అనంతమైన దేవుని కాలాన్ని రోజులు, నెలలు, ఏడాదులంటూ ‘ఖండాలు’ చేసి ఆ ఖండాలను ‘కేలెండర్ల’లో రకరకాల పేర్లతో బిగించాడు మానవుడు. అలాంటి ఒక క్యాలెండరు పాతబడి, కొత్త క్యాలెండరుగా గోడకెక్కుతున్న మరో ‘కొత్త ఏడాది’కి ముందున్న ప్రాంగణంలో మనం నిలబడి ఉన్నాం. సూర్యుని పోకడలు, కదలికలు, దాగుడుమూతలతో సాగే మనందరి ‘కాలం’ మన ప్రమేయం లేకుండానే ఒకరోజున అర్ధాంతరంగా ముగుస్తుంది. మరి అప్పుడేమవుతుంది? అక్కడినుండి కాలం తాకని, దాని నీడ కూడా పడని ‘నిత్యత్వం’ దేవునిలో/తో విశ్వాసి అనుభవైకం పొందుతాడని బైబిల్ చెబుతోంది. బైబిల్ సందేశమంతటికీ మూల వాక్యంగా చెప్పుకోతగిన ‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానిలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ జీవితానికి అతీతమైన నిత్యజీవితాన్ని కానుకగా పొందాలని దేవుడు అనుగ్రహించాడు’ అన్న ఆ వాక్య భాగమే నిత్యత్వానికి పునాది (యోహాను 3:16).పగలు, చీకటి, బతకడం, చావడం ఇదే కదా మన జీవితం.. కాని వీటి ప్రమేయం లేనిదే దేవునిలో విశ్వాసి అనుభవించే ‘నిత్యజీవితం’. మరణంతో అంతమయ్యేది జీవితమని, మరణానంతరం ఆరంభమయ్యేది నిత్యజీవితమన్నది చాలామంది అభిప్రాయం.
కానీ బేతని సోదరీమణులైన మార్త, మరియల ఏకైక సోదరుడు లాజరు రోగియై మరణించినపుడు, వారితో జరిపిన పారలౌకిక చర్చలో యేసు అందుకు భిన్నమైన సత్యాలను ఆవిష్కరించాడు. రోగిగా ఉన్నపుడే నీవు వచ్చి బాగుచేసి ఉంటె నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని వాపోయింది మార్త ఆలస్యంగా వచ్చిన యేసు ప్రభువుతో. మరణం తన సోదరుని జీవితాన్ని అర్ధాంతరంగా తుంచేసిందన్నది మార్త బాధ పాపం!! అంత్యదినమున యూదుల పునరుత్థానంలో తన సోదరుడు తిరిగి లేస్తాడని తాను నమ్ముతాను కాని అప్పటివరకూ తాను లాజరును చూడలేను కదా అంటూ ఆమె బాధపడింది. అయితే ‘నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని, నాలో నివసించేవాడికి మరణం లేదంటూ’ యేసుప్రభువు ఆ రోజు ఆమెకిచ్చిన అద్భుతమైన వాగ్దానం లాంటి జవాబు భూలోకంలో ప్రతి మూలనా ఈ రోజు కూడా ప్రతిధ్వనిస్తోంది.
నిత్యజీవితం మరణానంతరం ఆరంభమయ్యేది కాదు, ‘నిత్యజీవితం’ మన ఈ లోక జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన విస్తరణ మాత్రమే అన్నది ప్రభువు తాత్పర్యం. అందుకే నిత్యజీవితానికి ఈ లోకంలోనే పునాదులు వేసుకోవాలని ప్రభువు బోధించాడు. ప్రభువులో ఉన్నవాడు ఇప్పటికే నిత్యజీవితాన్ని కలిగి ఉన్నాడని దానర్ధం. జీవితం అనే తాత్కాలికమైన దృష్టితో కాక, నిత్యజీవితం అనే శాశ్వత దృష్టితో, విలువలతో ఆలోచించేవాడు, జీవించేవాడు, పరలోకంలో ధనవంతుడని యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు (మత్త 6:20). అందుకే ప్రతిసారీ మనం ఎదురుచూసే ఏడాది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిత్యజీవితానికి మనం పునాదులు వేసుకునేది ఇందులోనే. సూర్యుడు తాకిన ప్రతిదీ ఈ లోకంలో పాతదైపోతుంది.
అందుకే కొన్ని నెలల క్రితం కొత్త యేడాదంటూ మనమంతా ముచ్చటపడి ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో స్వాగతం పలికిన ఈ ఏడాది అనే కాల ఖండం ఇపుడు పాతదై పోయి దీనంగా కనిపిస్తోంది.. కానీ దేవుడు దేన్ని తాకినా అది పాతదైనా సరే కొత్తదై పోతుంది. అందువల్ల ఒక్క మానవునిలో తప్ప, ఈ విశ్వమంతటిలో అసలు కొత్తదనమనేదే లేదు. అయితే దేవుని హృదయాన్నెరిగి జీవించే ప్రతి వ్యక్తీ దేవునిలో నిరంతరం వినూత్నమవుతూ నూతన çసృష్టిగా వెలుగొందుతాడు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని కాదు, హ్యాపీ న్యూ మ్యాన్... అని ఒకర్నొకరు అభినందించుకోవాలేమో!!! మనిషి కొత్తవాడైతే విశ్వమంతా కొత్తదే, రోజులు, నెలలు, ఏడాదులు కూడా కొత్తవే అంటాడు దేవుడు. (2 కొరింతి 5:17)
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
మనల్ని మనం ఉద్ధరించుకోవాలి
పరిశుభ్రత అనేది ఎప్పుడూ రెండు అంశాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, రెండవది సామాజిక పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ముఖానికి ఏదో పులుముకుని సువాసనలు వెదజల్లడం కాదు. కట్టుకున్న బట్టలు, కాళ్ళకు తొడుక్కునే మేజోళ్ల వరకు శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసినవి వేసుకోవాలి. విద్యార్థులుగా మీ అమ్మగారికి మీరు చేయవలసిన మహోపకారం ఏమిటంటే...ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మీ పనులను మీరు స్వయంగా చక్కబెట్టుకోగలగడం. మీ పుస్తకాలు, మీ వస్తువులు పని అయిన తరువాత వాటిని వాటి స్థానాల్లో సర్దిపెట్టుకోవడం, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోగలిగితే, మీ బట్టలు మీరు ఉతుక్కోగలిగితే, పరిశుభ్రతలోని శ్రామిక సౌందర్యం, దాని విస్తృత ప్రయోజనం మీకు సులభంగా బోధపడుతుంది.ఒకసారి గాంధీగారు ఆశ్రమంలోకి వెడుతుంటే ఒక ఉపాధ్యాయురాలు వచ్చి నమస్కారం చేసింది. ముందుకు వెళ్ళిపోతున్న గాంధీగారు ఒక్క నిమిషం వెనక్కి వచ్చి ఆమెచేతి గోళ్ళుచూసి...‘‘నీ చేతి గోళ్ళు అంత పెరిగి ఉన్నాయి. అలా ఉంటే మట్టి చేరుతుంది. సూక్ష్మ జీవులు చేరతాయి. అన్నం తిన్నప్పుడు లోపలికి వెళ్ళి వ్యాథులు కలగచేస్తాయి.
పది మంది పిల్లలకు పాఠాలు చెప్పేదానివి. నీవే గోళ్ళు అలా ఉంచుకుంటే పరిశుభ్రత గురించి పిల్లలకు ఏం చెబుతావు? ఇకమీదట పాఠం చెప్పేటప్పుడు గోళ్ళు తీసి వెళ్ళు’’ అని సుతిమెత్తగా మందలించారు.ఆయన ఒకసారి కాశీ విశ్వనాథ దేవాలయానికి వెళ్లారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండడం చూసి చలించిపోయారు. దేవాలయంలో దర్శనం చేసుకున్న తరువాత ప్రధాన అర్చకుడికి దక్షిణ ఇచ్చేటప్పడు తన జేబంతా వెతికి తన దగ్గరున్న నాణాలలో అతి తక్కువ విలువున్న దానిని తీసి అతని చేతిలో వేసి ‘పవిత్రమైన ఈ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కదా. నిర్మాల్యాన్ని తీసి శుభ్రపరచకపోతే ఎలా..?’ అని మందలించబోతే.. ఆ అర్చకుడు..‘‘ఇంతసేపు వెతికి ఇంత చిన్న నాణాన్ని వేసావు. నరకానికి పోతావ్.’’ అని అక్కసు వెళ్ళబోసుకున్నాడు.
వెంటనే గాంధీజీ ‘‘నరకానికి పోవాల్సిఉంటే అక్కడికే పోతాను గానీ, నువ్వు ముందు పరిశుభ్రత నేర్చుకో, పాటించు’’ అని చెప్పారు.వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. మన ప్రమేయం లేకుండా కూడా వ్యాధులు వస్తుంటాయి. నిర్లక్ష్యంతో కూడా వస్తుంటాయి. ఏది ఎలా వచ్చినా మన విలువయిన కాలం ఎంత వథా అవుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. రాకూడని వ్యాధి వచ్చి మంచం పడితే ఎన్ని తరగతులు, ఎన్ని పాఠాలు, ఎంత విలువైన కాలం వృథా అవుతుందో, మనల్ని ఎంత వెనక్కి నెట్టేస్తుందో ఆలోచించండి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆరోగ్య, వైద్య శాఖల పద్దుల కింద కొన్ని వందల కోట్ల రూపాయలు ఏటా ఖర్చుపెడుతున్నాయి.
అదే మనలో ప్రతి ఒక్కరం ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అంటే... ఆహారవిహారాల్లో, పరిసరాల్లో – శుచి, శుభ్రత పాటిస్తే... మీరేం దీనికి పెద్దగా శ్రమపడక్కర్లేదు, తినేటప్పడు చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే చాలు!అలాగే గాంధీగారు ఒక మాట చెప్పేవారు. ‘ఒక వ్యక్తి శుభ్రత అనేది ఎలా తెలుస్తుంది? చీకట్లో కూడా ఒక వ్యక్తి తన వస్తువులు తాను సులభంగా తెచ్చుకోగలిగినప్పడు... ఆ వ్యక్తికి వస్తువులు వాడుకున్న తరువాత తిరిగి వాటిని యథాస్థానంలో ఉంచే అలవాటుందనీ, పరిసరాల పరిశుభ్రత పట్ల సరియైన అవగాహనతో ఉన్నాడని గ్రహించవచ్చు.’ అనేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పనిచేస్తున్నా పరిశుభ్రతకోసం పరితపించేవారు, అది ఫొటోల కోసం చేయలేదు. తాను నమ్మి, ఆచరిస్తూ, అందర్నీ చైతన్యపరిచేవాడు.
Comments
Please login to add a commentAdd a comment