ఒకరికి సహాయపడటం తప్పంటారా?
అప్పటికే వ్యాపారంలో పీకలలోతు నష్టాల్లో ఉన్న నాకు ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు సంపాదించడం పెనుభారంగా మారింది. నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. మరోవైపు మా ఆవిడ ఆందోళన పడుతోంది.నేను డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అనవసర ఖర్చు అనేది నా డిక్షనరీలోనే లేదు. ఒకసారి నా చీటీ డబ్బులు లక్ష రూపాయలు ఆపదలో ఉన్న ఒక స్నేహితుడికి ఇచ్చాను. ఈ విషయం మా ఆవిడకు తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయింది.
‘‘వెంటనే డబ్బు వెనక్కి తీసుకో’’ అని హుకుం జారీ చేసింది. ఆమె మాటలు నన్ను విపరీతంగా బాధ పెట్టాయి. ‘‘డబ్బు ఇవ్వగలవా? అర్జెంట్‌గా ఒక అవసరం వచ్చి పడింది’’ అని స్నేహితుడిని చాలా సున్నితంగా అడిగి చూశాను. ‘‘తప్పకుండా’’ అన్నాడు.ఎన్ని ఇబ్బందులు పడ్డాడోగానీ, మూడు రోజుల్లోనే నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేశాడు. ఆ రోజు మా ఆవిడ ఎంత సంతోషించిందో! కానీ వారం రోజుల వరకు నేను బాధ పడ్డాను. ఇది జరిగిన రెండు సంవత్సరాల తరువాత మా అత్తయ్యకు హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమెకు కొడుకులు లేరు. మా ఆవిడ ఒక్కతే కూతురు. కాబట్టి అల్లుడైనా, కొడుకైనా నేనే.
అప్పటికే వ్యాపారంలో పీకలలోతు నష్టాల్లో ఉన్న నాకు ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు సంపాదించడం పెనుభారంగా మారింది. నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. మరోవైపు మా ఆవిడ ఆందోళన పడుతోంది. ఎలా తెలుసుకున్నాడో ఏమో గానీ, నేను అప్పుడెపు్పుడో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చి, ఆదుకున్న మిత్రుడు మా ఇంటికి వచ్చి ‘‘నన్ను అడగొచ్చు కదరా..’’ అని చీవాట్లు పెట్టి నాకు కావలసిన మొత్తం ఇచ్చాడు.
ఆ డబ్బులతో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. అత్తయ్యగారు క్షేమంగా ఉన్నారు. ‘‘రోజులన్నీ ఒకేలా ఉండవు. ఇతరులకే కాదు... మనకు కూడా ఎప్పుడైనా, ఏదైనా అవసరం రావచ్చు. ఇది దృష్టిలో పెట్టుకో’’ అన్నాను మా ఆవిడతో. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లలో పశ్చాత్తాపం మాత్రం కనిపించింది.
- యస్.కె, విజయవాడ