పోకండ ఆపండి | Muscular dystrophy' disease | Sakshi
Sakshi News home page

పోకండ ఆపండి

Published Tue, Mar 8 2016 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

పోకండ ఆపండి

పోకండ ఆపండి

కండ కరిగితే కష్టం.
గుండె కరిగితే సాయం.
ఈ అన్నదమ్ముల కండలు
కొద్దికొద్దిగా కరిగిపోతున్నాయి.
అవి ఇంకా ఇంకా కరగక ముందే..
మన గుండెలు కరగాలి.
 వరికి సాయం అందాలి.

 
‘‘చదువులో ప్రతిభావంతులు... ప్రత్యర్థులను మట్టి కరిపించే ఆట తీరు... మాటలతోనే మైమరిపించే వాగ్ధాటి... నిర్మలమ్మా! నిమ్మళంగా ఉండమ్మా. రామలక్ష్మణుల్లా ఇద్దరు కొడుకులు, లక్ష్మీదేవిలాంటి కూతురు పుట్టారు. నీ కొడుకులకు చదువులో, తెలివిలో సాటిలేరెవ్వరు’’ అని అంటుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఉప్పొంగి పోయేది.
 
ఇరవై రెండేళ్ల మనోవేదన
కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ అమ్మానాన్న ఓడిపోయారు. విద్యాకుసుమాలై విరిసి, జ్ఞాన సుగంధాన్ని విరజిమ్ముతున్న ఆ అన్నదమ్ములిద్దరినీ మొండి వ్యాధి తినేస్తోంది. పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను మాయదారి రోగం కబళించబోతోందని తెలియగానే ఆ వృద్ధ దంపతుల హృదయాలు కకావికలమయ్యాయి. గుండెలు అవిసెలా ఏడ్చారు. తీరొక్క దేవునికి మొక్కారు. అయినా ఏ దేవుడూ కనికరించలేదు. బతుకు మార్గం చూపలేదు. ఇది ఇరవై రెండేళ్ల మనో వేదన. కష్టాల కన్నీటి కథ.
 
ఆ సంతోషం నిలవలేదు!
మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కొండా నిర్మల, దుర్గయ్యలకు జగన్నాథం(35), మనోహర్(32), భగవతి(29) సంతానం. నిర్మల బీడీలు చుట్టేవారు. దుర్గయ్య చేనేత కార్మికుడు. పిల్లలను కష్టపడి బాగా చదివిస్తున్నారు. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టే. ఆటల్లో మేటి. మాటల్లో వారికి వారే సాటి. వారి ప్రతిభాపాటవాల ముందు ఎవరూ సరితూగేవారు కాదు. పదవ తరగతి ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సాధించి పాఠశాలకే వన్నె తెచ్చారు. అదంతా చూసి ఆ తల్లిదండ్రుల్లో ఆనందం... పట్టలేనంత సంతోషం. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
 
అన్నిటికీ అమ్మానాన్నే...

1994 నుంచి కండరాల క్షీణత వ్యాధితో కుమారుల కాళ్లు, చేతులు కదలలేని స్థితికొచ్చాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపెట్టారు. ఇక్కడ లాభం లేదంటే నిర్మల తల్లిగారి ఊరైన ముంబాయికి తీసుకెళ్లి అక్కడ జె.జె.జస్లోక్ ఆసుపత్రిలో చూపెట్టారు. పిల్లలను పరీక్షించిన వైద్యులు వీరికి ‘కండరాల క్షీణత’ వ్యాధి అని నిర్ధారించారు. వ్యాధి నివారణకు మందులవాడకం తప్ప ఇతర చికిత్స లేనందున ఇద్దరినీ తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరు కుమారుల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు నిర్మల, దుర్గయ్య. కాలకృత్యాల నుంచి రాత్రి పడుకునే వరకు... అన్ని పనులూ చేయాల్సిందే. వారికి స్నానం చేయాలన్నా... బట్టలు వేసుకోవాలన్నా... అన్నం తినాలన్నా... అన్నీ ఒకరు చేయాల్సిందే. బిడ్డల మీద ప్రేమతో చేస్తున్నారు. అయితే వృద్ధాప్యం మీద పడడంతో నీరసించిపోతున్నారు.
 
ఉపాధి రెక్కలు విరిగాయి
నిర్మల బీడీలు చుట్టగా వచ్చిన డబ్బులతో కలో గంజో పెట్టేది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె బొమ్మ వేయాలన్న కేంద్రప్రభుత్వ నిబంధన ఆమెకు చేతనైన ఆ ఒక్క ఉపాధినీ లాక్కెళ్లింది. సరళీకృత ఆర్థిక విధానాలు, సాలెల మగ్గం సడుగులిరగడంతో దుర్గయ్య చేసే చేనేత వృత్తిపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో చేనేతను వదిలేశారాయన. పిల్లల వైద్యం కోసం వేలకు వేలు వెచ్చించడం భారంగా మారడంతో ఇంట్లోనే చిన్నపాటి కిరాణ కొట్టు పెట్టుకుని, పిల్లలకు వచ్చే వికలాంగుల పెన్షన్‌తో రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం కదా అని ప్రభుత్వం బీడీ కార్మికుల జీవన భృతిని రద్దు చేసింది. అచేతన, నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.
 - డి.నర్సయ్య, సాక్షి, దుబ్బాక
 
చావాలన్నా చావలేం!
‘కదలలేం. మెదలలేం. 30 ఏళ్లు దాటాయి. తల్లిదండ్రులను కూర్చోబెట్టి చూసుకోవాల్సిన వయస్సు. ఏ జన్మ పాపమో ఈ మాయదారి రోగం మా ఇద్దరినీ గృహ నిర్భందం చేసింది. మంచి, చెడూ అన్నీ అమ్మ చేయాల్సిందే. సిగ్గుతో కుంచించుకు పోతున్నాం. ఆ మహాతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. పాపం నాన్నకూ నిరంతరం మాదే ఆలోచన. ఈ నిస్సహాయ జీవన యాత్ర ఎంత కాలం? మాది నిరాశ కాదు, నిస్పృహ కాదు. ఇది నిజం. కఠిన వాస్తవం. ‘మమ్మల్ని మరణించనివ్వండి. చావు కోసం మరొకరి తోడు కావాల్సిన దుస్థితిలో తల్లిదండ్రులు, చెల్లెలు పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నాం. మమ్మల్ని కరుణించి మరణించనివ్వడి’ అని 2005లో మానవ హక్కుల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాం. మా విజ్ఞప్తిని కమిషన్ తిరస్కరించింది. మా నిర్ణయాన్ని అమ్మకు చెప్పాం. ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. - జగన్నాథం, మనోహర్

ఈ కష్టం ఎవరికీ రాకూడదు
నా బిడ్డలకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. నా బిడ్డల ఆరోగ్యం కోసం ఎక్కని గుడి మెట్లు లేవు. మొక్కని దేవుడూ లేడు. నేను, నా భర్త కష్టపడితే నెలకు రూ. 2 వేలు కూడా రావు. పిల్లల వైద్యానికి నెలకు రూ. 10 వేలు కావాలి. లక్షల అప్పు చేశాం. మా పరిస్థితి చూసినవాళ్లెవరూ మాకు అప్పు ఇవ్వడం లేదు. పిల్లలకు మందులు కొనలేకపోతున్నాం. మనసున్న మహారాజులు ఎవరైనా సాయం చేస్తే పిల్లల మందులకు ఉపయోగపడతాయి.  - కొండా నిర్మల, బాధితుల తల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement