రామ‘చంద్రుడితడు’... రఘువీరుడు
4 నుంచి14 వరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంతో విశిష్టత ఉంది. అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా పేరున్న ఈ ఆలయానికి 2015లో ప్రభుత్వ లాంఛనాల హోదా లభించింది. 2016లో తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు. నాటి నుంచి అభివృద్ధి వేగం పుంజుకుంది. ఈనెల 4న కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 తేదీన ముగియనున్నాయి. ఈ ఉత్సవాలలో ఈనెల 10న నిర్వహించనున్న కల్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశమంతటా శ్రీ సీతారామ కల్యాణాన్ని పగలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రంలో రాత్రిపూట నిర్వహించడం సంప్రదాయం. ఇందుకు చారిత్రక, సామాజిక కారణాలున్నట్లు ఒంటమిట్ట కైఫీయత్తులు, స్థానిక కథనాలు చెబుతున్నాయి.
శ్రీరాముని జన్మఘట్టాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేక పోయానని, కనీసం మంగళకరమైన కల్యాణమైనా చూసే అదృçష్టం కల్పించమని చంద్రుడు బ్రహ్మదేవుడిని కోరాడు. ఆయన సమ్మతించి చంద్రుని కోసమే స్వామి కళ్యాణాన్ని ఏదో ఒకచోట రాత్రిపూట జరిగేలా చూస్తానని మాట ఇచ్చాడు. ఈ రాత్రి కల్యాణానికి మరో పురాణగాథ కూడా ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగినట్లు బాలకాండలో ఉంది. ఈ నక్షత్రం చైత్ర మాసం శుద్ధ చతుర్దశి ఘడియల్లో వస్తుంది. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు తన పాలనలో తొలిసారిగా ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశాడు. నాడు ఆ లగ్నం రాత్రి పూట వచ్చింది. తొలిసారి బ్రహ్మోత్సవాలలో రాత్రిపూట కల్యాణం చేయడంతో అది సంప్రదాయంగా మారింది. మరో విశేషం కూడా ఉంది. బుక్కరాయలు చంద్రవంశీయుడు. తన వంశ మూలపురుషుడైన చంద్రునికి ప్రీతి కలిగించినట్లు కూడా ఉంటుందని రాత్రి లగ్నంలోనే స్వామి కళ్యాణం జరిపించేవాడు.
ఆలయ చరిత్ర....
కడపజిల్లా గెజిట్, కైఫీయత్తుల ప్రకారం క్రీ.శ. 1336 ప్రాంతంలో ఉదయగిరి విజయనగర సామ్రాజ్యంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కరాయలు, బుక్కరాయలు సోదరుడు కంపరాయలు దాని పాలకుడు. ఒంటడు, మిట్టడు అనే బోయవీరులు ఆ ప్రాంత రక్షకులుగా ఉండేవారు. ఓసారిఅక్కడకు రాజు, ఆయన పరివారం విచ్చేశారు. అప్పటికే చాలా దూరం నుంచి వచ్చిన వీరికి దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఎక్కడైనా గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండుననిపించింది. సరిగ్గా అదే సమయంలో వీరికి ఒంటడు అక్కడి ఓ నీటి బుగ్గను చూపి, వారి దాహార్తిని తీర్చాడు. వారి పేరుతోనే ఆ ప్రాంతానికి ఒంటిమిట్ట అన్న పేరు వచ్చింది. దీనితోబాటు మరో కథ కూడా ఉంది. శ్రీ సీతారాములు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు సీతమ్మకు దాహం వేయగా, రాముడు బాణాన్ని భూమిలోకి సంధించాడని, ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి చిన్న కొలనుగా మారిందని స్థలపురాణం.
ఆ కొలనునే రామతీర్థం అంటారు. దగ్గరలో ఉన్న గుట్టపై జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లుగా భావిస్తున్న ఓ శిథిలమైన గుడి ఉంది. దాన్ని పునరుద్ధరించమని వారు కంపరాయలను కోరగా, కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు కంపరాయలు. ఆలయంతోపాటు గ్రామాభివృద్ధి కోసం పడమటి వైపున చెరువు నిర్మాణ ం చేపట్టాలని కూడా ఆయన సంకల్పించాడు. ఆ బాధ్యతను బోయ పాలకులైన ఒంటడు, మిట్టడుకే అప్పగించి అవసరమైన వనరులు ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1355–56 ప్రాంతంలో విజయనగర పాలకుడైన బుక్కరాయలు కాశీ యాత్ర చేశారు. తిరుగు ప్రయాణంలో గోదావరి నది ఒడ్డున ఇసుకపల్లె ప్రాంతం నుంచి నాలుగు విగ్రహాలను తీసుకొచ్చాడు. ఓ విగ్రహాన్ని గండికోట, మరో విగ్రహాన్ని గుత్తి, ఇంకో విగ్రహాన్ని పామిడిలో ప్రతిష్ఠించాడు. ప్రత్యేకంగా తెచ్చిన ఏకశిలపై రూపొందించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించాడు. ఆ స్వామికి రఘునాయకులని పేరు పెట్టుకుని ఆరాధించారు. కాగా, కోదండ రామాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఏకశిలపై ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అనే పేరు కూడ వచ్చింది.
ఎన్నో విశిష్ఠతలు....
భక్తపోతన పెద్దలు తెలంగాణప్రాంతం నుంచి ఆయన బాల్యంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన మహా భాగవతం రాసింది ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలోనే అని తెలుస్తోంది. ఈ ఆలయం అపురూప శిల్పకళా సంపదకు నిలయం. రంగ మండపంలో 32 స్తంభాలు, 16 యాళి స్తంభాలు అద్భుతంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. పురాణాలు, ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలు... కళ్లకు కట్టినట్లు శిల్పాల రూపంలో ఈ మండపంలో కనిపిస్తాయి. నాటి శిల్పుల నైపుణ్యానికి ఈ శిల్ప సంపద సజీవ సాక్ష్యం. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండడు. ఎందుకంటే, సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చే నాటికి వారికి హనుమంతుడు తారసపడలేదని, అందుకే స్వామి సన్నిధిలో ఆంజనేయుడు లేడని చెబుతారు. రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడి పేరిట హనుమంతుని ఆలయాన్ని బుక్కరాయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది.
భక్త వాసుదాసు
భద్రాచలానికి రామదాసు ఎంతో ఒంటిమిట్టకు వాసుదాసు అంతటి వాడు. ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. 1863లో జమ్మలమడుగులో జన్మించిన ఆయన ఈ జిల్లాలోనే రెవెన్యూశాఖ లోనూ, మద్రాసు ప్రెసిడెన్సీ హైస్కూలులో ఉద్యోగం చేశారు. ఆయన ఎన్నో భక్తికావ్యాలు రచించారు. 1900 ప్రాంతంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనుసరించి సృజనాత్మక రచన చేశారు. దాంతో ఆయనకు ధర్మవరం కృష్ణమాచార్యులు... ‘ఆంధ్రవాల్మీకి’ అనే బిరుదును ప్రదానం చేశారు. వావిలికొలను వారికి ఓ రోజున çకలలో ఓ వ్యక్తి కనిపించి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తోచింది. నాటినుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడే ఆయనకు ఆరాధ్యదైవమయ్యాడు. తన ఆస్తిపాస్తులన్నీ ఆ రాముడికే సమర్పించారు. అంతేగాక కౌపీనం (గోచి) పెట్టుకుని టెంకాయ చిప్ప చేతబట్టి ఊరూరా తిరిపమెత్తి ఆ మొత్తాన్ని సైతం రాముడికే సమర్పించాడు. రామాలయానికి మడి మాన్యాలను ఏర్పాటు చేశారు. విలువైన ఆభరణాలను సమర్పించుకున్నాడు. జీవితాంతం ఒంటిమిట్ట రామయ్య సేవలోనే తరించాడు.
ఇలా చేరుకోవచ్చు
ఒంటిమిట్ట... కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాల్లో వచ్చే భక్తులు రేణిగుంట విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గాన రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా 110 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఒంటిమిట్ట చేరుకోవచ్చు. రైలులో వచ్చే భక్తులు కడప లేదా రాజంపేటలో బస చేసేలా ప్రణాళిక చేసుకోవడం శ్రేయస్కరం. కడప, రాజంపేటలకు హైదరాబాద్, చెన్నై నుంచి రైలు సౌకర్యం ఉంది. సీతమ్మవాగు... సీతారామలక్ష్మణులు మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి సుందరవనాలను చూసి అమ్మవారు సంతోషపడి లక్ష్ష్మణుడితో ‘అంతా బాగుంది కానీ నీరు లేదు, అలాగే పూజ చేసుకునేందుకు పసుపు, కుంకుమ కావాలి’ అందిట. అప్పుడు లక్ష్మణుడు ఒక కొండపైన 70 అడుగుల నల్లటి బండను చూసి, బాణం సంధిస్తే అది పగిలి పసుపు కుంకుమ రాళ్లు కలిసిన నీళ్లు ధారగా వచ్చాయట. అదే సీతమ్మవాగుగా ప్రసిద్ధి చెందింది. పర్ణశాల... భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. వనవాస సమయంలో సీతారాములు ఇక్కడే పర్ణశాల ఏర్పాటుచేసుకొని ఉన్నారట. అప్పుడు జరిగిన సంఘటనలను శిల్పాలుగా చెక్కి... సన్నివేశాలు కళ్ల ముందు మెదిలేటట్లు చేశారు.
ఇలా చేరుకోవచ్చు!
భద్రాచలానికి హైదరాబాద్ నుంచి వచ్చేవారు సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం మీదుగా చేరుకోవచ్చు ∙ఖమ్మం నుంచి భద్రాచలం 120 కి.మీ. ∙కొత్తగూడెం నుంచి 40 కి.మీ. కొత్తగూడెంలో రైల్వేస్టేషన్ ఉంది ∙రాజమండ్రి నుంచి వచ్చేవారు జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, కుకునూరు నుంచి భద్రాచలం చేరుకోవచ్చు ∙రాజమండ్రి నుంచి 180 కిలోమీటర్లు ∙ భద్రాచలంలో వసతి సదుపాయాలు ఉన్నాయి.
– మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప