేనా?’’ అని ఇంకో ఆయన సందేహం వెలిబుచ్చాడు. ఈ విషయంపై ఒపీనియన్ అడగడానికి వాషింగ్టన్‌లో ఉన్న ముఖేష్ అనే ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ని తెరపైకి తెచ్చారు. ఆయన అసలే ముక్కోపి. టీవీ వాళ్లు అడిగిన ప్రశ్నకి పిచ్చి ఇంగ్లిష్‌లో గట్టిగట్టిగా అరిచాడు. మధ్యలో వాడినెందుకు పిలిచారని లోకల్ డాక్టర్లు యాంకర్‌పైకి ముక్కంటిలా ఆగ్రహించారు.
ఇదిలా ఉండగా మంత్రిగారి ఇల్లు జనసంద్రమైంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్ వన్‌లు, గ్రూప్ టెన్‌లు అందరూ విషాద వదనాలతో రావడం, మంత్రిని పరామర్శించడం జరిగిపోతోంది. వచ్చేవాళ్లు తలా ఒక కర్చీఫ్ కూడా తీసుకుని మంత్రికి ఇస్తున్నారు. చాలామంది ఆయన ముక్కుని తుడవడానికి పోటీపడ్డారు. ముక్కు మంటెత్తుకునేసరికి మంత్రికి ముక్కోటి దేవుళ్ళు కనిపించారు. ఈలోగా వైద్య నిపుణుల బృందం వచ్చి 92 రకాల రక్తపరీక్షలు చేయాలని చెప్పింది. ప్రతిదానికి బినామి వాడుకునే అలవాటు వుండడం వల్ల మంత్రి తనకి బదులుగా పీఏకి టెస్ట్‌లు చేయించాడు. అంతా నార్మల్ అని చెప్పేసరికి మంత్రి ఆనందంగా నిట్టూర్చాడు.ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులు ఫోన్ చేసి, ప్రత్యేక విమానంలో అక్కడికి వచ్చేయమన్నారు. అధికారంలో వుంటే జలుబు తప్పదని, బయటి పొల్యూషన్‌కి అదనంగా పొలిటికల్ పొల్యూషన్ కూడా యాడ్ కావడమే దీనికి కారణమని విశ్లేషించారుకట్ చేస్తే కొంతకాలానికి మంత్రికి అధికారం పోయింది. ఈ విషయం తెలియక పడిశం మళ్లీ వచ్చింది. మంత్రి నాలుగుసార్లు చీది చుట్టూ చూశాడు. నరమానవుడు కనిపించలేదు. భార్యని కేకేశాడు. తుండుగుడ్డని ఉండలా చుట్టి మొహం మీదకు విసిరేసింది.
నీతి: అధికారమనేది పడిశం లాంటిది. పట్టినట్టే పట్టి వదిలిపోతుంది. అప్పుడు మన ముక్కు మనమే తుడుచుకోవాలి.
- జి.ఆర్.మహర్షి