
ఆ చిట్టిబుర్రల్లో ఎన్నో ప్రశ్నలు. కేవలం అవి ప్రశ్నలు కావు, సమాజం అనే మదపుటేనుగును అదుపుచేయగల అంకుశాలు. రేపటి తరం తమ కోసం తామే వేసుకునే బాటలు. అవును, పాఠశాల విద్యార్థులే పాత్రికేయులుగా మారి సమాజాన్ని తమ ప్రశ్నలతో తట్టి లేపుతున్నారు. చిన్నారులకు కనీసం చక్కగా ఆడుకునేందుకు కూడా వీలు కల్పించలేని సమాజాన్ని నిలదీస్తున్నారు.
ఆ చిట్టి చేతులకు మైకులనిచ్చి వారి గళానికి స్వేచ్ఛను కల్పిస్తోంది ‘స్క్ర్యాపీ న్యూస్’ సంస్థ. పిల్లల విద్య కోసం కృషి చేసే ‘గోయింగ్ టు స్కూల్’లో ఒక భాగమైన ‘స్క్రాపీ న్యూస్’ ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్య తరగతి, మురికివాడల్లోని చిన్నారులను పాత్రికేయులుగా తీర్చిదిద్దుతోంది. సమాజంలోని కొన్ని ప్రశ్నలకు ఈ చిన్నారులతోనే సమాధానాలను వెతికిస్తోంది.
చెత్తను కొత్తగా మార్చి... న్యూస్ రూమ్
ఎస్వీఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే ఆకాష్, ప్రజ్వల్, భవ్య, దివ్య ఏదో విషయం పై చర్చించుకుంటున్నారు. ఈ రోజు హెడ్‌లైన్స్ ఏంటి? ఏ వార్తాకథనాన్ని హైలైట్ చేస్తున్నాం? అన్నది వారి చర్చ. తొమ్మిదో తరగతి చదివే ఈ విద్యార్థులు వార్తల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు. అంటే, వీరంతా స్క్రాపీ న్యూస్ చానల్ పాత్రికేయులు, యాంకర్లు. అవును, విద్యార్థులనే పాత్రికేయులుగా మారుస్తోంది ‘స్క్రాపీ న్యూస్’. సంస్థ పేరుకు తగ్గట్టుగానే చెత్తను కొత్తగా మార్చడంలో తనదైన పంథాను చాటుతోంది.
పాఠశాల విద్యార్థులను పాత్రికేయులుగా మార్చడమే కాదు, ఆ చిన్నారులు రిపోర్ట్ చేసేందుకు కావాల్సిన న్యూస్ రూమ్‌ను కూడా చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారానే తయారుచేశారు. అది కూడా పిల్లలే తయారు చేయడం గమనార్హం. బెంగళూరులోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్‌లో ‘స్క్రాపీ న్యూస్’ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించింది. ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లోని మూడో అంతస్తుకు చేరుకోగానే పాడయిపోయిన బకెట్లు, పనికిరాని వస్తువులను పెయింటింగ్‌లతో అలంకరించిన ఓ గది కనిపిస్తుంది. ఆ గది పైకప్పుగా వెదురు బొంగులు, అల్లుకున్న లతలు. ఈ గదే చిన్నారులు తమ కోసం రూపొందించుకున్న ‘న్యూస్ రూమ్’. ఇక్కడి నుండే వారు ‘స్క్రాపీ న్యూస్’ ఛానల్ వార్తలను వినిపించనున్నారు.
తమ సమస్యలకు... తామే ప్రశ్నలు...
ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్‌లో చదివే కొంత మంది చిన్నారులను పాత్రికేయులుగా, యాంకర్లుగా ఎంపిక చేసేందుకు గాను ‘స్క్ర్యాపీ న్యూస్’ సంస్థ ముందుగా వారికి ఆడిషన్స్‌ని నిర్వహించింది. 7–9 తరగతుల్లోని విద్యార్థులకు ఒక్కో అంశాన్ని ఇచ్చి ఆ అంశంపై ఒక నిమిషం పాటు మాట్లాడాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. అలా మాట్లాడిన చిన్నారుల నుండి కొంత మందిని ఎంపిక చేసి వారికి పాత్రికేయులుగా, యాంకర్లుగా శిక్షణ ఇచ్చారు.
ఇక వీరికి సమాజంలోని వివిధ సమస్యలపై ప్రశ్నలను రూపొందించుకోవాల్సిందిగా సూచించారు. అంతే, ఈ చిన్నారులంతా సమాజంలోని సమస్యలపై దృష్టి సారించారు. అలా తమ రిపోర్టింగ్ కోసం మొదటి సమస్యను ఆ చిన్నారులే వెలికితీశారు. తమ రిపోర్టింగ్‌లో మొదటి వార్తాకథనం కోసం ‘బెంగళూరు నగరంలో చిన్నారులకు ఆటస్థలాలు లేకపోవడం’ పై రిపోర్టింగ్‌ని ప్రారంభించారు. ఇందుకు గాను నగరంలోని కొన్ని పార్కులకు వెళ్లి అక్కడి వాకర్స్‌ని వీరు ప్రశ్నించారు. ‘మీరు మీ చిన్నతనంలో చాలా చక్కగా ఆరుబయట, ప్లేగ్రౌండ్‌లో ఆడుకోగలిగారు. మేం అలా ఆడుకోలేక పోతున్నాం. ఇందుకు మీ ప్రతిస్పందన ఏమిటి?’ ఇది చిన్నారి పాత్రికేయులు అడిగిన ప్రశ్న.
గతంలో నేను ఎక్కువగా వార్తా చానళ్లు చూసేవాడిని కాదు. ఎప్పుడైనా ఓ అరగంట పాటు సినిమాలకు సంబంధించిన కథనాలను టీవీలో చూసేవాడిని. అయితే, ఇలా పాత్రికేయులుగా మారి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మా చుట్టూ ఉన్న సమస్యలపై మేమే ఆలోచించుకొని, వాటికి పరిష్కార మార్గాలను వెతకడం ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో పాత్రికేయుడిగా రాణించాలని కోరుకుంటున్నాను.
ఏమిటీ ‘స్క్రాపీ న్యూస్’
చిన్నారుల కోసం, చిన్నారులతోనే నడిచే న్యూస్ చానల్ ‘స్క్రాపీ న్యూస్’. మురికివాడల్లోని చిన్నారులకు విద్యను చేరువ చేసేందుకు ఏర్పాటైన ‘గోయింగ్ టు స్కూల్’ స్వచ్ఛంద సంస్థ ‘స్క్రాపీ న్యూస్’ పేరిట ఈ చానల్‌ని ఆవిష్కరించింది. మొట్టమొదట ముంబైలో ప్రారంభించిన ఈ చానల్ ప్రతి వారం ఒక అంశంతో ప్రజల ముందుకు వస్తోంది. చిన్నారులు రూపొందించిన ఆ వార్తాకథనాల ఎపిసోడ్లు ‘యూట్యూబ్’లో ప్రసారమవుతాయి.
చిన్నారులు తమ చుట్టూ ఉన్న సమస్యలకు తామే పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేస్తోంది ‘స్క్రాపీ న్యూస్’. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ వారి దృష్టికి కూడా ఆ ప్రాంత సమస్యలను తెస్తుంటారు. తద్వారా మురికివాడల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఓ కొత్త కెరీర్ అవకాశాన్ని కూడా ‘స్క్రాపీ న్యూస్’ పరిచయం చేస్తోంది. ఇప్పటికే ముంబై, బిహార్‌లోని పాఠశాలలు, మురికివాడల్లోని చిన్నారులతో ‘బీ స్క్రాపీ’ అనే నినాదంతో సాగుతున్న ఈ చానల్ ప్రస్త్రుతం బెంగళూరులోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది.
– ఆకాష్, 8వ తరగతి, స్క్ర్యాపీ న్యూస్ రిపోర్టర్, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment