
మత్తులో మమేకమై...
చదివింత...
‘‘ఆహా ఏమి రుచి... తాగమా మైమరచి’’ అంటూ లొట్టలేసిన మేకలు... ‘‘సేవించితిమి అమృతము...ఇక మత్తులోన జోగెదము’’ అంటూ నిద్రలోకి జారిపోయాయి. అహ్మదాబాద్, మెహసానా జిల్లాలో ఉన్న ఖేరాలు పట్టణంలో నివసించే రమేష్ పాట్ని పశువుల కాపరి. తన మేకల్ని మేపేందుకని ఖాళీ స్థలంలో వాటిని వదిలేశాడు. తిరిగి వచ్చి చూసుకుంటే... సదరు మేకలన్నీ అక్కడే పడి నిద్రపోతూ కనిపించాయి. ఎంత లేపినా లేవని వాటి దగ్గర గుప్పుమంటూ మద్యం వాసన! బెంబేలెత్తిన రమేష్.. మేకలకి మందు తాగించి ఎవరో ఏదో చేయబోయారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఇంతా చేస్తే... సదరు ఘనకార్యం పోలీసులదేనని తేలింది. స్థానికంగా రైడ్స్‌లో పట్టుకున్న మద్యం సీసాలను అక్కడకు తెచ్చి పడేసిన పోలీసులు రోడ్డురోలరుతో వాటిని ద్వంసం చేశారు, అక్కడక్కడా ధ్వంసం కాకుండా మిగిలిన, పగిలిన సీసాలలోని మందును మేకలు శుభ్రంగా హాంఫట్ అనిపించాయి. ‘‘ఆ మద్యం వాటికి రుచిగా అనిపించినట్లుంది. అందుకే అలా చేశాయేమో’’ అంటున్నాడు రమేష్. దాదాపు రోజంతా అలాగే బజ్జున్న మేకల కోసం... ‘‘మీ మంద ఎక్కువైనా ఈ మజ్జిగ పలచనయ్యేనా’’ అంటూ మత్తుకి విరుగుడుగా బటర్‌మిల్క్ తాగిస్తూ మేల్కొలుపుతున్నాడట రమేష్.
సత్యవర్షి