డాక్టర్లు కొంతవరకే రక్షించగలరు. ఉద్యోగమైతే ఎంతవరకో తెలీదు. ఊపిర్లను తీసుకెళుతోంది కరోనా. సోషల్ డిస్టెన్స్... సెల్ఫ్ హెల్ప్... ఈ రెండే రక్షాబంధన్‌లు ఇప్పుడు. దూరదూరంగా ఉంటేనే బతుకు. కొత్తగా ఏదైనా చేస్తేనే.. మెతుకు. ‘సీడ్ రాఖీ’.. సరికొత్త ఆలోచన!
గ్రామాల్లో నాలుగు రూపాయలు వచ్చే అన్ని పనుల్నీ కరోనా బంద్ చేసేసింది. నీళ్ల ట్యాప్‌నే కట్టేస్తే ట్యాంకర్‌లో ఎన్ని నీళ్లుండి ఏం లాభం? పని చెయ్యగలవారూ, పని ఇవ్వగలవారూ ఇద్దరూ ఒకటే అయ్యారు. అర్థికవేత్తలే అచేతనులై చూస్తుంటే.. రక్షాబంధన్ కట్టేవారెవరు?! చేతితో పది నోటు ఉండటం పెద్ద సంపన్నతైంది ఊళ్లలో. ఈ చేత్తో కష్టపడి ఆ చేత్తో కష్టార్జితాన్ని తీసుకుంటున్న ‘సెల్ఫ్‌హెల్ప్’ గ్రూపులే ఇప్పుడు ప్రతి ఊళ్లోనూ బహుళజాతి కంపెనీలు.
ఛత్తీస్‌గఢ్, ధంతరి జిల్లాలోని చిప్లీ గ్రామంలో వెలసిన ‘కంపెనీ’ కూడా ఇటువంటిదే. స్థానికంగా ఉండే రెండు వందల మంది మహిళలు రాబోయే రాఖీ పండుగను తమ తాత్కాలిక ఉపాధిగా ఏర్పచుకున్నారు. గోమయంతో (ఆవు పేడ) సీడ్ రాఖీలు తయారు చేసి, మార్కెటింగ్‌కి సిద్ధం చేస్తున్నారు. మిగిలి వున్న వ్యవధి ఇరవై రోజులే. ఆగస్టు 3న రాఖీ. గోమయం, విత్తనాలు, పల్చటి వెదురు రేకులు.. ఇవీ వీళ్ల ముడిసరుకులు. సగం మంది.. ముందుగా సిద్ధం చేసి ఉంచిన మూసల్లో గోమయాన్ని, విత్తనాలను కలిపి వృత్తాలుగా, చతురస్రాలుగా, నక్షత్రాలుగా అచ్చుల్ని తీసి ఎండబెడతారు. తర్వాత మిగతా సగంమంది ఆ అచ్చులకు రంగులు అద్ది, పైన మోటిఫ్‌లను (డిజైన్ బిళ్లలు) గుచ్చి, అడుగున నునుపుపైన వెదురు రేకుల్ని అమర్చుతారు.
వారిలోనే ఇంకో టీమ్ వీటికి మందపాటి దారాలను, సన్నటి రిబ్బన్‌లను కట్టడంతో రాఖీలకు పూర్తి ఆకృతి వచ్చేస్తుంది. అయితే ముడిసరుకులు దొరికినంత తేలిక కాదు, కళాత్మకంగా ఆ రాఖీలను తీర్చిదిద్దడం. ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యాన్ని ‘ధంతరి నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్’, ‘ఆర్య ప్రేరణ సమితి’ కలిసి చిప్లీ గ్రామ స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణగా అందిస్తున్నాయి. జిల్లా పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నమ్రతా గాంధీ సహకారం కూడా వారికి ఉంది.
సీడ్ రాఖీ అనేది కొత్త కాన్సెప్టు. ఇప్పటికే వాడుకలో ఉన్న ‘సీడ్ బాల్స్’ను ప్రేరణగా తీసుకుని చిప్లీ మహిళలు సీడ్ రాఖీలను తయారు చేస్తున్నారు. పండగ అయిపోయాక వాటిని ఏ గూట్లోనో, అరల్లోనో పెట్టేయకుండా.. పొలాల్లోకి విసిరితే గోమయం ఎరువుగా శక్తిని ఇచ్చి, అందులో ఉంచిన విత్తనాలు మొక్కలుగా ఎదుగుతాయి. పచ్చదనానికి రాఖీ కట్టడం ఇది! ఈ ఆలోచన మొదట ఆర్య ప్రేరణ సమితిలోని దుర్గేష్ నందిని, మంజూ చక్రవర్తిలకు వచ్చింది. రూరల్ మిషన్ వారికి నచ్చింది.
ఈసారి రాఖీల తయారీలో వీళ్ల థీమ్ వైద్యులు, సైనికులు, పారిశుద్ధ్య కార్మికులు. ఆ యోధుల సేవలకు ధన్యవాదాలు అర్పించేలా.. జాతీయ జెండాలోని మూడు రంగులను, రెడ్ క్రాస్ గుర్తును, స్వచ్ఛభారత్ లోని కళ్లద్దాలను మోటిఫ్‌లుగా రాఖీలపై పొదుగుతున్నారు. పెయింట్ చేస్తున్నారు. రాఖీల ప్యాకింగ్‌కి హోమ్‌మేడ్ పేపర్ బ్యాగులను, గుడ్డ సంచులను కూడా వాళ్లే తయారు చేస్తున్నారు. ఒక్కో రాఖీ 40 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. రూరల్ మిషన్ వాళ్లే అమ్మిపెడతారు. సీజన్ పూర్తయ్యే లోపు టార్గెట్‌ను చేరుకుంటే ఒక్కో మహిⶠచేతిలో కనీసం పది వేల రూపాయలైనా ఉంటాయని ప్రేరణ సమితి అంచనా. వాస్తవానికి ఏప్రిల్ నుంచే వీళ్లు సీడ్ రాఖీలు చెయ్యడం మొదలు పెట్టారు కాబట్టి తేలిగ్గానే లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఇప్పటికిప్పుడు కావాలన్నా 15 వేల రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని దూరదూరంగా మల్టీ యూనిట్‌లు ఏర్పాటు చేయడంతో వాళ్ల పనికి అంతరాయం ఏర్పడలేదు. ఇక మార్కెటింగ్‌కి సమస్యే లేదు. ఇప్పటికే అనేక ఎన్జీఓలు ఆ పనిని షాపింగ్ బ్యాగుల్లా రెండు చేతుల్లోకీ తీసుకున్నాయి. రాఖీ అయ్యాక మళ్లీ ఒక కొత్త థీమ్‌తో వస్తారట. అంతే కదా. కొత్త ఆలోచనను మించిన రక్షాబంధన్ ఏముంటుంది ఏ ఉపాధికైనా.
ఆవుపేడ రాఖీల తయారీలో చిప్లీ గ్రామ మహిళలు
Comments
Please login to add a commentAdd a comment