
ఫిన్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి మహిళలకు మాత్రమే! ఇందులో అడుగుపెట్టడానికి పురుషులకు అనుమతి లేదు. క్రిస్టినా రోత్ అనే అమెరికన్ మహిళా వ్యాపారవేత్త ఆలోచన ఫలితంగా ఈ దీవి మహిళలకు విడిది కేంద్రంగా రూపుదిద్దుకుంది. వెకేషన్ కాలాన్ని ప్రశాంతంగా గడపడానికి క్రిస్టినా ఒకసారి రాంచ్ మాలిబు సమీపంలోని ఒక ఆశ్రమానికి వెళ్లారు.
అక్కడ పురుషుల ఉనికి కారణంగా మహిళల ఏకాగ్రతకు, ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులను గమనించారు. పురుషుల వల్ల మహిళలు ఇబ్బంది పడకుండా, కేవలం మహిళల కోసమే ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నారు. ఫిన్లాండ్ తీరానికి ఆవల ఎనిమిదిన్నర ఎకరాల దీవి అమ్మకానికి సిద్ధంగా ఉండటంతో, దీనిని తానే కొనేసి, అన్ని సౌకర్యాలతో మహిళల విడిది కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ దీవిలో సేదదీరడానికి దేశ దేశాల నుంచి మహిళలు వస్తున్నారు.