గుర్తుకొస్తున్నావు మర్చిపోము | one year completed by ritheswari suside | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నావు మర్చిపోము

Published Thu, Jul 14 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

గుర్తుకొస్తున్నావు  మర్చిపోము

గుర్తుకొస్తున్నావు మర్చిపోము

రిషితేశ్వరి
జననం: 22 ఏప్రిల్ 1997
మరణం: 14 జూలై 2015


మర్చిపోము.
నీ మరణానికి కారణం మర్చిపోము.
నీవు పడ్డ వేదనను మర్చిపోము.
నీ త్యాగం మర్చిపోము.
స్ట్రెచర్ మీద నిన్ను నిర్జీవంగా పడేసిన రోజును మర్చిపోము.
దశదిశలా పెల్లుబికిన ఆక్రోశాన్ని మర్చిపోము.
కంట తడి పెట్టిన ప్రతి కన్నునూ మర్చిపోము.
మండిన ప్రతి గుండెనూ మర్చిపోము.
అంతిమంగా...
‘ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు’ అన్న నీ దీక్ష మర్చిపోము.

 

పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే
 నవ్వును హత్య చేశారు!
 విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే
 నమ్మకాన్ని హత్య చేశారు!
 ఆచార్యులు అంటే విద్యాబుద్ధులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే
 భరోసాను హత్య చేశారు!
 సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే
 ఆశను హత్య చేశారు!
 క్యాంపస్‌లో, క్యాంటీన్‌లో, హాస్టల్‌లో స్నేహం గుబాళిస్తుందన్న
 అమాయకత్వాన్ని హత్య చేశారు!
 ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ
 మానవత్వాన్ని హత్య చేశారు!
 కనిపెంచిన అమ్మపై, నాన్నపై,
 చదువుతున్న చదువుపై పెంచుకున్న
 ప్రేమను హత్య చేశారు!
 బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న
 ఆశయాన్ని హత్య చేశారు!
 ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా
 వ్యక్తిత్వాన్ని హత్య చేశారు!
 కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా
 ధైర్యాన్ని హత్య చేశారు!
 యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా
 ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు!
 ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని
 మంచితనాన్నీ హత్య చేశారు!
 రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు!



 
కాలేజీలు తెరిచారు. రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలలో మన పిల్లలు... పరాయి రాష్ట్రాల పిల్లలు మెల్లమెల్లగా క్లాసులకు హాజరవుతున్నారు. సీనియర్లు ఉత్సాహపడే సమయమిది. ఫ్రెషర్స్‌ని ర్యాగింగ్ చేద్దామని ఉబలాటపడే సమయం. ఇప్పుడే అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వాలు ఆయా సంస్థలకి తన శాఖల ద్వారా తాఖీదులు అందించాలి. ప్రతి విద్యాసంస్థా అంతర్గతంగా ర్యాగింగ్‌ని నిరోధించే కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు... తమది కూడా అని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలి. తల్లితండ్రులు తాము ఏ విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చారో, ఆ సంస్థల్ని ర్యాగింగ్ పట్ల జాగ్రత్తలు తీసుకునేలా హెచ్చరికలు చేయాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితే, మరో రిషితేశ్వరి ఘటన జరగదు. ఈ విద్యా సంవత్సరం మరో కొత్త బలిని కోరదు. ‘సాక్షి’ ఉంది. ఆడపిల్లలపై అకృత్యాలు సాగితే, చూస్తూ ఊరుకోదు. పోరాడుతూనే ఉంటుంది. రిషితేశ్వరి సాక్షిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.
 
నువ్వు రాసిన ఉత్తరం చదివి ఏడాదయ్యింది. నిన్న చదివినట్టుగానే అనిపిస్తోంది. ఆ ఉత్తరంలో నీ ఆవేదన...  నీపై క్రూరమైన చర్య చేసినవాడి పట్ల నువ్వు చూపిన సింపథీ...  గుర్తు చేసుకుంటున్నాం. నీ నవ్వు, నీ ధ్యేయం... నీ లక్ష్యం, నీ ప్రేమ...  నీ పరిణతి...  గుర్తు చేసుకుంటున్నాం.  నాన్న దగ్గర డబ్బు తీసుకుని స్నేహితుడికి  పుస్తకాలు కొనిపెట్టిన నీ ఔదార్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం.
 

చదువుల తల్లిని చిదిమేశారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చిన ఆ అమ్మాయి హాస్టల్‌లో ర్యాగింగ్ భూతానికి బలైంది. స్నేహభావం చూపాల్సిన తోటి విద్యార్థులు సీనియర్లే యమభటులై, ర్యాగింగ్ చేసి తీవ్ర మానసిక వ్యధ అనుభవించేలా చేయడంతో నిండు ప్రాణం తీసుకుని కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఇది గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి దయనీయ కథ.
 ఆర్కిటెక్చర్‌పై మక్కువ పెంచుకున్న రిషితేశ్వరి ఎంట్రన్స్‌లో 112వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో అయితే హాస్టల్ సౌకర్యం సరిగా ఉండదు, నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి నాగార్జున యూనివర్సిటీలో చేరింది. కాని అక్కడ నిత్యం ఆమెను ర్యాగింగ్ వెంటాడింది. మానసిక క్షోభకు గురి చేసింది. వరంగల్‌కు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల దంపతుల ఏకైక కుమార్తె అయిన ఆ బంగారు తల్లి తన బతుకును బలి ఇచ్చింది.
 
ఫ్రెషర్స్ డే నుంచే మొదలు
ఫ్రెషర్స్ డే నుంచే రిషితేశ్వరి వేధింపులు మొదలయ్యాయి. ఆ రోజునే సీనియర్ విద్యార్థి ఒకడు రిషితేశ్వరితో అమర్యాదగా ప్రవర్తించాడు. మళ్ళీ అదే విద్యార్థి మరుసటి రోజు క్లాసుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ప్రవర్తన మార్చుకోమని రిషితేశ్వరి గట్టిగానే చెప్పింది. ఆ తరువాత తరచూ సీనియర్ల నుంచి ఇబ్బందులు కొనసాగాయి. అలాగే హాస్టల్‌లో చేరిన మొదటి రోజే సీనియర్లు రూమ్ ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేశారు. మరుసటి రోజు ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ప్రిన్సిపాల్ బాబూరావు తమ వర్గం వ్యక్తేననీ, తమనేమీ చేయడనీ రిషితేశ్వరిని  హెచ్చరించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నా అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలో 2015 జూలై 13వ తేదీన సాయంత్రం రిషితేశ్వరి తోటి విద్యార్థులతో కలిసి మంగళగిరిలో  సినిమాకు వెళ్ళింది. హాలులో ఓ సీనియర్ విద్యార్థి నడుముపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పట్టరాని కోపంతో ఏం చేయాలో పాలుపోక కొంతసేపు విలపించింది.


ఆ తరువాత అదే రోజు రాత్రి సీనియర్ విద్యార్థుల వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. రిషితేశ్వరిని సీనియర్ విద్యార్థినులు అర్ధనగ్నంగా నడిపించి, అదంతా వీడియో తీశారు. తమ తోటి విద్యార్థులకు చూపించారు. దీంతో మరింత కలత చెందిన రిషితేశ్వరి జూలై 14వ తేదీ ఉదయం చివరిసారిగా తండ్రితో మాట్లాడింది. 14వ తేదీ ఉదయం తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి ‘బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ‘ ఐ లవ్ యూ నాన్నా’ అని వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టింది. ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడింది. మెసేజ్ వచ్చిన కొద్దిసేపటికే రిషితేశ్వరి చనిపోయిందన్న ఫోన్ కాల్ మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతుల గుండె పగిలేలా చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చిన రిషితేశ్వరి మెస్‌లో కనబడకపోయేసరికి, స్నేహితులు రూమ్‌కు వెళ్ళి చూశారు. అప్పటికే, రిషితేశ్వరి మృతి చెంది ఉంది. జీవితంలో జరిగే ప్రతి మంచి, చెడులను రిషితేశ్వరికి డైరీలో రాసుకోవడం అలవాటు. అలాగే చనిపోయే ముందు డైరీలో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. యూనివర్సిటీ జీవితం నరకప్రాయమైందనీ, నవ్వాలంటే భయపడే పరిస్థితి ఇక్కడ ఉందనీ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
 
ప్రిన్సిపాల్ బాబూరావు వల్లే ...
ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు నిర్లక్ష్యం వల్లే రిషితేశ్వరి మరణించిందనే ఆరోపణలున్నాయి. వర్సిటీలో జరిగే ప్రతి ఘటననూ ఆయన దృష్టికి రిషితేశ్వరి తీసుకెళ్ళినప్పటికీ ఒక్కదానికి కూడా ఆయన స్పందించలేదు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడడం, తరచూ హాస్టల్స్‌లో పరిస్థితులు చూడడం - ఇలాంటివేవీ చేసి, గాడిలో పెట్టిన దాఖలాలు లేవు. చివరకు తన సామాజిక వర్గ విద్యార్థులకు కొమ్ముకాస్తూ మిగిలిన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. హాయ్ లాండ్ రిసార్ట్స్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే పార్టీలో విద్యార్థులతో కలిసి బాబూరావు నృత్యాలు చేశారు. రిషితేశ్వరి కేసులో బాబూరావుతోపాటు మరో  ముగ్గురు సీనియర్ విద్యార్థులు దుంబా హనీసా, నరాల శ్రీనివాస్, ధరావత్ జయచరణ్‌లపై కేసు నమోదు చేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం
రిషితేశ్వరి మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, విద్యార్థి, యువజన సంఘాలు  ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. ఫేస్‌బుక్‌లో నెటిజన్‌లు 13 వేల మంది రిషితేశ్వరి మరణానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వానికి మాయనిమచ్చగా మారిన ఈ ఘటనకు స్పందనగా ఆఘమేఘాల మీద వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ఉన్న సాంబశివరావును తప్పించి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎం.ఉదయలక్ష్మిని ఇన్‌చార్జి వీసీగా నియమించారు. బాబూరావును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం తెస్తామనీ, ప్రతి యూనివర్సిటీలో, కాలేజీల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామనీ, యూనివర్సిటీ బయట పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేస్తామనీ, ఎక్కడా ఇటువంటి మరణాలు లేకుండా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనలో ఏ ఒక్కటి అమలులోకి రాకపోవడం దారుణం. నిందితులైన విద్యార్థులకు అరెస్టు చేసిన కొద్ది రోజులకే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  కేసులో కీలక నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావు జిల్లా కోర్టులో లొంగిపోయి, బెయిల్‌కు దాఖలు చేశాడు. జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించడంతో, హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. బెయిల్‌పై ప్రస్తుతం బయటే ఉన్నారు. రిషితేశ్వరి తల్లితండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రాజమండ్రిలో 500 గజాల స్థలం, రూ.10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. కేసు ఇప్పటికీ తేలకుండా మిగిలిపోయింది.
 
రిషితేశ్వరి రాసిన అప్పటి సూసైడ్ నోట్
నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.  మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను.
 ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది.
 
చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది.
 సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది.
 
అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్‌నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్‌డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి.రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి.  బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
 
భయమే ఈ ప్రభుత్వ సందేశమా?
సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
ఫాస్ట్ ట్రాక్ వేయమంటే పట్టించుకోవట్లేదు!

మా పాప మరణించి ఏడాది అయినా ఇప్పటికీ తన జ్ఞాపకాల నుంచి బయటకి రాలేకపోతున్నాం. నిత్యం వేదన అనుభవిస్తున్నాం. కానీ మా వేదన ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పరిధిలోకి చేర్చాలని మేం గతంలో ప్రభుత్వాన్ని కోరాం. కానీ పట్టించుకోలేదు. మా పాప కేసులో పోలీసులు చార్జిషీటు మాత్రమే వేశారు. అదింకా కోర్టులో విచారణ, వాయిదాల వరకు రాలేదు. మొదటి వాయిదాకు సంబందించి బుధవారం సాయంత్రమే న్యాయవాది సమాచారం ఇచ్చారు. ఇలా అయితే నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది? కేసును త్వరగా విచారించి, దోషులకు శిక్ష పడేలా చేయాలి. మా పాపలాగా ఇంకెవరికీ జరగకూడదు. ఆ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. విద్యావ్యవస్థలోను, యూనివర్సిటీల్లోనూ ఇలాంటి సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టం చేయాలి.  - రిషితేశ్వరి తల్లి దుర్గాబాయ్
 
 
ఏ ఒక్కరినీ వదలకూడదు!

 ర్యాగింగ్ అనే రాక్షసత్వం నా కూతుర్ని మింగేసింది. ఇప్పుడు నేను మనిషిగా లేను. నాకు ఆశలు లేవు. ఆశయాలు లేవు. నా కూతురితోనే అన్నీ పోయాయి. నాకసలు జీవితమే లేదు. ఇలాంటి ఘోరం ఎక్కడా ఎవరికీ జరక్కూడదు. నా కూతురి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలకూడదు. అందరికీ శిక్షపడాలి.  - రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ
 
ఎక్కడ చూసినా అవే...
ఢిల్లీలోని మోడల్ టౌన్‌లోని ఇరవయ్యొక్కేళ్ల ఆర్జూ హత్యకు గురయ్యింది. ఓ ఫ్లాట్‌లో శిథిలావస్థలో ఆమె మృతదేహం దొరికింది. తన ప్రేమికుడు నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి నిలదీసిందామె. దాంతో ఆమెని చంపేశాడు. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలీక ఇంట్లోనే ఓ చోట దాచిపెట్టాడు. కేరళలోని పెరుంబవూర్. అదొక పేద ఇల్లు. తల్లీకూతురు మాత్రమే ఉంటారు. తల్లి కష్టపడి, ఇళ్లలో పాచిపని చేసి కూతుర్ని లా చదివిస్తోంది. ఆరోజు సాయంత్రం ఆమె పనినుంచి వచ్చేసరికి కూతురు రక్తపు మడుగులో పడివుంది. దారుణాతి దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, ముప్ఫై సార్లకు పైగా కత్తితో పొడిచి పొడిచి చంపారామెని. నిర్భయ తర్వాత అంత దారుణంగా జరిగిన సంఘటన ఇదేనని పలువురు వ్యాఖ్యానించారు.
     
ఉత్తరప్రదేశ్‌లోని నాన్పరా. కొన్ని నెలల క్రితం ఓరోజు ఉదయం ఊరి మధ్య ఉన్న చెట్టును చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఓ పదిహేనేళ్ల అమ్మాయి శవం చెట్టుకు వేళ్లాడుతోంది. అందరూ ఆమె ఆత్మహత్య చేసుకుందనుకున్నారు. కానీ అది నిజం కాదని, ఎవరో రేప్ చేసి చంపేసి చెట్టుకు వేళ్లాడదీశారని పోలీసులు వస్తేకానీ తెలియలేదు.  చెన్నైలోని నుంగంబాక్కం. ఆఫీసుకు వెళుతున్న స్వాతిని రామ్‌కుమార్ అనే యువకుడు దారుణంగా చంపేశాడు. తన ప్రేమను ఆమె అంగీకరించకపోవడమే అందుక్కారణం. అదింకా మరవకముందే ఆదిలాబాద్‌లోని ఓ పట్టణంలో ఓ ఉన్మాద ప్రేమికుడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిని నరికి చంపాడు.
 
ఇవన్నీ రిషితేశ్వరి మరణం తర్వాత సంభవించిన దారుణాలు. ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాలకు సాక్ష్యాలు. ఇవన్నీ ఓ పక్క... రిషితేశ్వరి మాదిరిగా కేవలం ర్యాగింగ్ భూతానికే బలైపోతున్న సంఘటనలు మరోపక్క. ఢిల్లీకి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలో బీటెక్ చదువుతోన్న హైదరాబాద్ యువకుడు కృష్ణచైతన్య కూడా ర్యాగింగ్ కారణంగా ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అనంతపురం జిల్లా, దొన్నికోటవారిపల్లెకు చెందిన మధువంతరెడ్డి (16)ని కూడా ర్యాగింగ్ రక్కసి మింగేసింది.
 
రిషితేశ్వరి  సున్నిత మనస్కురాలు
రిషితేశ్వరి చాలా సున్నిత మనస్కురాలు. బాగా చదివే తెలివైన అమ్మాయి. క్లాసులో లెక్చరర్ చెప్పేది వెంటనే అర్థం చేసుకోవడంతోపాటు, సాయంత్రం హాస్టల్‌లో దాని గురించే చర్చించేది. చాలా కలుపుగోలుగా ఉండే రిషితేశ్వరి ఆకస్మికంగా మరణించడం నన్ను బాగా కలిచి వేసింది. గత ఏడాది తను నా రూమ్‌మేట్. దీంతో ఇద్దరం చాలా సన్నిహితంగా మెలిగేవాళ్లం. రిషితేశ్వరి లేని లోటు మమ్మల్ని చాలా వెంటాడుతోంది. నేను రిషితేశ్వరిని బాగా మిస్సవుతున్నా. - రిషితేశ్వరి రూమ్‌మేట్ కీర్తన
 
చాలా మిస్సవుతున్నాం
రిషితేశ్వరి చాలా మంచి అమ్మాయి. చాలా తెలివిగా, చురుగ్గా ఉండే రిషితేశ్వరి మరణాన్ని మా క్లాస్‌మేట్స్ అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. మేము రిషితేశ్వరిని చాలా మిస్సవుతున్నాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ సమయంలో ఏదైనా కార్యక్రమం అప్పుడు రిషితేశ్వరిని గుర్తుచేసుకుని బాధపడుతున్నాం. తను బతికి ఉంటే మంచి ఆర్కిటెక్ట్ అయి ఉండేది. మంచి పేరు సంపాదించుకుని తల్లిదండ్రులకు పేరు తేవాలని ఎప్పుడూ చెబుతుండేది. - రిషితేశ్వరి క్లాస్‌మేట్ పవన్ కల్యాణ్
 
సీనియర్లకు అవగాహన కల్పించాలి
జూనియర్ విద్యార్థులు తరగతుల్లోకి ప్రవేశించక ముందే సీనియర్లకు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి సదస్సు ఏర్పాటు చేసి ర్యాగింగ్ చేస్తే జరిగే చెడు పరిణామాల గురించి అర్థమయ్యేలా వివరించాలి. వీలైతే ర్యాగింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిగురించి వీడియో రూపొందించి లేదా, పత్రికల్లో వచ్చిన కథనాలు చూపించి ఇలాంటి మరణాలు జరుగకుండా ఉండాలంటే ర్యాగింగ్ నిరోధమే ముఖ్యమనే విషయం అర్థమయ్యేలా తెలియజేయాలి. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి ప్రభుత్వ పరంగా, చట్టపరంగా పడే శిక్షలు, జరిమానాల గురించి వివరించి, వాటిని అన్ని చోట్ల బోర్డుల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శింప చేయాలి. ప్రతి కళాశాలలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఎవరైనా హెల్ప్‌లైన్ ద్వారా మాట్లాడి తమ సమస్య చెప్పుకునే వీలు లేని పక్షంలో గ్రీవెన్స్ బాక్సు ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదులు వేసేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రతి మూడు నెలలకొకసారి విద్యార్థుల సమస్యలపై  కళాశాల యాజమాన్యం, బోధనా సిబ్బందితో చర్చించి విద్యార్థులకు అండగా నిలవాలి. ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణులను ఏర్పాటు చేసి విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, వికృత చేష్టల బారిన పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలి.  - డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల వైద్య విభాగం, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్
 
జరుగుతున్నాయి కానీ... నమోదవడం లేదు!!
ర్యాగింగ్... ఇవాళ్టికీ కాలేజీలు, యూనివర్సిటీలతో సహా పలు విద్యాసంస్థల్లో విజృంభిస్తున్న భూతం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) దగ్గర లభిస్తున్న దేశవ్యాప్త డేటా ప్రకారం చూస్తే మన రాష్ట్రం సహా ప్రతి రాష్ట్రం ర్యాగింగ్ ఫిర్యాదులతో అపకీర్తిని మూటగట్టుకుంటోంది.
 
నిజానికి, ర్యాగింగ్‌ను నిషేధిస్తూ, చాలా ఏళ్ళ క్రితమే 1997లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అటుపైన దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో నియమ నిబంధనలూ జారీ చేస్తూ వచ్చింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ర్యాగింగ్ భూతం ఇప్పటికీ తిష్ఠ వేసుకొనే ఉంది. చాలా సంస్థల్లో జరుగుతున్న సంఘటనలు ఇప్పటికీ అధికారుల నోటీసుకు రావడం లేదు. అందుకే, ఇక్కడ యాంటీ - ర్యాగింగ్ సెల్స్‌లో నమోదవుతున్న కేసులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలుగునాట ఒక్క 2015లోనే 90కి పైగా ర్యాగింగ్ ఫిర్యాదులు నమోదవడం గమనించాల్సిన విషయం. కొత్తగా విద్యాసంస్థల్లోకి చేరిన విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉంటారు. దాంతో, కేసులు తక్కువ నమోదవుతుంటాయని పేరు ప్రచురించడానికి ఇష్టపడని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ర్యాగింగ్ గురించి విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తే, ఈ సంస్కృతికి వీలైనంత అడ్డుకట్ట వేయగలుగుతామని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
 మీ విద్యాసంస్థలో ర్యాగింగ్ జరుగుతోందా? అయితే, ఫిర్యాదు చేయండి... నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ : 24గీ7 టోల్‌ఫ్రీ నంబర్ - 1800-180-5522  మెయిల్ ఐడి: helpline@antiragging.in
 
 
అసలు ఏమైందంటే...
ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నది రిషితేశ్వరి కల. అయితే, తల్లి అభ్యంతరం చెప్పడంతో దాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత ఎయిర్‌హోస్టెస్, మెరైన్ ఇంజనీర్ - ఇలా రకరకాల కలలు కన్న  ఈ విద్యార్థిని చివరకు నాగార్జున యూనివర్సిటీలో ‘కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్’లో చేరారు.
 
 
2015 ప్రథమార్ధం
ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్‌లో రిషితేశ్వరికి 112వ ర్యాంకు. హైదరాబాద్‌లో హాస్టల్ వసతి లేదని, నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి ఆమెను చేర్పించిన అమ్మానాన్న దుర్గాబాయి, మురళీకృష్ణ. 2015 ఏప్రిల్ 18... యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే పార్టీ  తొలి రోజునే రిషితేశ్వరికి ఎదురైన ర్యాగింగ్. పార్టీ ముగిసే టైమ్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడం. ‘ఆ రోజే నాకు చనిపోవాలనిపించింది’ అని రాసుకున్న రిషితేశ్వరి. ఆ తరువాతా సీనియర్ల నుంచి వేధింపులు. హాస్టల్‌లో చేరిన తొలి రోజే రూమ్ ఖాళీ చేయమంటూ సీనియర్ల ఒత్తిడి. అదేమంటే, ప్రిన్సిపాల్ బాబూరావు తమ వర్గం వాడేనంటూ హెచ్చరిక!
 
ఏప్రిల్ - జూలై మధ్య మూడు నెలల్లో... వివిధ సందర్భాల్లో...
 జీవితంలో జరిగిన మంచీ, చెడూ అంతా డైరీలో రాసుకోవడం రిషితేశ్వరి అలవాటు. ఆ డైరీల్లోని అంశాలను బట్టి... ఒకసారి ఆమె స్పృహలో లేనప్పుడు ఒక సీనియర్ అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే, మరోసారి ఒక సీనియర్ వాట్సప్‌లో ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశారు. ఇలాంటి సంఘటనలతో మానసికంగా చిత్రవధ అనుభవించి, చనిపోవాలని ఉందని పదే పదే పేర్కొన్న రిషితేశ్వరి.
 
జూలై 13... సాయంత్రం
తోటి విద్యార్థులతో కలసి మంగళగిరిలో ఫస్ట్‌షో సినిమాకు వెళ్ళిన రిషితేశ్వరి. సినిమా హాలులో చాలా అసభ్యంగా ప్రవర్తించిన సీనియర్.
 
జూలై 13... రాత్రి
 తారస్థాయికి చేరిన సీనియర్ల వేధింపులు. తోటి అమ్మాయి అని కూడా చూడకుండా రిషితేశ్వరిని అర్ధనగ్నం చేసి నడిపించి, వీడియో తీసి, చూపిన సీనియర్ విద్యార్థినులు.
 
జూలై 14... ఉదయం
 తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి, ‘బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా’ అని చెప్పి, ఫోన్ పెట్టేసిన రిషితేశ్వరి.
 
మధ్యాహ్నం ఒంటి గంట...

 ‘ఐ లవ్ యూ నాన్నా’ అని తండ్రికి వాట్సప్‌లో మెసేజ్ పెట్టిన రిషితేశ్వరి. ఆ తరువాత కాసేపటికే హాస్టల్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరిపోసుకొని, రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లితండ్రులకు సమాచారం.
 
2015 జూలై 16
 రిషితేశ్వరిని ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారంటూ భారత శిక్షా స్మృతిలోని 306వ సెక్షన్, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని 4వ సెక్షన్ కింద ముగ్గురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు, అరెస్టు.
 

2015 జూలై ద్వితీయార్ధం
రాష్ట్రంలోనే కాక, దేశమంతటా చర్చ రేపిన రిషితేశ్వరి ర్యాగింగ్ మరణం. చనిపోయే ముందు డైరీలో రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖతో సంచలనం. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు. నిందితులైన ముగ్గురు విద్యార్థులకు 75 రోజుల రిమాండ్ తరువాత 2015 అక్టోబర్ 1న కోర్టు బెయిల్.

2016 జనవరి 1
రిషితేశ్వరి కేసులో దర్యాపు మొదలైన దాదాపు అయిదు నెలల తర్వాత, ఛార్జ్‌షీట్‌కు ఎక్కిన ప్రిన్సిపాల్ బాబూరావు పేరు.
 
2016 జూలై 13
ఇప్పటికీ తేలని రిషితేశ్వరి కేసు. కోర్టులో కొనసాగుతున్న పోరాటం. బెయిల్‌పై బయటే ఉన్న అప్పటి ప్రిన్సిపాల్ బాబూరావు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, న్యాయం చేయాలని మొర పెట్టుకుంటున్న తల్లితండ్రులు.

జూలై 14 ఉదయం...
 ప్రభుత్వం, బాధ్యులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా?
 
దేవుడా! ఈ పాలకులను మేల్కొలుపు...
పుట్టక ముందే ఆడపిల్లను కనిపెట్టి కడతేర్చే పరిస్థితులు ప్రజలకు వద్దని చెప్పే,  పుస్తకాలు అబ్బాయికి ఇచ్చి వంట పాత్రలు అమ్మాయికి ఇచ్చే వివక్ష వద్దని తల్లితండ్రులకి చెప్పే, బడిలో మరుగుదొడ్లు లేక ఆ అవసరాలను కూడా బిగదీసుకుని కూర్చునే నిస్సహాయ స్థితి లేదని చెప్పే, కాలేజీలలో వెంటపడి వేధించే పోకిరీలు ఉండరని చెప్పే, కొంగు పట్టుకుని లాగే వెధవలు ఉండరని చెప్పే, యాసిడ్‌లు పోసే రాక్షసులను తుద ముట్టించామని చెప్పే....  ప్రతి ఆడ శిశువు ఊపిరికీ మేమున్నామని చెప్పే
 
ప్రతి బాలిక వికాసానికీ ముందుకు కదులుతామని చెప్పే  ప్రతి యువతి రక్షణకూ అన్నలా నిలుస్తామని చెప్పే అలాగని చెప్పేలా... ఓ దేవుడా... ఈ పాలకులను నిద్ర మేల్కొలుపు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement