
వయసుతో పాటు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతూంటుంది. వృద్ధులకు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు టక్కున వచ్చేందుకు కారణం ఇదే. ఈ సమస్యను అధిగమించేందుకు అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఓ విచిత్రమైన ఫలితాలిచ్చాయి. వ్యాధులకు కారణమవుతాయని మనం ఇప్పటివరకూ భయపడుతూన్న వైరస్‌లలోనే ఒకటి మన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలదని వీరు గుర్తించారు. సైటో మెగలో వైరస్ అని పిలుస్తున్న ఈ వైరస్ సగం మంది మనుషులకు చిన్నప్పుడే సోకుతుంది.
చికిత్స ఏదీ లేకపోవడం వల్ల పెద్దవాళ్లలోనూ కనిపిస్తూంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఈ వైరస్‌తో పోరాడుతూ ఉంటుందని, ఫలితంగా ఇతర వైరస్‌లకు త్వరగా లొంగిపోతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే సైటో మెగలో వైరస్‌ను ఎలుకలకు ఎక్కించి, అదే సమయంలో లిస్టీరియా వైరస్‌ను చేర్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా లిస్టీరియాను ఎదుర్కొందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ స్మితీ తెలిపారు. మరిన్ని పరిశోధనలు చేసి∙చూడగా, సైటో మెగలో వైరస్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.