నౌరు- విస్తీర్ణంలో చిన్న... పర్యాటకంలో పెద్ద
పేరులో నేముంది
దక్షిణ పసిఫిక్‌లో అతి చిన్న గణతంత్ర రాజ్యంగా... విస్తీర్ణంలో వాటికన్ సిటీ, మొనాకోల తర్వాత మూడవ అతి చిన్న దేశంగా పేరున్నప్పటికీ పర్యాటక పరంగా మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పేరుంది నౌరుకి. దాదాపు పదివేల జనాభాతో ఉన్న ఈ దేశం మంచి వేసవి విడిదిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. చాలా సంవత్సరాలపాటు అనేక దేశాల ఆధిపత్యం కింద, పెత్తనం కింద నలిగి పోయి ఉన్న నౌరు 1968లో స్వతంత్ర దేశంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.
ఈ దేశంలో అత్యధిక స్థాయిలో ఫాస్పేట్ రాతి ఖనిజ నిల్వలు ఉన్నందువల్ల మొదట్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్వతంత్ర రాజ్యంగా తనను తాను ప్రకటించుకుంది. అయితే ఫాస్పేట్ ఖనిజాన్ని విచ్చలవిడిగా వెలికితీయడం వల్ల అతి కొద్దికాలంలోనే ఖనిజ నిల్వలన్నీ అంతరించి పోవడంతో పేద దేశాల సరసన చేరింది, ఆ తర్వాత భౌగోళికంగా, నైసర్గికంగా, ప్రకృతి రమణీయకత పరంగా నౌరుకు కొన్ని సౌలభ్యాలు ఉండడంతో పర్యాటక పరంగా బాగా అభివృద్ధి సాధించింది. ప్రపంచ దేశాలన్నీ నౌరును తమ వేసవి విడిదిగా చేసుకోవడంతో భారీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి మళ్లీ సంపదను సముపార్జించి, ధనిక దేశంగా తిరిగి పేరు తెచ్చుకుంది.