అంగారకుడిపైకి వన్ వే టికెట్!
శాస్త్రవేత్తల అంచనాలే తప్ప సాధారణ మనిషి ఊహకందని వాతావరణ పరిస్థితులు! గ్రహాంతరవాసులే ఉంటారో, బతుకు గమనమే మారిపోతుందో తెలీదు. అసలు అక్కడ అడుగుపెట్టడమైనా సాధ్యమవుతుందా అనేదే అతిపెద్ద అనుమానం! అయినా సరే, ‘అంగారకుడి పైకి వస్తారా?’ అని అడిగింది ఆలస్యం... ‘మేము రెడీ’ అంటూ... ఏకంగా రెండు లక్షల మంది ఉత్సాహవంతులు అప్లికేషన్‌లు వేశారు. తాము భూమిని విడిచి అరుణగ్ర హం రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని పేర్కొంటూ హామీ పత్రాలు రాసిచ్చారు. అంగారకుడి పైకి వన్ వే టికెట్ కొనుక్కోవడానికి అమితాసక్తి చూపించారు.
సంగతేమంటే... డచ్‌కు చెందిన ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ 2016 కల్లా అంగారకుడి పైకి మనిషిని పంపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకు సంబంధించి అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తున్న ఈ సంస్థ అందులో ప్రయాణించడానికి, భూమిని శాశ్వతంగా వదిలి అంగారకుడిపై సెటిలవ్వడానికి 24 మందిని సెలక్ట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం దర ఖాస్తులను ఆహ్వానిస్తే ఏకంగా రెండు లక్షలమంది నుంచి అవి వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ దరఖాస్తు దారుల్లో 165 దేశాలకు చెందినవారు ఉన్నారు.
వీరిలోంచి అనేక దశలుగా, అనేక షరతులతో 24 మందిని సెలక్ట్ చేయడానికి ఆ సంస్థ రెడీ అవుతోంది. ఈ ‘మార్స్ మిషన్’ దరఖాస్తుదారులకు ఎలాంటి మిలటరీ ట్రైనింగ్ ఉండదని, వారికి ఫ్లయింగ్ విషయంలో ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదని, కనీసం సైన్స్ డిగ్రీ కూడా అవసరం లేదని ఆ అంతరిక్ష సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే అభ్యర్థికి కనీసం వయసు 18 సంవత్సరాలని, అతడు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు.
క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఇంతకుమించి ప్రత్యేక నైపుణ్యాలేవీ కూడా అవసరం లేదన్నారు. భూమి తర్వాత మానవ ఆవాసానికి అరుణగ్రహం మీదే అంతో ఇంతో అనుకూలమైన పరిస్థితులున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ అరుణగ్రహ యాత్ర ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడవలసిన విషయం.