ప్రశ్నలు కాదు.. బుల్లెట్లే
- ప్రజాస్వామ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన అధికారులు
- ఊహకందని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పదో తరగతి విద్యార్థులు
- సమాధానం చెప్పేందుకు తడబడ్డ అధికారులు
వారంతా పదో తరగతి విద్యార్థులు. మన సర్కారు పాఠశాలలో చదువుతున్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. వారు సంధించిన ప్రశ్నాస్త్రాలు అధికారులకు నోటమాటరాకుండా చేశాయి. సమాజం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపైనా వారికున్న అవగాహన అధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. అసలేం జరిగింది. ఎవ్వరా విద్యార్థులు. వారు అధికారులకు సంధించిన ప్రశ్నలేంటి.. అన్న వివరాలు తెలుసుకుందాం రండి..
ప్రత్తిపాడు: ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ సిహెచ్.పద్మావతి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటు హక్కు అనే అంశాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తాండవకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, పౌరులహక్కులపై వివరించారు. తదనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు, ప్రభుత్వాల ఏర్పాటు, ఓటర్లు, ప్రజల పాత్రపై తెలియజేశారు.
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో డబ్బు తీసుకుని ఓట్లు వెయ్యడం చట్టరీత్యా నేరమని, డబ్బు తీసుకున్నా, ఇచ్చినా రెండూ నేరమేనన్నారు. ఎన్నికల సమయంలో మద్యంపైన కూడా నిషేధాన్ని విధిస్తారని చెప్పారు. తదనంతరం మీకేమైనా సందేహాలుంటే అడగాలని తహసీల్దార్ పద్మావతి విద్యార్థులను కోరారు.
ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. విద్యార్థులు ఎస్‌కె.నసీమా, మల్లేశ్వరి, రమ్య, శిరీష అధికారుల ఊహకందని రీతిలో ప్రశ్నలు సంధించడంతో అధికారులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. విద్యార్థుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు వారి మాటల్లోనే..
విద్యార్థి: ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నారు కదా? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు?
తహసీల్దార్: అది వాళ్ల ఇష్టం. ఏ పార్టీకైనా వాళ్లు మారవచ్చు. వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారు.
విద్యార్థి: బెల్టు షాపులను రద్దు చేస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు మద్యం దుకాణాలకు ఎందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది?
తహసీల్దార్: మద్యం వలన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అందు వలన మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారు. అయినా ఎన్నికల సమయంలో మాత్రం నిషేదం ఉంటుంది.
విద్యార్థి: మీరేమో ఎన్నికల సమయంలో మద్యం నిషేదం అంటున్నారు. కానీ అసలు ఎక్కువగా గ్రామాల్లో మద్యం పంచేది అప్పుడే కదా?
తహసీల్దార్: ఎన్నికల సమయంలో ఖచ్చితంగా గ్రామాల్లో నిషేదం అమల్లో ఉంటుంది. దానికి తోడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. రహస్యంగా గ్రామాల్లో మద్యం పంపిణీ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి.
విద్యార్థి: ఇందాక మీరు మద్యంను ఆదాయ వనరు అన్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే మద్యంను ఆదాయ వనరుగా ఎంచుకునే బదులు, ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవచ్చుగా?
తహసీల్దార్: అవును అలా చేయవచ్చు. చేస్తే బాగుంటుంది.
విద్యార్థి: ఐదేళ్లకోసారే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు?
తహసీల్దార్: ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసేందుకు కనీసం అంత సమయం పడుతుంది. ఈ విధానం బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది.
విద్యార్థి: ఓటు హక్కు పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు కావాలంటున్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి 21 సంవత్సరాలు ఉండాలంటున్నారు? అలా ఎందుకు? ఓటు హక్కుకు సరిపోయిన వయస్సు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి ఎందుకు సరిపోదు? పద్దెనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు యువతకు కల్పించవచ్చు కదా?
తహసీల్దార్: ఏం చెప్పాలో అర్థం కాక కొద్ది నిమిషాల పాటు తహసీల్దార్ మౌనం. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తా అని తహసీల్దార్ తెలిపారు.
విద్యార్థి: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చని ఎమ్మెల్యేలను ఎందుకు రీకాల్ చెయ్యకూడదు?
ఉపాధ్యాయుడు: అలా రీకాల్ చేసే పద్ధతి మన రాజ్యాంగంలో లేదు.