
మగనోరు తీరు వేరు!
ఉత్త(మ) పురుష
నేను చెప్పే మాటలు మా శ్రీవారికి అర్థం కావో లేక నేను మంచి చెబితే అది ఆయనకు చెడుగా వినిపిస్తుందో నాకు తెలియదుగానీ... ఎందుకో ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే అన్న పాపులర్ పాటకు సంసారలోకం సరిగ్గా వ్యతిరేకంగా ఉందని నా అభిప్రాయం.
అసలు విషయం మొదలుపెట్టేముందు కాస్త ఉపోద్ఘాతం మాట్లాడుకుందామా? ‘అల్పపీడనం’ అన్న మాటకు అర్థం ఏమిటో చూద్దాం. అంటే... పీడించడం తక్కువగా ఉండటం లేదా పీడన స్వల్పంగా ఉండటం. అలాంటప్పుడు అల్పపీడనం మంచిదా కాదా మీరే చెప్పండి.
నాకూ, మా శ్రీవారికీ కాస్త ఎడమొహం పెడమొహం మొదలుకాగానే ఆయన వ్యాఖ్యలూ మొదలు... ‘అబ్బ... ఇంట్లో అల్పపీడనం ఏర్పడింది’ అంటూ. ఇదేదో సరదాగా జోక్‌గా అన్నాలెండి. కానీ నా మాటల్లోని పాజిటివిటీ కాస్తా మా వారికి ఎందుకు నెగెటివ్‌గా అనిపిస్తుందో నాకింకా తెలియదు.
ఆయన పొద్దున్నే నిద్ర లేవగానే ‘ఈరోజు నుంచి వాకింగ్‌కు వెళ్లరాదా’ అన్నాను. అంతే... ‘నేను సుఖపడితే నువ్వు చూడలేవు. కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వవు’ అంటూ నస. ఆయన ప్రశాంతంగా పడుకుంటే నాకేమిటి బాధ. ఆఫీసుకు బయల్దేరుతూ బెల్టు పెట్టుకునే ముందు మళ్లీ నస. పొట్ట పెరిగిపోయి బెల్టు పట్టక అదికాస్తా దిగాలుగా నేలముఖం చూస్తోంది. ఎవరో గొప్పనాయకుడు మరణించాక జెండాను అవనతం చేసినట్టుగా ముఖం వేలాడేసుకున్నట్లుగా ఉంది దాని బకిల్.
దాంతో తన వయసు కాస్త పెరిగినట్టూ, ఆరోగ్యం తగ్గినట్టూ అనిపిస్తోందని బోల్డంత సేపు బాధపడ్డారు. అందుకే ఆయన మంచి కోసమే ‘ఈరోజు నుంచైనా వాకింగ్ చేయరాదా’ అన్నాను. అంతే... ‘చేయరాదు... నన్ను సుఖంగా ఉండనివ్వకూడదనే నీ అభీష్టాన్ని నెరవేరనీయరాదు’ అంటూ కొట్టిపారేశారు. ఇలాంటిదే మరో సంఘటన. గోదావరి ఒడ్డునే ఉన్న ఊరి నివాసులమైనందువల్ల... అన్ని పనులకూ పడవ మీదే అవతలి ఒడ్డుకు వెళ్లాలి.
‘ఇవ్వాళ్ల నది మంచి పోటు మీద ఉందట. ఇప్పుడు ప్రయాణం పెట్టుకోకపోతేనేం?’ అన్నాను. అంతే... గోదావరి కాస్తా మావారి ఒంట్లో రక్తమై ప్రవహించింది. గంగమ్మ పోటు కాస్తా ఆయన నరాల్లోని రక్తానికి బదిలీ అయ్యింది. ‘వెళ్లితీరాల్సిందే’ అంటూ కటువుగా అనేసి బయటకెళ్లారు. ఆ మాటనైతే కటువు ధ్వనించడం కోసం ‘పొడిపొడిగా’ అన్నారా... కాసేపట్లోనే తడితడిగా మారిపోయి ఇంట్లోకి వచ్చారు. అదేమిటంటే... మూడు లేదన్నారు. మూడు లేకపోవడం కాదూ... మూడంకేసుకొని పడుకోవాలనీ కాదు. వాస్తవం ఏమిటంటే... మూడోనెంబరు ప్రమాదహెచ్చరిక జెండాను అక్కడ ఎగరేశారట. ఏమిటో ఈ మగాళ్లు... ఎగిరే జెండాలా గర్వంగా నిలపాల్సిన బెల్టును తల వేలాడేసేలా చేసుకుంటారు. తెరచాపలు గాలికి కొట్టుకుపోతూ తుపాన్లో జెండాలా విరగబడే సమయాల్లో పొగరుగా తలెగరేసి వెళ్లి తలవంపులు తెచ్చుకుంటారు.
మగాళ్లెవరూ ఏమీ అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలనుంది. ఆడది నోరేసుకు బతుకుతుంది అంటూ మా మీద అక్కసు వెళ్లగక్కుతుంటారు ఈ మగాళ్లు. అప్పుడెప్పుడో విజయావారు తమ సినిమాలో ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అని పాట పెట్టినందుకు ఆ మాటనే మకుటాయమానం చేసుకుని నిత్యం వల్లిస్తుంటారు. దాన్నే మళ్లీ మళ్లీ పాడుతుంటారు. ఎందుకలా...? ఎందుకనీ...? ఎందుకంటే వాళ్లకు నోరుంది. వాళ్లకే నోరుంది. లోకం నోరున్నవాళ్లది. ఇంతకంటే విపులీకరించాల్సిన అవసరం వేరే ఏదీ లేదనుకుంటాను. అర్థమయ్యేవాళ్లకు అర్థమై తీరుతుంది లెండి. ఎందుకంటే... వాళ్లు మగాళ్లు. ఆడవాళ్లకంటే ఓ పట్టాన అర్థం కాదుగానీ... మగాళ్లకు అర్థంకానిదంటూ ఏదీ ఉండదు.