శాంతా శ్రీనివాసన్ : తపాలాబిళ్లకే గౌరవం
చెన్నై సామియర్స్ రోడ్డులో నివాసం ఉంటున్న 81 ఏళ్ల శాంతా శ్రీనివాసన్ 2015 వరదల్లో తన సర్వస్వం కోల్పోయారు. అందుకు ఆమె పెద్దగా బాధపడలేదు కానీ, దశాబ్దాలుగా ఆమె సేకరించుకుంటూ వస్తున్న అరుదైన తపాలా బిళ్లలు కూడా పోగొట్టుకున్న ఆ ‘సర్వస్వం’లో ఉండటం ఆమెను ఎంతో మనోవేదనకు గురిచే సింది. అలాగని ఆమె చింతిస్తూ కూర్చోలేదు. మూడేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి, తిరిగి తన స్టాంపుల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడా తపాలా బిళ్లల్ని అన్నా రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఉన్న ‘ఫిలాటñ లిక్ బ్యూరో’ ప్రదర్శనకు పెట్టింది. వాటిల్లో లైంగిక సమానత్వం, వర్కింగ్ ఉమన్ ప్రధానాంశాలుగా ఉన్న స్టాంపులు కూడా ప్రత్యేక విభాగంగా ఉన్నాయి. 1940లలో పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి శాంత తపాలా బిళ్లల్ని సేకరిస్తున్నారు.
ఈ అద్భుతమైన ‘ఫిలాటలీ’ ప్రపంచాన్ని (స్టాంపుల సేకరణ, అధ్యయనం) చిత్తూరులో ఉండే ఆమె కజిన్ ఆమెకు మొదట పరిచయం చేశారు.
అక్కడి నుంచి ఆమెకు ‘ఫస్ట్ డే కవర్స్’, కొత్తగా విడుదలైన స్టాంపులను ఆ కజిన్ పంపించేవారు. (అధికారికంగా విడుదలైన వెంటనే ఆ స్టాంపులతో బట్వాడా అయ్యే కవర్లను ఫస్ట్ డే కవర్స్ అంటారు). విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి నుంచి ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపులను సేకరించి తెచ్చుకునేవారు శాంత. శాంత భర్త శ్రీనివాసన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. అలా కూడా సెంట్రల్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ నుంచి అరుదైన స్టాంపులు అమెకు అందేవి. అలాగే కొన్ని స్టాంపుల్ని తోటి ఫిలాటలిస్టుల నుంచి ఆమె ఇచ్చిపుచ్చుకునేవారు. 1857కు పూర్వపు స్వాతంత్య్ర సమరయోధులైన రాణీ వేలు నచియార్, రాణీ అవంతీబాయి, సంగీత విద్వన్మణులు వీణా ధనమ్మాళ్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.. ఇంకా అనేక రంగాలలోని సుప్రసిద్ధులపై వచ్చిన తపాలా బిళ్లలు శాంత కలెక్షన్‌లో ఉన్నాయి.
‘‘స్టాంపులపై శాంతా శ్రీనివాసన్‌కు ఉన్న ఆసక్తిని, ఆమెలోని తపనను చూశాక ఆమె కలెక్షన్‌కు చోటు కల్పించాలని నిర్ణయించుకున్నాం. తమిళనాడులోని తపాలాశాఖలలో డిపాజిట్ అకౌంట్‌లు ఉన్న ఖాతాదారులలో శాంతమ్మలా దాదాపు 12 వేల మంది స్టాంపుల సేకరణ హాబీ ఉన్నవారు ఉన్నారు’’ అని చెన్నై సిటీ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఆర్.ఆనంద్.. శాంతను అభినందిస్తూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment