పతంగులు... పర్సనాలిటీ డెవలప్‌మెంట్!
హ్యూమర్ ప్లస్
పతంగులను ఎగరేయడానికి మించిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పాఠాలు లేవు. ‘గాలిపటాలు - వ్యక్తిత్వ వికాసం’ అనే అంశమ్మీద గాలీపులాక న్యాయంగా ఒక పరిశీలన చేద్దాం. దాన్ని ఎగరేసేవాడు ఎంతో ఓపికనూ, ఒడుపునూ అభ్యసించాలి. చెట్టుకు గాలిపటం చిక్కుకుంటే... దాన్ని మళ్లీ జేజిక్కించుకోడానికి మనం దారంతో చేసే విన్యాసాలన్నీ... భవిష్యత్తులో ఏదైనా అంశం మీద చేయాల్సిన చర్చల గురించి చెబుతాయి. బేరసారాలు నెరపడానికి కావాల్సిన కౌశలాన్ని నేర్పుతాయి. ఇక చేతికి రాదని తెలిశాక... వీలైనంత తక్కువ దారాన్ని నష్టపోతూ విషయాన్ని ‘తెగగొట్టడం’ ఎలాగో తెల్పుతాయి గాలిపటాలు.
గాలిపటాలతో లడాయి పెట్టడాన్ని ‘పేచీ’ అంటారన్నది చాలామందికి తెలిసిందే. దాంట్లో ఎన్నో వ్యూహాలుంటాయి. ఉదాహరణకు లడాయి తప్పనప్పుడు పటాన్ని పైనుంచి వచ్చేలా చేసి... దారాన్ని ధారాళంగా వదలడాన్ని ఢీల్ వదలడం అంటారు. కింది వైపు నుంచి దారాన్ని తీసుకొని దారాన్ని వేగంగా లాగడాన్ని ఖీంచ్‌కాట్ అంటారు. మనం ఏదైనా విషయాన్ని తేలిగ్గా వదిలేయాలా అన్నది ‘ఢీల్’ వ్యూహం. పట్టు పట్టి కట్ చేయాలా అన్నది ఖీంచ్‌కాట్ ఎత్తుగడ. ఈ ప్రణాళికా రచనా పద్ధతులను చిన్నప్పుడే నేర్పేది పతంగుల యుద్ధం. అంటే వ్యూహాలూ, ఎత్తుగడలూ లాంటివన్నీ మనకు గాలితో పెట్టిన విద్య అవుతాయి. గాలిపడగతో లడాయి చేసే ఈ యుద్ధంలో మన ప్రత్యర్థితో తలపడే సమయంలోనే మన చెరఖ్ పట్టుకుని ఉండే తోడు కూడా ఉండాలని పటం పాఠాలు పేర్కొంటాయి.
గెలుపు లక్ష్యాన్ని మనమే ఛేదించాల్సి ఉన్నా... మన పక్షం వహించేందుకు ఆ తోడు తోడ్పడుతుందన్నది మనం నేర్చుకునే పాఠం. ఈ తోడు జీవిత భాగస్వామి కూడా కావచ్చు. చెరఖా పట్టినంత మాత్రాన పక్కవారిని మనకు గొడుగు పట్టే వారిగా చూడకూడదు. మన అడుగులకు మడుగులొత్తేవారుగా పరిగణించకూడదు. హీరో పక్కన ఉండే హీరోయిన్‌లాగానో లేదా హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో హీరోలాగానో లేదా కమెడియన్‌లాగానో తేలికగా చూడకూడదు. జీవితాంతపు తోడు అయితే నరకాసుర యుద్ధంలో సత్యభామ అనుకోవచ్చు. అదే జీవనకురుక్షేత్రంలోనైతే అర్జునుడి పాలిటి నారాయణుడని అనుకోవచ్చు. వాడు ఫ్లూటుకు బదులు చెరఖాను ధరించి ఉంటాడు. పింఛం లేని పామర పార్థసారథిలా అనునిత్యం తోడుంటాడు. పేచీలో ప్రత్యక్షంగా పాలుపంచుకోకుండా సలహాలిస్తుంటాడు. యుద్ధం గెలవడంలో తోడ్పడుతుంటాడు. జీవన భాగస్వామిని లేదా మిత్రులనూ మన సాన్నిహిత సహచరులనుకుంటే... వాళ్లు మన గెలుపు వాళ్ల గెలుపులా ఫీలవుతుంటారు. మన విజయాన్నీ వాళ్లూ ఓన్ చేసుకుంటారు. అదే గనక జరగకపోతే పతంగులు ఎరగేసేవాడే ‘కటీ పతంగ్’ అవుతాడు. అనగా తెగిన గాలిపటమై, తూలుతూ కిందికి పడిపోతాడు.
ఇక కోటికి పడగెత్తడం అనే మాట ఎలాగూ ఉంది. కోటి సంపాదించలేకపోతే గాలిపడగ ఎగరేస్తే గాలికి పడగెత్తినట్లే కదా. ఇలా ఆలోచిస్తూ సంపదలు సమకూర్చుకోకపోయినా పర్లేదు. కేవలం గాలిపటాలు ఎగరేస్తే చాలు. ఈ జీవనసారం అంతా నింగియే హద్దుగా ఎగిరే గాలిపటం చేస్తున్న హితబోధ! ఆకాశంలోంచి చెరఖా వరకు కనిపించే దారపు ‘గీత’ బోధ!!
- యాసీన్