మిస్సవకమ్మ | mismma To Creativity | Sakshi
Sakshi News home page

మిస్సవకమ్మ

Published Fri, Jul 31 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

మిస్సవకమ్మ

మిస్సవకమ్మ

పాత సినిమాల గురించి ఓ ముక్క రాయాలంటే...
క్రియేటివిటీకి పాతరేసినంత భయం వేస్తుంది!
ఈ రోజుల్లో క్రియేటివిటీ... మోస్ట్ అబ్యూజ్డ్.
కొంచెం అర్థం కాకుండా ఏదైనా చేస్తే దాన్ని క్రియేటివిటీ అంటున్నాం.
తేడాగా చేస్తే... అదే... కొంచెం డిఫరెంటుగా చేస్తే... క్రియేటివిటీ అనుకుంటున్నాం.
మరి ‘మిస్సమ్మ’ లాంటి మాస్టర్ పీస్ గురించి నాలుగు ముక్కలు రాయాలంటే...
అది... సూర్యుడికి దీపం చూపించే ప్రయత్నమే.
మా ఈ ప్రయత్నం... గొప్పగా కనపడకపోయినా...
కూసింత కలాపోసన ఉందనుకుంటే చాలు.
వెండితెర మీద వచ్చిన బంగారంలాంటి సినిమాలను మీకు
తరచు ఇలా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
మీ మనసు గెలుచుకోగలమని నమ్ముతున్నాం.
ఎంజాయ్!

 
‘గుడ్‌మాణింగ్’. సావిత్రికి ఎన్టీఆర్ అరకొర గుడ్‌మాణింగ్.
‘గుడ్‌మాణింగ్’. ఎన్టీఆర్‌కి సావిత్రి కొరకొర గుడ్‌మాణింగ్.
సీన్ ‘మిస్సమ్మ’.
      
హీరో... కూల్ గయ్. హీరోయిన్... చిటపటల టపాకాయ్.
చాలా చూశాం.
‘తన మతమేదో తనదోయ్... పర మతమసలే పడదోయ్..’
చాలా విన్నాం.
 
అవునా! ఇవాళేం చూడబోతున్నారు? ఏం వినబోతున్నారు?  
 బయటికెళితే... బాహుబలి, జిల్లా, జేమ్స్‌బాండ్, మిర్చిలాంటి కుర్రాడు, పాండవుల్లో ఒకడు, ధనలక్ష్మి తలుపు తడితే, మంత్ర-2, ఛాలెంజ్...
 ఇంట్లో ఉంటే ప్లెంటీ! బ్లేడు బాబ్జి, హార్ట్ ఎటాక్, నాయక్, నవ్వు నాకు నచ్చావ్, రక్తచరిత్ర, పొట్టేలు పున్నమ్మ, మాధవయ్యగారి మనవడు, మంచి మనుషులు, సారాయి వీర్రాజు, అఖండుడు, బిగ్‌బాస్, పార్టీ, పెళ్లి సందడి, సీమ టాపకాయ్, ఆ రోజు, అంతకుముందు ఆ తర్వాత, ఒకే ఒక్కడు...
      
ఓ పని చేద్దాం. మిస్సమ్మను చూడొద్దు. వినొద్దు. ఊరికే చదువుదాం.
టైమ్‌పాస్‌కా? కాదు.
టైమ్ టెస్ట్ కా? కాదు.
ఇప్పుడెందుకీ బ్లాక్ అండ్ వైట్!!
ఎల్వీ ప్రసాద్ రికార్డెడ్ ఎవ్రీథింగ్... ‘ఇన్ బ్లాక్ అండ్ వైట్’.
ఐతే ఏం చేస్కోవాలి?
అప్పుడప్పుడూ చూస్కోవాలి.
మిస్సమ్మనా? కాదు.
మరి?! మనల్నే.
ఎక్కడ చూస్కోవాలి?
మిస్సమ్మలోనే...
ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్నార్, జమున పక్కన... మనమెందుకు కనిపిస్తాం? కనిపించం.
రేలంగి పాడే వీధి పాటల గుంపులో మన యాన్‌సెస్టర్స్ కనిపిస్తారా? కనిపించరు.
మరి? మనలో ఏదో మిస్ అవుతోంది బాస్. అది కనిపిస్తుంది.
      
కథ. తెలుసు. మిస్ అయిన అమ్మాయి... ‘మిస్’ అమ్మగా దొరకడం. అదొక్కటే కాదు.
ఒక్కటే ఎలా ఉంటుంది లెండి. కథ మధ్యలో కొన్ని కామెడీ సీన్లు. కొన్ని ఎమోషన్లు. కామనే కదా.  
అన్‌కామన్ థింగ్ ఒకటి ఉంది.
అన్‌కామన్ అంటే?
అరవై ఏళ్ల నాటి సినిమా... అరవై ఏళ్ల తర్వాత కూడా... కాంటెంపరరీ అనిపించేలా ఉండడం.
ఎవరు చూడొచ్చారూ?
ఎవరో చూడనక్కర్లేదు. మీరొక్కసారి చూస్తే చాలు.
చూశాం. చెప్పండి.
చూశాక కూడా ‘చెప్పండి’ అంటున్నారంటే మళ్లొక్కసారి మీకు సినిమా చూపించాల్సిందే.
      
ఎస్వీ రంగారావు జమీందార్. ఆయన భార్య రుష్యేంద్రమణి. వాళ్లకో స్కూలు. మహాలక్ష్మి ప్రాథమిక పాఠశాల. వాళ్ల చిన్నమ్మాయి జమున. పెద్దమ్మాయి సావిత్రి. రంగారావు మేనల్లుడు అక్కినేని నాగేశ్వరరావు. సావిత్రి చిన్నప్పుడు కాకినాడ సముద్రతీరంలో తప్పిపోతుంది. నాలుగేళ్లప్పుడు! తప్పిపోయి పదహారేళ్లు. అంటే ఇప్పుడు సావిత్రి ఇరవై ఏళ్ల యువతి! ఆమెను వెదకి కనిపెట్టాలంటే ఒకటే గుర్తు. కుడికాలి మీద దమ్మిడీ అంత పుట్టుమచ్చ. ఇంకో గుర్తు మెడలో పులిగోరు. ఎవరు కనిపెడతారు? ‘నేను కనిపెడతాను’ అంటాడు అక్కినేని. అతడో లోకల్ డిటెక్టివ్. కామెడీకి కనెక్టివ్.

ఎస్వీఆర్, రుష్యేంద్రమణి తర్వాత... సినిమాలో ఇంకో జంట ఎన్టీ రామారావు, సావిత్రి. వీళ్లిద్దరూ భార్యాభర్తలు కాదు. నిరుద్యోగులు. ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటిస్తారు. ‘భార్యాభర్తలు అయినవాళ్లు టీచర్లుగా కావలెను’ అనే ప్రకటన చూసి జమీందారుగారి స్కూల్లోనే జాయిన్ అవుతారు. ఈ సావిత్రి ఎవరో కాదు. చిన్నప్పుడు తప్పిపోయిన జమీందారు గారి పెద్దమ్మాయి. ఈ విషయం మనకు తెలుస్తుంది. మనకు అంటే ఆడియెన్స్‌కి. లోపలి పాత్రలకు తెలీదు.  తప్పిపోయినప్పుడు ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. తప్పిపోయి క్రిస్టియన్ దంపతులకు దొరికాక ... మేరీ.

మూడో జంట... అక్కినేని, జమున. వీళ్లూ భార్యాభర్తలు కాదు. కాబోయే భార్యాభర్తలు. నాలుగో జంట సావిత్రిని పెంచిన అమ్మానాన్నలు. ఈ నాలుగు జంటలు ప్లస్ రేలంగి ప్లస్ రమణారెడ్డి, మరికొన్ని చిన్నా చితక పాత్రలు, ఆరోగ్యకరమైన హాస్యాలు, సరదా సెటైర్లు వీటితో మిస్సమ్మ నడుస్తుంది. రేలంగిది ‘బాబ్బాబ్బాబు’ క్యారెక్టర్. తర్వాత్తర్వాత ఎన్టీఆర్‌కి సహాయక పాత్ర అవుతాడు. రమణారెడ్డి అప్పిచ్చినవాడు. మేరీ పేరెంట్స్‌కి అప్పిచ్చి, మేరీనిచ్చి పెళ్లి చేస్తే ఆ అప్పు తీర్చనవసరం లేదని మేరీ ఎదురుపడినప్పుడల్లా అంటుంటాడు. చివరికొచ్చేసరికి క్యార్టెర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. అలా రాసేశారు చక్రపాణి. అలా తీసేశారు ఎల్వీ ప్రసాద్.

ఎట్ ది ఎండ్. నిజాలు తెలుస్తాయి. సావిత్రి... పాల్ దంపతుల సొంత కూతురు కాదని తెలుస్తుంది. మిస్ మేరీ తమ కూతురు మహాలక్ష్మీనేనని ఎస్వీరంగారావు ఫ్యామిలీకి తెలుస్తుంది. ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలు కాదని తెలుస్తుంది. ఇంకా చివరికొచ్చేసరికి... సావిత్రి తనను పెంచిన తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతానంటుంది. ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎన్టీఆర్‌కీ సావిత్రికి, ఏఎన్నార్‌కి జమునకు పెళ్లి ఫిక్స్ చేసేస్తారు ఎస్వీరంగారావు. ఆ వెంటనే శుభం.
      
ఇక్కడితో పైపై సినిమా అయిపోతుంది. అసలు సినిమా... అద్భుతమైన ఆ డైలాగుల్లో ఉంది. అసలు సీన్లు ఆహ్లాదకరమైన ఆ పాటల్లో ఉన్నాయి. మిస్సమ్మ కథ మొత్తాన్నీ చక్రపాణి చక్కటి మాటల్లో చెప్పేస్తే... అంతకన్న చక్కటి పాటల్లో పింగళి నాగేంద్రరావు శిల్పంలా చెక్కి వదిలిపెట్టారు. సంగీతాన్ని సాలూరు రాజేశ్వరరావుకు సమర్పించి ఇక చూస్కోమన్నారు. అందుకే సినిమా అంత తియ్యగా ఉంది. సాఫ్ట్‌గా, స్మూత్‌గా సాగింది.

ఇక డైలాగ్స్. విన్నా,  చూసినా... వన్స్‌మోర్.
శాంపిల్‌గా చిన్నముక్క.

డిటెక్టివ్ అక్కినేని... ఎన్టీఆర్, సావిత్రిల కదలికల్ని అనుమానిస్తుంటాడు. ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకోడానికి రేలంగి దగ్గరికి వస్తాడు.  
అక్కినేని: ఏవోయ్... మీ పంతులు, పంతులమ్మ ఎంతో ప్రేమించుకున్నారన్నావ్, అట్లా పోట్లాడుతున్నారేమోయ్.
రేలంగి : అసలు మొగుడూ పెళ్లాల సంగతి మీకెందుకు సార్. పగలు పోట్లాడుకుంటారు. రాత్రుళ్లు మాట్లాడుకుంటారు.
అక్కినేని : అదేమిటోయ్ మరి రాత్రిళ్లే పోట్లాడుకుంటున్నారే.
రేలంగి : ఆ... మరి బిఏలంటే ఏమనుకున్నారు... రాత్రుళ్లు పోట్లాడుకుంటారు. పగలు మాట్లాడుకుంటారు.  
      
మిస్సమ్మలో రొమాన్స్ కూడా చాలా సున్నితంగా, నిశితంగా కనిపిస్తుంది. రెండుమూడు ముక్కల్లో తేలగొట్టేస్తారు మాటల రచయిత.
 సావిత్రి... ఎన్టీర్‌కి దూరంగా ఉంటుంది. అలాగని జమున ఎన్టీఆర్‌కి దగ్గరవుతుంటే (మానసికంగా కాదు, మాస్టారిగా) చూడలేదు. ఒక సందర్భంలో జమున ఎన్టీఆర్ మీద మీద పడుతుండడం, ఎన్టీఆర్ ఆమెను ఎంటర్‌టైన్ చెయ్యడం చూసి ఉడికిపోతుంది సావిత్రి. పరుగున వెళ్లి తను మెడ్రాస్ వెళ్లిపోతున్నట్టు లెటర్ రాసి ఎస్వీరంగారావుకి పంపిస్తుంది. అది తెలుసుకుని సావిత్రిని సముదాయించడానికి ఎన్టీఆర్ వెళతాడు. ఆ సందర్భంలో...
ఎన్టీర్ : చూడండి
సావిత్రి : ఏమిటి
ఎన్టీఆర్ : మీతో ఏం చెప్పాలన్నా భయమే.
సావిత్రి : ఇంకా భయమెందుకు... రెండ్రోజుల్లో నే వెళుతున్నాగా. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు.
ఈ నాలుగు మాటల్లోనే  సావిత్రికి ఎన్టీఆర్‌పై ప్రేమ మొదలైన విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది.
      
పాత... సాగతీత అనుకుంటాం. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనుకుంటాం. అప్పటి హాస్యం కాస్త హెవీగా ఉంటుందనుకుంటాం. మిస్సమ్మలో అలా ఉండదు. అన్నీ సహజంగా, తేలిగ్గా, సాఫీగా సాగిపోతుంటాయి. రెండు గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా పెట్టేంత ప్రెషర్‌ని... మిస్సమ్మ మన మైండ్ పై గానీ సోల్‌పై గానీ పెట్టదు. కానీ మన మైండ్, సోల్ మళ్లీ ఒకసారి ఆ సినిమాని చూడాలని ఇప్పటి లైఫ్‌స్టెయిల్‌లో ఒక్కసారైనా కోరుకుంటాయి. కనీసం అందులోని ఒక్కపాటైనా వినాలని గానీ, చూడాలని గానీ కోరుకుంటాయి.
 
ఇంతకీ...
మనలో ఏం మిస్ అవుతోంది? మిస్సమ్మలో అది ఎక్కడ కనిపిస్తుంది? ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఏ పాత్రా అతికష్టం మీద ప్రయాసపడి జీవించదు. లైట్ లైట్‌గా ఉంటుంది. మనమూ అంతే తేలిగ్గా మనం ఈ జీవితాన్ని మోయాలి. బరువనిపిస్తే దించి మళ్లీ ఎత్తుకోవాలి. అంతే తప్ప, కాంప్లికేట్ చేసుకోకూడదు. లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్.  
 - సాక్షి ఫ్యామిలీ
 
 మిస్సమ్మ... స్మూత్ అండ్ నేచురల్

 ‘‘మా పెదనాన్న గారు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘మిస్సమ్మ’ లాంటివి ఎవర్‌గ్రీన్. చిన్నప్పుడెప్పుడో చూసిన ఆ సినిమా ఇప్పటికీ చూస్తుంటే, ఎంత మంచి సినిమా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా, ఆ సినిమాలో తెరపై కథ చెప్పే ఆ విధానం, ఎడిటింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎల్వీ ప్రసాద్ గారి నుంచి ఎడిటింగ్‌లో నేనొక టెక్నిక్ నేర్చుకున్నా. రెండు పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక పాత్ర డైలాగ్‌కీ, మరొక పాత్ర రెస్పాన్స్‌కీ మధ్య ఒక నేచురల్ పాజ్, టైమింగ్ ఉంటాయి. కోపం, బాధ, ప్రేమ, కొట్లాట - ఇలా ఆ సన్నివేశంలోని సందర్భాన్ని బట్టి అవి మారిపోతుంటాయి. ఎల్వీ ప్రసాద్ గారు సరిగ్గా ఆ టైమింగ్‌ను ఒడిసిపడుతూ షూటింగ్ చేసేవారు. ఎడిటింగ్ కూడా ఆ నేచురల్ టైమింగ్ ఉండేలా చేసేవారు. అందుకే, ఇవాళ్టికీ ఆ సినిమాలు కానీ, ఆ ఎడిటింగ్ కానీ స్మూత్‌గా, నేచురల్‌గా ఉంటాయి. కానీ, ఇటీవల చాలామంది అది పాటించకుండా, స్పీడ్ పెంచేశారు. అందువల్లే మనకవి సహజంగా ఉన్నట్లనిపించవు. ‘మిస్సమ్మ’ అలా కాదు. అందుకే, ఇవాళ్టికీ ఆ సినిమా, అందులోని హాస్యం ఆకట్టుకుంటాయి. ఎల్వీ గారి నుంచి నేర్చుకున్న ఆ టెక్నిక్‌నే ఎడిటింగ్‌లో నేను ఇప్పటికీ పాటిస్తుంటా.’’
 - ఎ. శ్రీకర్‌ప్రసాద్,
 ఎనిమిది నేషనల్ అవార్డులందుకున్న ఎడిటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement