ఫెస్ట్స్ వెబ్‌సైట్ రూపొందించారు... | Phests designed website ... | Sakshi
Sakshi News home page

ఫెస్ట్స్ వెబ్‌సైట్ రూపొందించారు...

Published Mon, Dec 30 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

ఫెస్ట్స్ వెబ్‌సైట్ రూపొందించారు...

ఫెస్ట్స్ వెబ్‌సైట్ రూపొందించారు...

కాలేజీ అంటేనే ఒక కొత్త ప్రపంచం. విజ్ఞానమే అక్కడి మతం, సంప్రదాయం. మన సంప్రదాయాలని నిలబెట్టేవి మనం జరుపుకునే పండుగలు. మరి కాలేజీ సంప్రదాయాల గురించి ప్రచారం చేసేవి... కల్చరల్ ఫెస్ట్‌లు, టెక్‌ఫెస్ట్‌లే. మామూలు పండుగలు ఎప్పుడు జరుపుకోవాలో చెప్పడానికి పంచాంగాలున్నాయి. కాని కొన్ని వేల కళాశాలలు... అన్ని వేల పండుగలు. వీటికి పంచాంగం రూపొందించేది ఎవరు? అంటే, ‘మేము చేస్తాము’ అనుకున్నారు హరీష్ కొట్రా, కల్యాణ్ వీరమల్ల. అనుకున్నదే తడవుగా రూపొందించిందే fests.info.
 
 acumen, carpedium, vidyut ఇలాంటి ఫెస్ట్ పేర్లను వినడమే కాని, సగటు విద్యార్థికి అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో అంత ఐడియా ఉండదు. అలాంటి ఇద్దరు సగటు విద్యార్థుల ఆలోచన నుండి పుట్టింది fests.info. వివిధ కళాశాలల్లో జరిగే ఈ ఫెస్ట్‌లలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నా, అంత క్లారిటీ లేక వెనుకంజ వేశారు హరీష్, కల్యాణ్. ఆ వెనుకంజలో పుట్టిన ఆలోచనే ఈ ఫెస్ట్‌ల గురించి చెప్పే వెబ్‌సైట్. ‘‘హైదరాబాద్‌లోనే కాదు, మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో జరిగే ఫెస్ట్స్ గురించి చెప్పే ఒక వెబ్‌సైట్ రూపొందిస్తే ఎలా ఉంటుంది’’ అని ఐడియా ఇచ్చాడు కల్యాణ్. స్వతహాగా వెబ్ డిజైనర్ అయిన హరీష్ వెంటనే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. ఇలా మే 2012లో కలిగిన ఆ ఐడియా, జూన్ 21, 2012 కి మన రాష్ట్రంలోని ప్రసిద్ధ కాలేజీలలో జరిగే ఫెస్ట్స్‌తో వెబ్‌సైట్‌గా రూపొందింది. అలా 2012లో ఫెస్ట్స్‌కి సంబంధించిన అతి కొద్ది వెబ్‌సైట్‌లలో ఒకటిగా ఉన్న ఈ సైటు, ఒకటిన్నర ఏళ్లలోనే దేశవ్యాప్తంగా పేరు సాధించింది.
 
 ‘‘ఒక విద్యార్థి కాలేజీలో ఎంతో నేర్చుకుంటాడు. కాని ఆ నేర్చుకున్న దానిని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పేవి ఫెస్ట్స్ మాత్రమే. రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి సబ్జెక్ట్‌లలోని ప్రాక్టికల్ అప్రోచ్‌ని వినోదంతో కలిపి ఒక వేదికపై నిలపడమే టెక్ ఫెస్ట్‌ల ముఖ్య ఉద్దేశ్యం. అలానే ప్రతి విద్యార్థిలోను దాగి ఉన్న కళలను బయటకు తీసుకురావడం కల్చరల్ ఫెస్ట్ వంతు. ఏం చేసినా ఈ ఇంజనీరింగ్‌లోనే చెయ్యాలి. తర్వాత ఉద్యోగం వచ్చాక ఇలాంటి వాటిలో పాల్గొనే అవకాశం తక్కువ. అందుకే ఈ ఫెస్ట్‌ల మీద మేము అంత ఆసక్తి చూపించి, దానికోసం ఒక వెబ్‌సైట్‌ని రూపొందించింది’’ అంటాడు హరీష్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో కేవలం కళాశాలలో జరిగే ఫెస్ట్‌ల గురించి కాక, ముఖ్యపట్టణాల్లో జరిగే మ్యూజికల్ నైట్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, చారిటీ షోస్, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్స్‌లకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరుస్తున్నారు.
 
 ‘‘మా వెబ్‌సైట్‌లో అనవసర యాడ్స్ ఉండవు. మొబైల్‌లో నుండి కూడా చాలా సులువుగా యాక్సెస్‌ని పొందవచ్చు. ఇవే మమ్మల్ని వేరే వెబ్‌సైట్స్ నుంచి వేరు చేసే గుణాలు. మా వెబ్‌సైట్‌లో ఎవరైనా వాళ్ల ఫెస్ట్స్‌కి సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవచ్చు. మేము మాకు వచ్చే ప్రతి వివరాన్నీ చెక్ చేసి వందశాతం నిజమని నిర్ధారించాకే మా వెబ్‌సైట్‌లో ఆ ఫెస్ట్‌కు సంబంధించిన వివరాల్ని పొందుపరుస్తాం...’’ అంటారు కల్యాణ్. ఇంతకీ దీని ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో అనుకుంటున్నారా! సున్నా రూపాయలు. అవును, వీరు ఆ ఫెస్ట్స్‌కి ప్రచారాన్ని కల్పించిన వాళ్ల దగ్గర చిల్లిగవ్వ కూడా తీసుకోరు. పైగా ఈ వెబ్‌సైట్‌ని నడపడానికి అయ్యే ఖర్చుని తమ సొంత డబ్బులతో నెట్టుకొస్తున్నారు. ఎందుకిలా అని అడిగితే, ‘‘మేము ఏదో బిజినెస్ చేద్దాం అని వెబ్‌సైట్ చెయ్యలేదు, మా స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక సర్వీస్‌లా చేస్తున్నాం. మేము ఆశించేది కాస్తంత ప్రేమ, పేరు... అంతే’’ అని నవ్వేస్తారు ఇద్దరూ. కల్యాణ్ ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నాడు. హరీష్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. రోజంతా వీళ్లు పనిలో ఉన్నా, ప్రతిరోజూ ఈ వెబ్‌సైట్ బాగోగులని తప్పక చూసుకుంటారు.
 
 - శ శ్రీక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement