ఆ చేతి బజ్జీ | Mirchi Bajji iS Famous In Chirala Town | Sakshi
Sakshi News home page

ఆ చేతి బజ్జీ

Published Sat, Sep 28 2019 3:42 AM | Last Updated on Sat, Sep 28 2019 3:42 AM

Mirchi Bajji iS Famous In Chirala Town - Sakshi

చలి గజగజ వణికిస్తున్నా... జోరున వాన కురుస్తున్నా... వెంటనే బజ్జీలు, పునుగుల మీదకు మనసు వెళ్తుంది...ఆవురావురుమంటూ లాగిస్తూ, ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది...పుల్లారావు బజ్జీలకు యమ క్రేజ్‌... ఏ సీజన్‌లో అయినా ఆ బజ్జీల రుచి చూడాల్సిందే... స్వచ్ఛమైన బజ్జీ, పునుగులను రుచి చూడటం కోసం బారులు తీరతారు చీరాల వాసులు... 30 సంవత్సరాలుగా బజ్జీ ప్రియులకు విందు చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు పుల్లారావు... ఇక్కడి బజ్జీల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొని తింటారు... పుల్లారావు వ్యాపార విజయ రహస్యమే ఈ  వారం మన ఫుడ్‌ ప్రింట్స్‌...

రాత్రి ఏడు గంటలైతే చాలు ఆ ప్రాంతమంతా కమ్మని సువాసనలు వెదజల్లుతుంది. అటుగా వెళ్తున్నవారంతా ఆ వాసన ఏంటా అనుకుంటూ అక్కడకు వస్తారు. అంతే! మరి అక్కడ నుంచి కాలు కదపలేకపోతారు. అప్పటికే అక్కడ క్యూలో నిలబడినవారిని అడిగి విషయం తెలుసుకుంటారు. ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ తిరునాళ్లను తలపిస్తుంది.

చిన్నదే అయినా...
చూడటానికి చిన్న అంగడే అయినా అక్కడ దొరికే బజ్జీ, పునుగులను ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వేడివేడిగా లభ్యమయ్యే పుల్లారావు బజ్జీలంటే చీరాల పట్టణ వాసులకు యమ క్రేజ్‌. స్వచ్ఛమైన పదార్థాలతో, రుచికరంగా తయారు చేసే పునుగు, బజ్జీలను గత మూడు దశాబ్దాలుగా చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు పుల్లారావు. స్థానిక కొట్లబజారు రోడ్డులోని తుపాకి మేడ దగ్గర ఊర పుల్లారావు  చిన్న బడ్డీ బంకు పెట్టి, అందులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు.

ఇలా చేస్తారు...
బజ్జీలకు పచ్చి పప్పు మాత్రమే ఉపయోగిస్తారు. వాటి పిండిని బాగా మెత్తగా చేసి ఉప్పు, కారం అన్ని సమపాళ్లలో కలిపి, స్పెషల్‌గా తెచ్చిన మిరపకాయలను కోసి, వాటిలో వాము పొడిని తగినంతగా చేర్చి, కాగిన నూనెలో రెండు సార్లు వేయించుతారు. అందుకే వాటికి అంత రుచి అంటారు బజ్జీ తిన్నవారంతా. మినప్పప్పు, బియ్యప్పిండిని వాడుతూ రుచికరమైన పునుగులను తయారుచేస్తారు. పునుగు పిండితో తయారుచేసిన బరోడా బజ్జీ, బొండాలకు మరింత క్రేజ్‌ ఉంది. ఆ బజారులో ఎన్నో బజ్జీల షాపులున్నా పుల్లయ్య బజ్జీల షాపు దగ్గరే జనం కనిపిస్తారు. స్వచ్ఛమైన నూనె, మన్నిక కలిగిన పదార్థాలతో రుచికరంగా తయారయ్యే పుల్లయ్య బజ్జీలను తిన్న ఎంతటివారైనా ‘వాహ్వా! పుల్లయ్య బజ్జీ!!’ అని పొగడక మానరు.
– సంభాషణ, ఫొటోలు:
పి. కృష్ణ చైతన్య, చీరాల అర్బన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement