డాడీ నా ఆస్తి | news about DNA testing | Sakshi
Sakshi News home page

డాడీ నా ఆస్తి

Published Tue, Nov 28 2017 2:11 AM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM

news about DNA testing - Sakshi - Sakshi - Sakshi

ఆస్తి ఎప్పుడూ డబ్బే కానక్కర్లేదు. మంచివాళ్లకది అస్తిత్వం కావచ్చు. నాన్న కోసం కొందరు... అమ్మ కోసం కొందరు కొడుకు కోసం కొందరు... ‘కోట్ల’ కోసం కొందరు.. డి.ఎన్‌.ఎ. పరీక్ష అడుగుతారు. సరదాగా మాట్లాడుకోవాలంటే డి.ఎన్‌.ఎ. అంటే ‘డాడీ నా ఆస్తి’. అలాంటి ఆస్తుల కోసం జరిగిన... కొన్ని కొట్లాటలివి.

అమ్మెవరో, నాన్నెవరో తెలియకపోవడం దురదృష్టం. తెలుసుకునే అవకాశం ఉండడం అదృష్టం. ఆ అదృష్టం పేరే డి.ఎన్‌.ఎ.టెస్ట్‌! వారసులెవరో చెప్పడానికి మాత్రమే కాదు, నేరస్థులెవరో తేల్చడానికీ డి.ఎన్‌.ఎ. టెస్ట్‌ పనికొస్తుంది. కొన్నిసార్లు సెలబ్రిటీలను బుక్‌ చెయ్యడానికి కూడా! అమృత అనే బెంగుళూరు అమ్మాయి.. ‘నేను జయలలిత కూతుర్ని. కావాలంటే డి.ఎన్‌.ఎ. టెస్టు చేయించండి. తేలిపోతుంది’ అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు నిన్న సోమవారం జడ్జీల ముందుకు వచ్చింది. ‘ఇలాంటి కేసులు అనుమతించేది లేదని’ కోర్టు ఆ కేసును తోసేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద అమృత ఆ కేసును వేసింది. జయలలిత మీద కూతురిగా తనకు హక్కు ఉందని ఆమె ఈ కేసు వేయలేదు. జయలలిత మీద కూతురిగా తనకు ఉన్న హక్కుకోసం కేసు వేసింది. అంటే.. జయకూతురిగా ఆమె ఈ కేసు వేసింది!  అది కూడా.. ‘తల్లి’ ఆస్తుల కోసం ఆమె ఈ కేసు వేయలేదు. వైష్ణవ అయ్యంగార్‌ బ్రాహ్మణ కుటుంబ ఆచార వ్యవహారాల ప్రకారం తన తల్లికి అంత్యక్రియలు జరిపించుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వమని అడిగింది. ఒక వేళ డి.ఎన్‌.ఎ. టెస్టు తప్పనిసరి అని కోర్టు భావిస్తే, డిసెంబర్‌ 5 దాటకుండా టెస్టుకు ఆదేశించమని కూడా అమృత కోరింది.

చనిపోయి ఏడాది
జయలలిత చనిపోయి డిసెంబరు ఐదుకు  ఏడాది అవుతుంది. ఏడాది దాటిందంటే మృతదేహంలో డి.ఎన్‌.ఎ.టెస్టుకు అవసరమైన కణాలు క్షీణించే ప్రమాదం ఉంది. అదీ అమృత తొందర. కోర్టు ఆమె కేసును కొట్టేసింది కాబట్టి ఇప్పుడామెకు ఎలాంటి తొందరా అక్కర్లేదు. అయితే చివర్లో కోర్టు ఒక మాట అంది. కావాలంటే హైకోర్టులో పిటిషన్‌ వేసుకోమంది. 37 ఏళ్ల అమృత నవంబర్‌ 22న సుప్రీం కోర్టులో ఈ కేసు వేసింది. అంతకు ముందు కూడా ఒక వ్యక్తి ‘నేను జయమ్మ కొడుకును’ అంటూ కోర్టుకు ఎక్కి కోర్టు చేత చివాట్లు తిన్నాడు. ఇప్పుడు అమృతను కోర్టు మరీ అంతగా చివాట్లు వేయలేదు కానీ, ‘ఏంటమ్మా.. ఇది!’ అని మాత్రం చికాకు పడింది.

నిజానికి ఇదేమంత సెన్సేషనల్‌ కేసు కాదు. వచ్చే రెండుమూడు రోజుల్లో అమృత హైకోర్టుకు వెళ్లి, హైకోర్టు డి.ఎన్‌.ఎ. టెస్టుకు ఆదేశిస్తే అప్పుడైనా అది వార్త మాత్రమే అవుతుంది కానీ, సంచలన వార్త అయ్యే అవకాశం లేదు. సెలబ్రిటీల జీవితాల్లోకి ఇలాంటి కూతుళ్లు, కొడుకులు వస్తుంటారు. పోతుంటారు. కొద్దిమందే నిజ నిర్థారణలో వారసులని తేలుతుంటారు.
ఆ మధ్య.. ధనుష్‌ తమ కొడుకనీ, డి.ఎన్‌.ఎ. టెస్టు చేయిస్తే తేలుతుందని.. తమిళనాడులోని వృద్ధ దంపతులిద్దరు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు మాత్రం అది సంచలనం అయింది. సాక్ష్యంగా ధనుష్‌ మణికట్టు మీద పచ్చబొట్టు కూడా ఉంటుంది చూసుకొమ్మని ఆ ‘అమ్మానాన్న’ ప్రూఫ్‌ చూపించారు. పచ్చబొట్టు కనిపించలేదు! కొందరికైతే చెరిగిపోయిన పచ్చబొట్టు కనిపించింది. మొత్తానికి డి.ఎన్‌.ఎ. వరకూ వెళ్లకుండానే ‘డీల్‌’ కుదిరిపోయింది.

డి.ఎన్‌.ఎ. తివారీ!
కాంగ్రెస్‌ లీడర్‌ ఎన్‌.డి. తివారీకి ఇంకోపేరు డి.ఎన్‌.ఎ. తివారి. పాపం ఆయనకది మీడియా పెట్టిన పేరు. ప్రస్తుతం తివారీ వయసు 92 ఏళ్లు. ‘కృష్ణారామా’ అనుకుంటూ ఢిల్లీలో గడుపుతున్నారు. పదేళ్ల క్రితం రోహిత్‌ శేఖర్‌ అనే వ్యక్తి ‘నాన్న కోసం’ అంటూ కోర్టుకెక్కాడు. ‘ఎవర్నాయనా మీ నాన్న?’ అని కోర్టు అడిగితే.. ఎన్‌.డి. తివారీ పేరు చెప్పాడు. తివారీ కాదన్నా, డి.ఎన్‌.ఎ. టెస్టు కాదనలేదు. చివరికి ‘వాడు.. నా కొడుకే’ అని తివారీ ఒప్పుకున్నారు.

ఫారిన్‌లో అయితే ఎప్పుడూ ఏదో ఒక డి.ఎన్‌.ఎ. గొడవ ఉంటూనే ఉంటుంది. స్వర్గీయ స్టీవ్‌ జాబ్స్‌ కూడా డి.ఎన్‌.ఎ. కేసులో ఉన్నారు. స్టీవ్‌కి చిన్ననాటి స్నేహితురాలు క్రిస్‌–యాన్‌కు బిడ్డ పుట్టినప్పుడు, ఆ బిడ్డకు తండ్రి స్టీవేనని ఆమె లోకానికి ప్రకటించింది. అయితే స్టీవ్‌ ఒప్పుకోలేదు. చివరికి డి.ఎన్‌.ఎ. టెస్టులో అతడే తండ్రి అని తేలింది! హాలీవుడ్‌ స్టార్‌ ఎడ్డీ మర్ఫీది ఇలాంటి కథ. ఒక అమ్మాయిని తల్లిని చేసి, నేను మాత్రం తండ్రిని కాదు అన్నాడు. డి.ఎన్‌.ఎ. ఒప్పుకుంటుందా? ‘డాడీ’ అని íపిలిపించింది.
ఆమెరికన్‌ టీవీ సెలబ్రిటీ ‘కోర్ట్నీ కర్దేషియన్‌’ ది మాత్రం రివర్స్‌ స్టోరీ. ఆమె తన కొడుకుని  ‘అడుగో డాడీ’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌ స్కాట్‌ డిసిక్‌ దగ్గరికి పంపింది. డి.ఎన్‌.ఎ. టెస్టు మాత్రం ‘నో డాడీ’ అనేసింది.

బ్రిటన్‌ ప్యాలెస్‌లో ఇండియన్‌!
ప్రిన్స్‌ విలియమ్స్‌ది అయితే డి.ఎన్‌.ఎ. థ్రిల్లర్‌. రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు భారతదేశంలోని సంపదలను దోచుకున్నారని చరిత్ర చెబుతోంది. అయితే డి.ఎన్‌.ఏ పరీక్ష ఒక సంచలన వార్తను ప్రపంచానికి తెలియచేసింది. భారతీయ సంతతిని బ్రిటిష్‌ రాయల్‌ తన ప్యాలెస్‌కి తీసుకెళ్లిందట! ప్రిన్స్‌ విలియమ్స్‌కి చేసిన డిఎన్‌ఏ పరీక్షలో ప్రిన్స్‌ విలియమ్స్‌ భారతీయ సంతతికి  జన్మించినవాడని రిపోర్ట్‌ వచ్చింది. చార్లెస్‌ ప్రిన్స్‌ నాలుగు తరాల ముందు ఉన్న నాయనమ్మ... ఎలిజా కేవార్క్, థియోడర్‌ ఫోర్బ్స్‌ (1788 – 1820) ల కుమార్తెట. థియోడర్‌ సూరత్‌లో వ్యాపారం చేశాడట. అలా ప్రిన్స్‌ విలియమ్స్‌కి భారతదేశంతో అనుబంధం ఉందని డి.ఎన్‌.ఏ పరీక్ష తేల్చి చెప్పింది.

విశ్వవిఖ్యాత అమెరిక్‌ టీవీ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రేకు 2005లో డి.ఎన్‌.ఏ పరీక్ష చేయించుకునే వరకు, తను ఆఫ్రికా జులు జాతికి చెందిన మహిళనని తెలియదు. జొహన్నస్‌బర్గ్‌లో ఒక సెమినార్‌లో ఈ వాస్తవం ఆమె బయట పెట్టారు. డి.ఎన్‌.ఏ పరీక్ష ద్వారా, తన మూలాలు దక్షిణాఫ్రికాకి చెందిన జులు జాతికి చెందినవి తెలుసుకున్నానని, ఆ జాతికి చెందిన వ్యక్తిని కావడం తనకు చాలా సంతోషంగా చెప్పుకున్నారు.

‘నేను జయప్రద భర్తని’ అని చాలా ఏళ్ల క్రితం ఒకాయన రాద్ధాంతం చేశాడు. ఆయనే.. ‘ప్రియాంకను కూడా నేను పెళ్లి చేసుకున్నాను’ అని ఆ ఊరూ, ఈ ఊరూ తిరుగుతూ చెప్పుకున్నాడు. డి.ఎన్‌.ఎ.లో ఆ విషయాలు తేలవు. నాలుగు పీకితే తేల్తాయి. బ్లడ్‌ రిలేషన్‌కి క్లెయిమ్‌ చేస్తే మాత్రం డి.ఎన్‌.ఎ. తప్పదు. బ్రహ్మ దేవుడే దిగి వచ్చి ‘అతడే మీ డాడీ, ఈమే మీ మమ్మీ’ అని చెప్పినా నమ్మేందుకు ఆధారం ఉండదు కానీ డి.ఎన్‌.ఎ. చెబితే మాత్రం బ్రహ్మైనా నమ్మాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement