అద్భుతమైన మస్జిద్‌ల వైపుగా ప్రయాణం... | Mosque amazing journey ... | Sakshi
Sakshi News home page

అద్భుతమైన మస్జిద్‌ల వైపుగా ప్రయాణం...

Published Fri, Jul 4 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

అద్భుతమైన మస్జిద్‌ల వైపుగా ప్రయాణం...

అద్భుతమైన మస్జిద్‌ల వైపుగా ప్రయాణం...

ముస్లిమ్‌ల ప్రార్థనాలయం మస్జిద్. ప్రపంచంలో పేరెన్నికగన్నవి, అత్యద్భుతమైనవి వందల సంఖ్యలో మస్జిద్‌లు ఉన్నాయి. ఈ కట్టడాలను ఒక్కసారి దర్శిస్తే చాలు ముస్లిమ్‌ల నిర్మాణ నైపుణ్యాలు ఎంత గొప్పవో అవగతమవుతాయి. ఇస్లామ్ చక్రవర్తులు తమ కళలను ప్రపంచమంతా ఎలా వ్యాపింపచేశారో తేటతెల్లం అవుతాయి. యూరప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మస్జిద్‌లు ప్రపంచం నలుమూలలా అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా, ఠీవిగా దర్శనమిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పవిత్ర మస్జిద్‌ల గురించి కొంత సమాచారం ఈ వారం...
 
జామా మస్జిద్: న్యూ ఢిల్లీ!
 
మన దేశంలో అతిపెద్దది, అతి సుందరమైనదిగా జామా మస్జిద్‌కు పేరుంది. 1658లో ఎర్ర ఇసుకరాయి, తెల్లని మార్బుల్‌తో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ మస్జిద్‌ను నిర్మించాడు. ఈ మస్జిద్ నిర్మాణానికి 5 వేల మంది, 6 సంవత్సరాల పాటు పనిచేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్‌లో గల ఈ మస్జిద్ ప్రాంగణంలో దాదాపు 25 వేల మంది ఒకేసారి ప్రార్ధనలు జరపవచ్చు.

ఇలా వెళ్లాలి: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన జామా మస్జిద్‌కు 17 కి.మీ. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ. ఢిల్లీలోని మూడు ప్రధాన బస్సు స్టేషన్‌ల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు బస్సు సర్వీసులలో మస్జిద్‌కు చేరుకోవచ్చు.
 
బ్లూ మాస్క్- అజ్రత్ అలీ పవిత్రక్షేత్రం: ఆప్ఘనిస్థాన్

ఆప్ఘనిస్తాన్‌లోని మజర్-ఇ-షరీఫ్ పట్టణంలో ఉంది ఈ మస్జిద్. నీలాకాశం రంగులో ఆప్ఘనిస్థాన్ హృదయపీఠంగా పిలువబడుతున్న ఈ కట్టడాన్ని ‘మజర్’గా పిలుస్తారు. ఇదే పేరుమీదుగా ఈ పట్టణం వృద్ధి చెందింది. హజ్రత్ అలీ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మస్జిద్ చుట్టూ అత్యంత సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి.
 
ఇలా వెళ్లాలి: ఢిల్లీ నుంచి ఆప్ఘనిస్తాన్‌లోని మజర్ కి విమానంలో చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా స్విస్‌వింగ్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా మజర్ చేరుకునే ప్రయాణికులకు రాబోయే 10 రోజుల్లో అత్యంత తక్కువ టికెట్ ధర కేవలం రూ.18771 గా నిర్ణయించింది. ఈ అవకాశం జూలై 15, 2014 వరకు మాత్రమే ఉంది. ఆసక్తి గల వారు www.goibibo.com/flights-schedule/delhi/mazar-i-sharif/కు లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
 
సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దిన్ మస్జిద్: బ్రూనై

బ్రూనై దేశ  రాజధాని అయిన బండార్ సెరి బెగవాన్ ప్రాంతంలో బంగారపు బురుజు గల ఈ మస్జిద్ ఉంది. పసిఫిక్ ఆసియాలోనే అత్యంత సుందరమైన మస్జిద్‌గా పర్యాటకులను ఆకర్షిస్తోంది. 1958లో నిర్మించిన ఈ కట్టడంలో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది. 171 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మస్జిద్ నిర్మాణంలో గాజు తలుపులు, చిమ్నీలు, బురుజులు, పాలరాయి, గ్రానైట్‌ను ఉపయోగించారు.
 
ఇలా వెళ్లాలి: బ్రూనై నది మార్గాన నేరుగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చెన్నై మీనంబాకమ్ విమానాశ్రయం నుంచి - బంగార్ సెరి బెగవాన్‌కు టికెట్ ధర రూ. 30,900 పై చిలుకు.
 
మక్కా మస్జిద్ హైదరాబాద్!

హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నైరుతి దిశలో, 100 గజాల దూరంలో ఉంది ఈ మస్జిద్. ఇందులోని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మస్జిద్ నిర్మాణంలో మక్కా నుండి ఇటుకలు తెప్పించారని, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీనికి మక్కా మస్జిద్‌గా పేరు వచ్చిందని అంటారు. మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని ఇందులో భద్రపరచారని, చరిత్ర చెబుతోంది.
 
ఇలా వెళ్లాలి: దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు, రైలు, అంతర్జాతీయ విమాన సదుపాయాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 11 కి.మీ దూరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement