
రాగాలజిస్ట్
ఆ చేతి వేళ్లు రోగుల నాడిని పరిశీలిస్తాయి. ఈ వీణను శ్రుతి చేస్తాయి. విశ్వవ్యాప్త రుగ్మతలకు దివ్యౌషధమైన అద్భుత సంగీతంతో సేదదీరుస్తాయి. విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రి రేడియాలజిస్టుగా చిరపరిచితుడైన ఈ రాగాలజిస్టు వీణ వాయిద్యకారునిగా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఆయనే డాక్టర్ భమిడిపాటి కనక దుర్గాప్రసాద్.
విశాఖపట్నం ఆర్‌కేబీచ్‌లో ఓ ఆదివారం. తూర్పు తలుపు తోసుకుని సూరీడు బయటికొస్తున్నాడు. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. వాకర్లు మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడే రాజీవ్ స్మృతి భవన్‌లో డాక్టర్ కనక దుర్గాప్రసాద్ వీణవాయిద్య కచేరీ మొదలైంది. సాగరతీరమంతా అమర్చిన మైకుల్లో మంద్రంగా వినిపిస్తోంది. సంగీత ప్రియుల హృదయం ఆనంద సాగరంలో తేలియాడుతోంది. సాగర ఘోషకు తోడుగా వీణ వాయిద్యం లయబద్ధంగా సాగుతోంది. అరవై నిమిషాల సమయం అర క్షణంలా కరిగిపోయింది. మధుర సంగీత వర్షం నిలిచిపోయింది. సాగర తీరంలో చిత్తరువుల్లా మారిపోయిన వాకర్లలో మళ్లీ చలనం మొదలైంది.
బాల్యం నుంచే...
చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని కనక దుర్గాప్రసాద్ విపరీతంగా ఇష్టపడేవారు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి డాక్టర్ బి.ఎస్.వి.శాస్త్రి సంగీత కళాప్రపూర్ణ పప్పు పద్మావతి దగ్గర వీణపై శిక్షణ ఇప్పించారు. ఆమె శిష్యరికంలో దుర్గాప్రసాద్ అతి తక్కువ సమయంలోనే వీణపై లాఘవంగా రాగాలు పలికించడంలో దిట్టయ్యారు. అప్పుడే కుటుంబ సన్నిహితుడైన విఖ్యాత వీణ విద్వాంసుడు, వైణిక సార్వభౌమ చల్లపల్లి చిట్టిబాబు దృష్టిలో పడ్డారు. దీంతో ప్రముఖ గ్రామ్‌ఫోన్ రికార్డింగ్ కంపెనీ హెచ్‌ఎంవీ వారి కోసం రూపొందిస్తున్న ‘టెంపుల్ బెల్స్’ సంగీత ఆల్బమ్ రికార్డింగ్ ఆర్కెస్ట్రాలోకి తీసుకున్నారు. 1985లో విడుదలైన ఈ ఆల్బమ్ రూపకల్పనలో వీణపై సహకరించిన కనక దుర్గాప్రసాద్ పద్నాలుగేళ్లకే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
రాష్ట్రపతి అవార్డు
కనక దుర్గా ప్రసాద్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి సంగీత పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకుని అప్పటి రాష్ట్రపతి అవార్డు పొందారు. దీంతో ఆలిండియా రేడియో అధికారులు ఆడిషన్ టెస్ట్ కూడా నిర్వహించకుండానే కళాకారునిగా ఆయనను నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన నాద నీరాజనం కార్యక్రమంలో రెండుసార్లు, చెన్నైలో జరిగిన జాతీయ వీణ ఫెస్టివల్‌లో భాగంగా నారద గాన సభలో వీణ కచేరీలు ఇచ్చారు. ఎమ్‌డీ చదువు పూర్తయ్యాక విజయనగరంలోని మిమ్స్‌లో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే సమయంలో ఆయన సంగీత ప్రతిభకు గుర్తింపుగా ముంబయ్‌కి చెందిన సుర్‌సింగార్ సంసద్ సంస్థ సుర్‌మణి, ఆంధ్ర వైద్య కళాశాల వైద్యులు, విద్యార్థులు నాద తపస్వి బిరుదులు ప్రదానం చేశారు. ‘‘వ్యాధులు తగ్గాలంటే కచ్చితంగా మందులు వాడాలి... ఆ మందులు చక్కగా పనిచేయాలంటే మంచి సంగీతం వినాలి’’ అంటారు డాక్టర్ కనక దుర్గా ప్రసాద్.
- ఎ. సుబ్రహ్మణ్యశాస్త్రి (బాలు)
సంగీతం దివ్యౌషధం
ఒత్తిడి జీవితానికి మంచి ఔషధం సంగీతం. ప్రస్తుతం ఎటుచూసినా ఉరుకులు, పరుగుల జీవితమే. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రంగాల వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి వారు సంగీతం వింటే వృత్తిలో రాణిస్తారు. పిల్లలకు గాత్రంలో శిక్షణ ఇవ్వడం మంచిది. అందువల్ల వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వాయుకాలుష్యం నుంచి విముక్తి పొందుతారు.
- డాక్టర్ భమిడిపాటి
కనక దుర్గా ప్రసాద్. ఎమ్‌డి,