
మగాళ్ల కోసం, మగాళ్ల చేత..!
మగాళ్లు, ఆడాళ్లు సమానమే ... ఈ వాక్యంలో మీకేమైనా తేడా కనిపిస్తోందా? జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. మగాళ్లు అంటున్నారు ఈ నినాదం స్త్రీలది కాదు, మగాళ్లదని! సాధారణంగా ఇంతవరకు మహిళలు అనేవారు ‘స్త్రీ పురుషులు సమానం’ అని. ఇపుడు సీన్ మారింది.
మగాళ్లు, ఆడాళ్లు సమానమే ... ఈ వాక్యంలో మీకేమైనా తేడా కనిపిస్తోందా? జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. మగాళ్లు అంటున్నారు ఈ నినాదం స్త్రీలది కాదు, మగాళ్లదని! సాధారణంగా ఇంతవరకు మహిళలు అనేవారు ‘స్త్రీ పురుషులు సమానం’ అని. ఇపుడు సీన్ మారింది.
ఎందుకు? ఏంటి? ఎపుడు?... అన్నది ఇపుడు చూద్దాం.
మగాళ్లు మమ్మల్ని అణచివేస్తున్నారు... మాకు రక్షణ కల్పించండి అన్న వారి వేదనతో స్త్రీల ప్రాణ, మాన రక్షణకు, జీవిత భరోసాకు చట్టాలు వచ్చాయి. ‘ఆ చట్టాలు ఇపుడు మమ్మల్ని వేధిస్తున్నాయి’ అని పురుషులు ఇపుడు నినదిస్తున్నారు. అయితే, స్త్రీలను వేధిస్తున్నవారు, మహిళా చట్టాల ద్వారా బాధలు అనుభవిస్తున్న వారు వేర్వేరు. రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు స్త్రీలు దుర్వినియోగం చేయడంతో దేశంలో కొందరు మగాళ్లు తమ హక్కుల కోసం పోరాటాలు మొదలుపెట్టారు. ‘‘స్త్రీలు, పురుషులూ సమానమే మేము ఒప్పుకుంటాం, కానీ, పురుషులను మహిళా చట్టాలతో అణిచి వేస్తే మాత్రం ఒప్పుకోం. ఎవరికో న్యాయం చేయబోయి, ఇంకెవరికో అన్యాయం చేస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నాయి పురుషుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలు. ఇటీవల దేశంలో ఇలాంటి సంఘాలు పెరిగిపోయాయి. ఆ సంఘాలు పెరిగాయంటే.. బాధిత మగాళ్ల సంఖ్య పెరిగిందని అర్థం చేసుకోవాలి.
నేషనల్ కొయలిషన్ ఫర్ మెన్ (జాతీయ పురుషుల కూటమి) ఒకడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ‘‘ఎంతసేపూ స్త్రీల గురించే పట్టించుకుంటున్నారు. పురుషుల సమస్యలను గాలికొదిలేస్తున్నారు’’ అని ఎన్‌సీఎం కన్వీనర్ అమిత్ గుప్తా రాజకీయ పార్టీలను నిందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ మగాళ్ల హక్కుల గురించి మ్యానిఫెస్టోలో ప్రస్తావించాలి. పురుషుల హక్కుల పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి. స్త్రీలకు మల్లే పురుషులకూ మహిళా కమిషన్, మహిళా మంత్రిత్వ శాఖలున్నట్లే పురుషులకూ ఉండాలంటున్నారు. మీరు మ్యానిఫెస్టోలో మా హక్కుల గురించి ప్రస్తావించండి అని కరాఖండిగా అడిగినా అక్కడి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో ఏకంగా పురుషుల కోసం ఓ రాజకీయ పార్టీయే పెట్టడానికి సిద్ధమైంది ఆ కూటమి.
పార్టీ లక్ష్యాలేంటి? అన్నపుడు వారి వద్ద ప్రామాణికమైన లెక్కలున్నాయట. వరకట్న వేధింపుల చట్టం, గృహహింస చట్టాల కారణంగా మహిళలు పొందుతున్న రక్షణ కంటే మగాళ్లకు జరుగుతున్న నష్టమే ఎక్కువంటున్నారు. ‘‘దేశంలో గృహహింస చట్టాన్ని 70 శాతం మంది దుర్వినియోగం చేస్తున్నారు. మా పోరాటం ఆ చట్టాలపై కాదు, వాటిని దుర్వినియోగం చేస్తున్నా వారిపై మాత్రమే’’ అంటున్నారు అమిత్ గుప్తా. దేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని మతాల్లో మగాళ్లకు ఇదే సమస్య. పురుషాధిక్య సమాజం అన్న ముద్ర ఉండటం వల్ల పురుషులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వేగంగా ముందుకురారు. అందుకే పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వారికి కూడా ఓ వేదిక కావాలి. మగాళ్లు బాధలు చెప్పుకోవడం అవమానకరం ఏమీ కాదు, అవసరం.
మొత్తానికి ఈ ప్రకటన వెలువడ్డాక ఎక్కడా ఎవరూ వింతగా చూడలేదు. నిజమే కాబోలని కొందరంటే... దాదాపు అన్ని పురుష సంక్షేమ సంఘాలు, సమాఖ్యలు పార్టీ వస్తే మంచిదే అంటున్నాయి. మరి భవిష్యత్తు ఏంటో!
- ప్రకాష్ చిమ్మల