
కోరుకోని కేకులు!
పాశ్చాత్య సంస్కృతిలో వివాహ వేడుక సందర్భంగా కేక్ కట్ చేయడం ఆనవాయితీ.
సమ్‌థింగ్ నాట్ స్పెషల్
పాశ్చాత్య సంస్కృతిలో వివాహ వేడుక సందర్భంగా కేక్ కట్ చేయడం ఆనవాయితీ. అది ఒకప్పటి మాట. ఇప్పుడు నిశ్చితార్థం, వివాహ సందర్భాల్లో కేక్ కట్టింగ్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆచారంగా మారింది. అలాంటి కేక్‌కు వధూవరులిద్దరూ ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తమకు నచ్చాలే కానీ ఎంత డబ్బునైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తమకు ఇష్టమైన డిజైను సెలెక్ట్ చేసి మరీ ఆర్డర్ ఇస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బును భారీగా ఖర్చు చేసినా పెళ్లిరోజు మాత్రం వారికి నిరాశే మిగులుతోంది. వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఆ సాక్ష్యాలను పొందరుపరచడానికి 2008లో ఫ్లోరిడాకు చెందిన జెన్, జాన్ అనే దంపతులు ఓ బ్లాగ్‌ను ప్రారంభించారు. అదే ‘కేక్‌వ్రెక్స్ డాట్ కామ్’..
అందులో ఎవరైనా తాము ఆర్డర్ ఇచ్చిన కేక్ డిజైన్‌ను, అలాగే పెళ్లిరోజు తమకు బేకరీ వాళ్లు తీసుకొచ్చి ఇచ్చిన అడ్డదిడ్డమైన డిజైన్‌లో ఉన్న కేక్‌ను ఫొటోలు తీసి పంపొచ్చు. ప్రస్తుతం ఆ బ్లాగ్‌లో ఉన్న కేకుల ఫొటోలు చూస్తే మీరూ అయ్యో.. పాపం అనక తప్పదు. మూడు స్టెప్పులు ఉండాల్సిన కేక్ కేవలం ఒక స్టెప్‌గా తయారు చేసి పంపినవీ, ఎంతో అందంగా ఉన్న డిజైన్ కేక్ చేయమంటే దాన్ని వింతగా తయారు చేయడమే కాకుండా దాని మీద వాడిపోయిన పూలు పెట్టిమరీ డెలివరీ చేసిన కేకులు... ఇలా ఎన్నో రకాల కేకులను ఆ బ్లాగ్‌లో చూడొచ్చు. తమ బ్లాగులో ఇలా కేక్స్‌ను పెట్టడానికి కారణం బేకరీ వాళ్లను అవమానించాలని కాదని జెన్ దంపతులు అంటారు. జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆ రోజు అలాంటి కేకును ఇచ్చి వధువరులిద్దరినీ నిరుత్సాహపరచడం భావ్యం కాదని వారి ఉద్దేశం. అయినా ఆర్డర్ ఇచ్చిన డిజైన్‌లో కేక్‌ను తయారు చేసి ఇస్తే కొత్త దంపతులు ఆనందంగా ఉంటారు కదా.