50పైసల నుంచి రోజుకు 2లక్షల ఆదాయం వరకు! | Patricia Narayan: Single women Went From Selling Tea to Making Lakhs | Sakshi
Sakshi News home page

యాభైపైసవాల్‌

Published Wed, Dec 26 2018 12:48 AM | Last Updated on Wed, Dec 26 2018 10:47 AM

Patricia Narayan:  Single women Went From Selling Tea to Making Lakhs - Sakshi

‘చాలెంజ్‌’ సినిమాలో చిరంజీవిపది పైసలతో జీవితాన్ని స్టార్ట్‌ చేస్తాడు.‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్‌ వన్‌ రుపీతో లైఫ్‌ని ప్రారంభిస్తాడు.సవాల్‌గా తీసుకుంటారు ఇద్దరూ.సక్సెస్‌ అవుతారు. సేమ్‌.. వాళ్ల లాగే పట్రీషా యాభై పైసలతో జీవితాన్ని సవాల్‌గా తీసుకుని సక్సెస్‌ సాధించింది. పద్నాలుగు రెస్టారెంట్‌లతో... రోజుకిప్పుడు రెండు లక్షలు సంపాదిస్తోంది!

పట్రీషా నారాయణ్‌.. చెన్నైలోని ‘సందీపా’ చైన్‌ ఆఫ్‌ రెస్టారెంట్స్‌ యజమాని. ఉండటానికి విలాసవంతమైన అపార్ట్‌మెంట్, అంతే లగ్జూరియస్‌ కారు, రెండువందల పైచిలుకు ఉద్యోగులకు బాస్‌! ఇక 2010 ‘ఫిక్కీ ఉమన్‌ ఎంట్రప్రెన్యూర్‌’ అవార్డీ అన్నది పాత సంగతే. అయితే పట్రీషాకు ఇవన్నీ వారసత్వంతో రాలేదు. ఆమె జీవితం వడ్డించిన విస్తరీ కాదు. అంతా రెక్కల కష్టం. పట్రీషా పుట్టి పెరిగింది చెన్నైలో. తండ్రి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో, తల్లి టెలిఫోన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. పట్రీషాకు ఇద్దరు తోబుట్టువులు. ఆమే తొలి సంతానం. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఉండగా తనకన్నా పదమూడేళ్లు పెద్దవాడైన నారాయణ్‌తో పరిచయమైంది. ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లీ జరిగింది. నిజానికి ఇంటర్‌ అయ్యాక తల్లిదండ్రులతో చెప్పి తమ పెళ్లికి వాళ్ల అంగీకారం తీసుకోవాలనుకుంది పట్రీషా. కాని నారాయణ్‌ వద్దన్నాడు. వెంటనే తనతో వచ్చేయమంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. పట్రీషా ఎంత నచ్చ జెప్పినా వినకపోగా ‘‘నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మీవాళ్లకు అంతా చెప్పేస్తాను’’ అంటూ బెదిరించాడు. భయపడ్డ పట్రీషా ఓ రోజు ఇంట్లో చెప్పేసింది తను పెళ్లి చేసుకుందని. మండిపడ్డ ఆమె తండ్రి పట్రీషాను ఇంట్లోంచి గెంటేశాడు. అన్నానగర్‌లో కాపురం పెట్టారు పట్రీషా, నారాయణ్‌. కలిసి ఉంటున్నకొద్దీ నారాయణ్‌లోని దుర్గుణాలు బయటపడసాగాయి. బద్దకం. పనిచేయడు. పైపెచ్చు మందు, సిగరెట్లు. నచ్చిన వ్యక్తి భర్తగా దొరికాడన్న సంతోషం లేకుండానే దాంపత్యం సాగుతోంది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. నారాయణ్‌లో ఏ మాత్రం మంచి మార్పులేదు సరికదా.. మరింత దిగజారాడు. పట్రీషాను కొట్టడమూ మొదలు పెట్టాడు. వేరే దారి లేక అభిమానం చంపుకొని పుట్టింటికి వెళ్లింది. మొదట తండ్రి మండిపడ్డా.. కూతురి పరిస్థితి చూసి చలించిపోయాడు. ఇద్దరు పిల్లలతో ఉన్న బిడ్డను ఇంట్లోకి రానిచ్చాడు. నారాయణ్‌కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. తలూపింది పట్రీషా. 

పికిల్స్‌ అండ్‌ జామ్స్‌
తల్లి, తండ్రి ప్రభుత్వోద్యోగస్తులు కావడంతో వారికి చేసి పెట్టడానికి చిన్నప్పుడే వంట నేర్చుకుంది పట్రీషా. కుకింగ్‌ అంటే ఆసక్తి కూడా. అందుకే ఖాళీగా కూర్చోకుండా పచ్చళ్లు, జామ్స్‌ తయారు చేసి బాటిళ్లలో పెట్టి తల్లితో ఆమె ఆఫీస్‌కి పంపించడం మొదలుపెట్టింది. అన్నీ అమ్ముడుపోవడమే కాక మూడు రోజులకే మళ్లీ డిమాండ్‌ కూడా వచ్చింది ఇంకా కావాలని. అలా పచ్చళ్లు, జామ్స్‌ తయారు చేసే వ్యాపకాన్ని వ్యాపారంగా మార్చుకుంది పట్రీషా. 

బీచ్‌లో టీ బండి
పట్రీషా తండ్రి స్నేహితుడు ‘డిఫరెంట్లీ ఏబుల్డ్‌’ పీపుల్‌ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. వాళ్లకు ఓ ఉపాధి చూపించాలని టీ, టిఫిన్‌ బళ్లను తెప్పించాడు. పట్రీషా స్థితి తెలుసుకొని తన దగ్గరున్న ఇద్దరికి ఉపాధి ఇప్పిస్తే ఓ బండి ఇస్తానని చెప్పాడు. ఒప్పుకుంది ఆమె. వెంటనే వాళ్లిద్దరికీ టీ, కాఫీ పెట్టడం, వాటిని సర్వ్‌ చేయడం నేర్పింది. బండి తీసుకొని మెరీనా బీచ్‌లో పెట్టుకుంది. మొదటి రోజు కేవలం ఒకే ఒక్క టీ అమ్మగలిగింది. ఆరోజు సంపాదన యాభై పైసలు. నిరాశతో ఇంటికెళ్లింది. వ్యాపారం చేయడం తన వల్ల కాదని తల్లికి చెప్పి ఏడ్చింది. ‘‘ఒక్క టీ అమ్ముడు పోవడాన్ని నువ్వు ఫెయిల్యూర్‌ అనుకుంటున్నావ్‌. అది నేను నీ సక్సెస్‌ అనుకుంటున్నా. జీరోతో రాకుండా యాభై పైసలు సంపాదించావు’’ అంటూ కూతురిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టింది పట్రీషా. తెల్లవారికి సమోసా వంటి స్నాక్స్‌నూ బండీలో పెట్టింది టీ, కాఫీలతోపాటు. ఆశ్చర్యం ఆ రోజు ఆమె సంపాదన ఏడువందల రూపాయలు. ఇలా 1982 నుంచి 2003 వరకు సాగింది. తొలినాళ్లలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకూ ఉండేది. ఆ తర్వాత మెరీనాబీచ్‌లో వాకర్స్‌ కోసం ఉదయం అయిదు గంటలకే ఓపెన్‌ చేసి తొమ్మిదింటి వరకూ బిజీగా ఉండేది. రోజుకి ఏడువందల రూపాయల నుంచి 25 వేలు ఆర్జించే వరకు వెళ్లింది ఆదాయం. బంద్‌ రోజుల్లో కూడా. 

కోలుకోలేని విషాదం
పట్రీషా వంట రుచి ఆ నోటా ఈ నోటా బ్యాంక్‌ ఆఫ్‌ మధుౖరై ఉద్యోగుల దాకా వెళ్లింది. బ్యాంక్‌లో క్యాంటీన్‌ నిర్వహించడానికి ఆమెకు ఆఫర్‌ అందింది. మూడు వందల మందికి వండి వడ్డించాలి. తర్వాత నేషనల్‌ పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లోని ఏడువందల మంది స్టూడెంట్స్‌ కోసం వంట చేసే అవకాశం వచ్చింది. చేసింది. మేనేజ్‌మెంట్‌కు నచ్చింది. ఉండటానికి క్వార్టర్‌ కూడా ఇచ్చారు. అక్కడ ఆమె మొదటి నెల అందుకున్న జీతం ఎనభై వేలు (1998లో). తర్వాత అది కొద్దికాలానికే లక్ష రూపాయలకు చేరింది. కొంతకాలానికే సంగీతా రెస్టారెంట్‌ గ్రూప్‌ ఒక యూనిట్‌లో పార్ట్‌నర్‌షిప్‌ ఆఫర్‌ చేసింది. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లైపోయారు. కూతురు పెళ్లి చేసేసింది. కొడుకు ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సంగీతా రెస్టారెంట్‌లో పార్ట్‌నర్‌షిప్‌ ఆఫర్‌ కన్నా సొంతంగా రెస్టారెంట్‌ స్టార్ట్‌ చేద్దామనే ఆలోచనను తల్లి ముందు పెట్టాడు ప్రవీణ్‌. పట్రీషాకూ సబబే అనిపించింది. ఆ ఏర్పాట్లలో ఉండగా కుటుంబం కుప్పకూలే సంఘటన! కూతురు, అల్లుడు కారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. పట్రీషా చాన్నాళ్ల దాకా మనిషి కాలేకపోయింది. రెస్టారెంట్‌ పనంతా ప్రవీణే చూసుకున్నాడు. ఎట్టకేలకు 2006లో ‘సందీపా’ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అప్పటికీ పట్రీషా ఇంకా షాక్‌లోనే ఉంది. అందుకే మొత్తం బాధ్యతలు తీసుకోకుండా.. కొడుకుకి సహాయంగా మాత్రమే ఉంది కొన్నాళ్ల దాకా. కూతురు, అల్లుడు చనిపోయినప్పుడు డెడ్‌బాడీస్‌ తీసుకురావడానికి ఒక్క అంబులెన్సూ ముందుకు రాలేదు. చనిపోయిన వార్త కన్నా అంబులెన్స్‌ బాధ్యతా రాహిత్యం ఆమెను ఎక్కువ కలచివేసింది. అందుకే రెస్టారెంట్‌ పెట్టిన కొన్నాళ్లకు ఓ అంబులెన్స్‌ను కొని రోడ్‌ యాక్సిడెంట్‌ బాధితులను ఆసుపత్రికి చేర్చే సేవనూ అందిస్తోంది పట్రీషా. 

ఈ ముప్పైఏళ్లలో..!
‘‘ఆత్మవిశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. ఎదురు దెబ్బలే గమ్యానికి వారధి కడ్తాయి. గ్రహిస్తే గమ్యం చేరుకుని విజయం సాధిస్తాం’’ అంటుంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో ఆమె నేర్చుకున్న సత్యం ఇదే. ఆమె ఫిలాసఫీ ఇదే. చెన్నైలో పట్రీషాకు ఇప్పుడు 14 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ‘‘యాభై పైసల సంపాదన నుంచి రోజుకి రెండు లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ఇది నా ఒక్కదాని కష్టం కాదు. నన్ను నమ్మి నాతోపాటు నడిచినవాళ్లందరి శ్రమ ఫలితం. కలెక్టివ్‌ విక్టరీ’’ అంటుంది పట్రీషా. 
– శరాది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement