‘నాలుక’ను జయించి | Professor Satyavathi Special Story On Gandhi Jayanti | Sakshi
Sakshi News home page

‘నాలుక’ను జయించి

Published Wed, Oct 2 2019 4:39 AM | Last Updated on Wed, Oct 2 2019 4:39 AM

Professor Satyavathi Special Story On Gandhi Jayanti - Sakshi

’పారిస్‌లోని ఐఫిల్‌టవర్‌ను గాంధీజీ సందర్శించారు. కానీ ఆయనకు నచ్చలేదు. అందులో శిల్పం లేదనీ, కేవలం సంతలో ప్రదర్శన కోసం పెట్టబడిన బొమ్మ అనీ అన్నారు.

మహాత్మాగాంధీ ఆహారం గురించి కూడా చాలా రకాలు పరిశోధనలు చేశారు. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? దాన్ని ఎట్లా ప్రాసెస్‌ చేస్తున్నారు? ఎంత తింటున్నారు? ఎలా తింటున్నారు? అనే అంశాలపై దృష్టిపెట్టారు. ఉదాహరణకు బెల్లం మంచిదా, పంచదార మంచిదా అని ఆలోచించినప్పుడు ఆయనకు ఏమనిపించిందంటే.. బెల్లం తయారీ గ్రామస్తుల చేతుల్లో ఉంటుంది. పంచదార పూర్తిగా పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు గ్రామస్తులకు వాళ్ల ఆదాయం మీద, వాళ్ల పంట మీద నియంత్రణ లేకుండా పోతుంది. బెల్లం తినటం వల్ల పౌష్టికాంశాలు అందుతాయి. పంచదారతో అలాంటి అవకాశం లేదు. పైగా మళ్లీ మళ్లీ తినాలని అని పించేలా చేసే లక్షణం పంచదారకు ఉంది. కాబట్టి, పంచదార కన్నా బెల్లం తినటమే మంచిది. కావాలంటే పోషకాహార నిపుణులను అడిగి నిర్ధారించుకోండని తన ప్రసంగాల్లో, వ్యాసాల్లో గాంధీజీ చెబుతూ వచ్చారు. 

అట్లాగే నెయ్యికి, వనస్పతికి మధ్య జరిగిన చర్చలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏమిటంటే మనిషి ఒక జంతువును ఎప్పటికీ తన అవసరాల కోసమే పీడించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి, పశువు పాలను, ఆ పాల నుంచి తీసే నెయ్యి వాడకాన్ని తగ్గించుకోవాలన్నాడు. ఇక నెయ్యినే వద్దంటే దానిలా కనబడేలా తయారు చేసినది కాబట్టి వనస్పతి కూడా వద్దన్నాడు. వనస్పతి అనేది ప్రకృతిలో లేదు. ఇది తీసుకోవడం ఏ రకంగా కూడా మంచిది కాదని వ్యతిరేకించాడు. ఇక పాలపై ఆయనకు మొదటి నుంచీ వ్యతిరేకమే. జంతువు నుంచి తీసిన ఉత్పత్తి కాబట్టి వద్దన్నాడు. ప్రకృతి వైద్యాన్ని పాటించినప్పుడు ఆవు పాలు తీసుకోవడం సరికాదని మానుకున్నాడు. అయితే, ఆయనకు అనారోగ్యంతో బరువు తగ్గిపోయినప్పుడు వైద్యులు జంతువుల ప్రొటీన్లు తీసుకోవాలన్నారు. తాను వద్దనుకున్నది ఆవు పాలు కాబట్టి, మేక పాల గురించి లోతుగా ఆలోచించారు. రుచికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నమాట. పైగా, మారుమూల గ్రామీణులకు కూడా అందుబాటులో ఉంటుందన్న దృష్టితో కూడా మేక పాలను డాక్టర్ల సూచన మేరకు తీసుకున్నాడు. టీ, కాఫీలు ఏవీ అవసరం లేదు.

వాటిని అలవాటు చేసుకుంటే వాటి చుట్టూ ఇంకా కొన్ని కోరి కలు పుట్టుకొస్తాయి కాబట్టి వద్దన్నాడు. కాసేపటికి ఏదో ఒకటి నములుతూ ఉండే పట్టణవాసుల అలవాటును కూడా ఆయన నిరసించాడు. తిండి విషయానికొచ్చే సరికి కాస్త తక్కువ తినడమే మంచిది అని మహాత్మా గాంధీ సూత్రీకరించాడు.  నాగరికత పెరుగుతున్నకొద్దీ ఎప్పుడూ ఆహారాన్ని అందుబాటులో ఉంచుకునే వ్యవస్థను తయారు చేసుకున్నాం. ఇక ఎప్పుడూ ఆహారం ఎదురుగా ఉంటుంది కాబట్టి అవసరాలకు మించే తింటున్నామన్నది గాంధీ గారు గమనించారు. అందుకని నాలుకను మనం జయించాలి అని ఆయన సూత్రీకరించాడు. ప్రకృతిలో జీవులన్నీ అవసరం కోసమే తింటాయి. మనిషి మాత్రమే నాలుక కోసం తింటున్నాడు. మనం తింటున్నది బతకడం కోసం మాత్రమే. తినటం కోసం బతకొద్దు అని చెప్పాడు. కాబట్టి, నాలుకను మనం జయించాలి. పాలిష్‌ బియ్యాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు.

మన ధాన్యాన్ని మనం దంచుకొని తినటం మంచిదని ఆయన అభిప్రాయం. దంపుడు బియ్యం తయారు చేసుకోవడం అనేది గ్రామీణుల వ్యాపకం. ఈ వ్యాపకం మిల్లర్ల చెప్పుచేతల్లోకి పోతుందని, తెల్లబియ్యాన్ని ఎరగా చూపి మిల్లర్లు మనల్ని ఆకర్షిస్తారని ఆయన తెలిపారు. ఆ విధంగా పూర్తిగా నిర్జీవమైన తెల్ల బియ్యానికి అలవాటుపడుతున్నామని 1940వ దశకంలోనే హెచ్చరించాడు. దంపుడు బియ్యమే తినాలని సూచించాడు. అట్లాగే, వీలైనన్ని పండ్లు, పచ్చి ఆకుకూరలు తినమని గాంధీజీ చెప్పాడు. అంటే, ఉడికించని ఆహారం ఆరోగ్యదాయకమని ఆయన చెప్పాడు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవటంలో మహిళల చాకిరీని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావించాడు. ఇంటి పనుల్లో పురుషులు కూడా మహిళలకు తోడ్పడాలని సూచించాడు. రోజుకు ఒకటి లేదా రెండు నిమ్మకాయలు తీసుకోమన్నాడు. శరీరంలో కలుషితాల క్లీనింగ్‌కు విటమిన్‌ సిని ఇవ్వటం ద్వారా ఉపయోగపడుతుందని చెప్పాడు. నిమ్మకాయ దొరకని సందర్భాల్లో చింతపండు వాడుకోమని చెప్పాడు.

శాకా ‘హారం’
ప్రొటీన్‌ కోసం మాంసం తింటున్న వాళ్లు పప్పులు తినకుండా ఉండొచ్చు కదా అనేవాడు. అందరికీ కావాలి్సనటువంటి ప్రా«థమిక ఆహారం అందుబాటులో ఉండాలంటే దాని అవసరం లేని వారు త్యాగం చేయాలి కదా అనేవాడు. ఆయన దేని గురించి ఆలోచించినా గ్రామాల్లో ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉంటుందా లేదా అని ఆలోచించేవాడు.ఆయన రోజూ ఉదయపు అల్పాహారంలో 10–12 వేరుశనగ గింజలు తినేవాడు. ఒక రోజు ప్లేటులో అంతకన్నా నాలుగు గింజలు ఎక్కువ పెడితే.. వద్దు అని గాంధీ గారు తిరస్కరించారు. ‘నేను ఎక్కువ తింటున్నాను అంటే ఇంకెవరికో తక్కువ అవుతుంద’ని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌తో అన్నాడు. ఆహారానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు చేశాడు. ‘డైట్‌ అండ్‌ డైట్‌ రిఫార్మ్స్‌’పుస్తకంలో ఇటువంటి అనేక విషయాలు రాశారాయన.

ఈ ఆహార నియమాలు ఎవరికి వాళ్లు ఆచరించి చూసిన తర్వాతే ఇతరులకు చెప్పండి అని చెబుతాడన్నమాట ఆయన. ఇవి చేయడం పెద్ద కష్టం కాదు. సులువు. మన చేతుల్లో ఉన్నది. ఎటొచ్చీ ఏమిటంటే వీటన్నిటినీ పాటించడానికి తగినంతటి మానసిక శక్తి ఉందా? అన్నది ప్రశ్న. అసలు ఆ ముడి సరుకే కష్టమవుతున్నది. మన పరిస్థితుల్లో ఎంత మార్పొచ్చిందంటే.. వేటి పట్లా మనకు కంట్రోల్‌ లేదనే ఫీలింగే ఉంది. అయ్యో ఇది లేకపోతే ఎట్లా.. అది లేకపోతే ఎట్లా.. దేన్నీ వదులుకోవడానికి మనం సిద్ధంగా లేం. అన్నీ ఉన్నతర్వాత తినకపోతే అది ఉపవాసం. లేకపోతే తినకపోతే అది కరువు. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటే గాంధీ బాగా అర్థమవుతాడు.
 ప్రొఫెసర్‌ (డా.) కె. సత్యలక్ష్మి, డైరెక్టర్,
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి, పుణే, మహారాష్
ట్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement