దర్యాప్తు అయ్యాకే దత్తత
నాకు పెళ్లై పన్నెండేళ్లయ్యింది. పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత ఓ బిడ్డను దత్తత చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా బంధువుల్లో ఒకరికి ఇటీవలే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను మాకు దత్తత ఇవ్వడానికి అంగీకరించారు. చట్టపరంగా చిక్కులు రాకుండా దత్తత చేసుకోవడానికి ఏదైనా ప్రొసీజర్ ఉంటుందా?
- పి.నీలవేణి, కరీంనగర్
దత్తత అనేది ఎప్పుడూ చట్టబద్ధంగానే చేసుకోవాలి. అది కోర్టు సమక్షంలో జరిగితేనే మంచిది. ముఖ్యంగా దత్తత తీసుకునేవారికి. ఎందుకంటే... చట్టపరంగా దత్తత చేసుకోకపోతే, ఎప్పుడైనా అసలు తల్లిదండ్రులు వచ్చి అడిగితే బిడ్డను ఇవ్వను అనే హక్కు మీకు ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఓ మంచి లాయర్‌ను కలవండి. వారికి విషయం చెబితే కోర్టులో ఒక సూట్ ఫైల్ చేస్తారు. కోర్టువారు పిలిచిన రోజున మీ దంపతులు పాపని, పాప అసలు తల్లిదండ్రుల్ని తీసుకుని కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.
మీ రెసిడెన్స్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, ఆదాయ వివరాలకు సంబంధించిన పత్రాలను కోర్టు అడుగుతుంది. వాటితో పాటు మీవి, పాపవి, పాప తల్లిదండ్రుల ఫొటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పాపని ఎందుకు దత్తత తీసుకుంటున్నారు, నిజంగా పిల్లలు అవసరమై చేసుకుంటున్నారా లేక వేరే ఏదైనా ఉద్దేశం ఉందా వంటి విషయాలు దర్యాప్తు చేస్తారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బిడ్డ మీద పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇస్తారు. ఐదారు నెలల లోపే ప్రాసెస్ పూర్తయిపోతుంది. మగపిల్లాడయినా, ఆడపిల్లయినా ఒకటే పద్ధతి.
అయితే దత్తత విషయంలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. కొందరు మధ్యవర్తులు తాము చేసేస్తామని చెప్పి, అఫిడవిట్లు రాసి, నోటరీ చేయించి ప్రాసెస్ పూర్తయిందని చెబుతున్నారు. అలాంటివారిని నమ్మకండి. లాయర్ ద్వారా జడ్జిగారి ముందు జరిగేదే నిజమైన అడాప్షన్ అన్న విషయం గుర్తుంచుకోండి.
- నిశ్చల సిద్ధారెడ్డి, న్యాయవాది