
మోటర్ బైక్ డైరీ
హ్యూమర్ ప్లస్
బస్ డ్రైవర్ కావాలని చిన్నప్పటి నా కల. చక్రం తిప్పుతున్నప్పుడు అతనో రాజులా కనిపించేవాడు. ఎవర్నీ లెక్కచేయకుండా దుమ్ములేపుకుంటూ వెళ్లే అతని ఠీవి నచ్చేది. అయితే చిన్నప్పుడు అనుకున్నవన్నీ పెద్దయ్యాక జరగవు. వయసు పెరిగేకొద్దీ కలలు తగ్గిపోతాయి. బాల్యంలో గజదొంగ కావాలనుకుని యవ్వనంలో రాజకీయాల్లో చేరినవాళ్లు ఎందరో ఉన్నారు. సారం ఒకటే అయినా రూపంలో తేడా ఉంది కదా!
నేను కూడా బస్ డ్రైవర్ కాకపోయినా బైక్ డ్రైవర్ అయ్యాను. డ్రైవింగ్‌లో ఒక్కొక్కరికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఫేస్‌బుక్‌లో ఒకే ఫేస్‌ని బహు ముఖాలుగా చూపినట్టు, డ్రైవింగ్ కూడా మల్టీ డేంజరస్‌గా ఉంటుంది. మనకి డ్రైవింగ్ రాకపోతే ఎదుటివాడు ఫినిష్ అయినట్టు, వాడికి రాకపోయినా మనం ఫినిషవుతాం.
నేను బైక్ పైనుంచి చాలాసార్లు కిందపడ్డాను కానీ, ఎదుటివాడిని పడేయలేదు. ఇసుకని చూస్తే అందరికీ డబ్బులు కనిపిస్తాయి కానీ నాకు మాత్రం డేంజర్ కనిపిస్తుంది. కొంతమంది సహృదయులు ఇల్లు కట్టుకోవడానికి రోడ్డుమీద ఇసుక పోస్తారు. ఆ ఇసుకలో నా బైక్ ప్రవేశించినప్పుడల్లా సర్రున జారి, ఒంటిమీద బ్లడ్ కోటింగ్‌ని బోనస్‌గా ఇచ్చింది. అందుకని ఇసుక కనిపిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తాను.
తిరుపతిలో జె.వి.ఆర్.కె.రెడ్డి అని ఓ మిత్రుడున్నాడు. ఆయన చీమకి కూడా హాని చేయడు. కానీ ఆయన బైక్ ఎక్కితే మనల్ని కిందపడేయడం సరదా. రేణిగుంట నుంచి తిరుపతి వరకూ పది కిలోమీటర్లు ఫోన్‌లో మాట్లాడుతూనే డ్రైవ్ చేయడం ఆయన ప్రత్యేకత. టైమ్ సెన్స్‌ని ఎంత బాగా పాటిస్తాడంటే స్పీడ్ బ్రేకర్ల దగ్గర బ్రేక్ వేసి టైమ్ వేస్ట్ చేయడం ఇష్టముండదు. కాకపోతే ఆ జర్క్‌కి వెనుక కూచున్నవాళ్లు గాల్లోకి ఎగిరి అదృష్టం బాగుంటే మళ్లీ అదే సీట్లోనే ల్యాండవుతారు.ఒకసారి ఆయన బైక్‌లో వెనుక కూచుని వెళుతుంటే ఎప్పటిలాగే ఆయన ఫోన్‌ని చెవికి తగిలించుకున్నాడు. దారిలో ఒక తాగుబోతు అడ్డొచ్చాడు. ఈ తాగుబోతులు కుక్కల కంటే డేంజర్. కుక్కల డెరైక్షన్‌ని కొంతవరకూ మనం ఊహించొచ్చు. తాగుబోతులకి డెరైక్షన్ ఉండదు, అంతా డైవర్షనే. ఈ తాగుబోతు అటూ ఇటూ ఊగుతూ ట్రాఫిక్ పోలీసులా చేతులు ఊపేసరికి మా రెడ్డిగారు ఫోన్‌లో మాట్లాడుతూనే ఒక్క క్షణం కంగారుపడ్డాడు. బ్రేక్ వేసే అలవాటు లేకపోయినా తాగుబోతుని రక్షించే క్రమంలో వేశాడు. తాగుబోతు సేఫ్ అయ్యాడు కానీ, బ్రేకుల్ని అంతగా ఇష్టపడని ఆయన బైక్ రోడ్డుమీద పాములా జారింది. దాని వెనుక మేము కూడా సర్రున సౌండ్ చేశాం.
కట్‌చేస్తే ఇద్దరం రేణిగుంట బషీర్ డాక్టర్ ఆస్పత్రికి చేరాం. అక్కడ అడుగుపెడితే చాలు ముందు రెండు ఇంజెక్షన్లు పడతాయి. ఒక్కోసారి మూడోది కూడా, కాకపోతే దాన్ని పిర్రకు గుచ్చుతారు, అదో బాధ. ఇంకొంతమంది ఉంటారు. బండి ఎక్కినప్పటినుంచి వాళ్లకి భయమే. దారిలో కనిపించిన ప్రతి దేవుణ్ని మొక్కుతారు. ఇలాగే మా ఫ్రెండ్ ఒకాయన ప్రతిరోజూ బైక్‌కి పూజచేసి, నిమ్మకాయ తొక్కించి, దారిలో దేవుని గుడి కనిపిస్తే భక్తితో అరచేతిని ముద్దుపెట్టుకునేవాడు. కానీ మనకి దేవుడిమీద ఎంత నమ్మకమున్నా, నాస్తికులు అనే ఒక దుష్ట తెగ కూడా లోకంలో ఉంటుంది. వాడు నేరుగా వచ్చి బండి మూతి పచ్చడి చేస్తే మావాడు దేవుడికి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.
హైదరాబాద్‌లో కొందరు కుర్రాళ్లు గుయ్‌గుయ్‌మని సౌండ్ చేస్తూ బైక్‌లో స్పీడుగా వెళుతూ ఉంటారు. వాడు ఎప్పుడు ఎవర్ని గుద్దుతాడో అని భయమేసేది. కానీ ప్రమాదం పొరుగువాడి తలుపు తడుతుందనే అనుకుంటాం తప్ప మనింటికి కూడా తలుపులు ఉంటాయని మరిచిపోతాం. ఈ మధ్య మెహదీపట్నం ఫ్లై-ఓవర్ కింద ఇలాంటి బైక్ వీరుడొచ్చి నా స్కూటర్‌ని టచ్ చేస్తే నేను గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లిపోయాను. వెనుక కూచున్న మా ఆవిడ తన దెబ్బల్ని, నా దెబ్బల్ని లెక్కజేయకుండా ఆ బైక్ కుర్రాణ్ని నాలుగు తిట్టి రెండు పీకడం చూసి ముచ్చటేసింది. ఆడవాళ్లకి ఆగ్రహమొస్తే ఈ భూమి అనే ఉపగ్రహమే మండిపోదా!
- జి.ఆర్.మహర్షి