
బస్తీ సమస్యలపై కదిలిన బాల జర్నలిస్టులు
బంజారాహిల్స్: తమ ప్రాంతంలోని సమస్యలను బస్తీపెద్దల దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం చూపేందుకు కొందరు విద్యార్థులు జర్నలిస్టుల అవతారం ఎత్తారు. దివ్య దిశ ఫౌండేషన్ వివిధ బస్తీల్లో చురుకైన విద్యార్థులను గుర్తించి వారికి సమాజంపట్ల ఉన్న ఆసక్తిని గమనించి బాల జర్నలిస్టులుగా తయారు చేసింది. వీరంతా నెల రోజులుగా తమ బస్తీల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలను ఆకలింపు చేసుకొని వాల్‌పోస్టర్ల ద్వారా సమస్యలను బస్తీ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు.
అధికారులు కూడా ఆయా బస్తీల సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చాక ఆయా ప్రాంతాల్లో తిరుగుతుంటామని తొమ్మిదో తరగతి విద్యార్థి ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో బస్తీలో అయిదు మంది చొప్పున చైల్డ్ జర్నలిస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని దివ్య దశ బాలరక్ష జోనల్ కో-ఆర్డినేటర్ సరస్వతి వెల్లడించారు. ఒక్కో బస్తీలో నలుగురు చైల్డ్ లీడర్లను కూడా తయారు చేసినట్లు బసవతారక నగర్ కమ్యూనిటీ మొబిలై జర్ భవానీ తెలిపారు. హైదరాబాద్‌లో 60 మురికివాడల్లో ఇలా చైల్డ్ జర్నలిస్టులను ఏర్పాటు చేసినట్లు వీరు తెలిపారు. తాము అంతా కలిసి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక బృందంగా ఏర్పడ్డట్లు శివకుమార్, ధన్యశ్రీ, హేమలత వెల్లడించారు. ఈ పిల్లల సాహసోపేతమైన నిర్ణయానికి బస్తీవాసుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని ఎంజీ నగర్ కమ్యూనిటీ మొబిలైజర్ సైదమ్మ తెలిపారు.