సాక్షి, అమరావతి: తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్లు ఎవరికీ తెలియదు. కానీ.. తన కలల సౌధాన్ని నిర్మించిన శ్రామికుల వివరాలన్నీ ఆ యజమానికి తెలుసు. వారి పేర్లు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా శిలాఫలకంపై చెక్కించాడు ఆ అపార్ట్‌మెంట్ యజమాని కొత్తపల్లి మురళీమోహనరావు (అబ్బులు). ఆయన విలక్షణ శైలి గురించి తెలిసినోళ్లంతా ‘వావ్.. సమ్‌థింగ్ స్పెషల్ అబ్బులు’ అంటుంటారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో 2012లో నిర్మించిన ఐదంతస్తుల ‘అలిపిరి అపార్ట్స్’లోకి వెళ్లగానే సెల్లార్‌లో నిలువెత్తు శిలాఫలకం కనిపిస్తుంది. అందులో ఆ భవన నిర్మాణం కోసం శ్రమించిన తాపీమేస్త్రి, ప్లంబర్, కరెంటు వర్కర్, పెయింటర్, ఐరన్ మేస్త్రి, టైల్స్ మేస్త్రి, వాచ్‌మేన్ పేర్లు, వారి ఊరు, ఫోన్ నంబర్లు ఆ శిలాఫలకంపై దర్శనమిస్తాయి. ఆ అపార్ట్‌మెంట్ గృహప్రవేశం జరిగి ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యింది. శ్రామికుల పేర్లతో అమర్చిన శిలాఫలకాన్ని చూసిన ప్రతి ఒక్కరు అబ్బురపడుతున్నారు. శ్రామికులకు గుర్తించిన అబ్బులును అభినందిస్తున్నారు.
వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతికి..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికల్లో గెలిస్తే తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కుకున్న అబ్బులు అప్పట్లోనే మొక్కు చెల్లించుకున్నారు. తణుకు నుంచి పాదయాత్ర చేపట్టి ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి తిరుమల తిరుపతి వెళ్లారు. 15 రోజుల పాదయాత్ర చేసి 2004 ఆగస్టు 5న తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. దారి పొడవునా జోలెపట్టి ప్రజల నుంచి సేకరించిన రూ.32 వేల విరాళంలో రూ.16 వేలు తిరుపతి వెంకటేశ్వరుడి హుండీలోను, మరో రూ.16 వేలు తణుకులోని నాలుగు ఆలయాల్లోను సమర్పించి దేవుడిపైన, ఇటు వైఎస్‌పైన తన భక్తిని చాటుకున్నాడు.
శ్రామికుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకం
పురాతన నాణేల సేకరణ
అబ్బులుకు పురాతన నాణేలు సేకరించే మరో హాబీ కూడా ఉంది. కాలక్రమంలో కనుమరుగైన అనేక నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. కాణీలు, అణాలు, పైసలు వంటివి సేకరించడం గమనార్హం.
సంతృప్తినిచ్చే పనులు చేస్తాను
విలక్షణంగా ఆలోచించి అమలు చేయడం సంతృప్తినిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రముఖుల పేర్లతో శిలాఫలకాలు వేస్తారు. అలాకాకుండా శ్రామికుల పేర్లు శిలాఫలకంపై వేస్తే వారికెంతో సంతృప్తిగా ఉంటుంది. అందుకే నా భవన నిర్మాణంలో శ్రమించిన వారి పేర్లతో శిలాఫలకం వేయించాను. అది చూసి వారి ముఖంలో అప్పట్లో కనిపించిన ఆనందం.. పదేళ్లయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. నాకు వైఎస్ అంటే చాలా ఇష్టం. 2004లో వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతి వెళ్లాను. కనుమరుగవుతున్న పురాతన నాణేలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో వాటి సేకరణను హాబీగా పెట్టుకున్నాను.
– కొత్తపల్లి మురళీ మోహనరావు (అబ్బులు), తణుకు
Comments
Please login to add a commentAdd a comment