
చిన్నికృష్ణుని చేతిలో ఎప్పుడూ వెన్నముద్ద ఉంటుంది. అందుకే ‘చేత వెన్నముద్ద’ అనే మాటతో ఆయన వర్ణన మొదలౌతుంది. శ్రీకృష్ణుని చేతిలో ఉన్నట్లే.. పుష్ప చేతిలోనూ ఎప్పుడూ వెన్న ఉంటుంది. అయితే అది వెన్నముద్ద కాదు. వెన్న లాంటి మనసు!
ఆమె పేరు పుష్ప, వయసు 31. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆమె ఏటా యాభై నుంచి అరవై పరీక్షలు రాస్తుంటుంది. గడచిన పన్నెండేళ్లుగా ఇదే వరుస. ఆమె ఇన్నిన్ని పరీక్షలు రాస్తున్నది తన కెరీర్ కోసం కాదు. ఇంకా పెద్ద జీతం కోసం పెద్ద కంపెనీలో ఉద్యోగం ఆశించి కూడా కాదు. పరీక్షలు రాయలేని పిల్లల కోసం రాస్తోందామె. ఇప్పటికి ఏడు వందలకు పైగా పరీక్షలు రాసింది. ఏడాదికి యాభై నుంచి అరవై అంటే నెలకు సరాసరిన నాలుగు లేదా ఐదు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
పరీక్షకు మూడున్నర గంటలు, పరీక్ష కేంద్రానికి ప్రయాణం చేసే టైమ్ అంతా కలుపుకుంటే ఆ రోజు ఆరేడు గంటలకు పైగానే కేటాయించాలి. పరీక్షల టైమ్ ఆఫీస్ టైమ్ ఒకే టైమ్‌లో ఉంటాయి. ఆమె స్వచ్ఛందంగా చేస్తున్న సేవను గుర్తించిన కంపెనీ పుష్పకు ఆ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. పరీక్ష రాయాల్సిన రోజు, పరీక్ష పూర్తయిన తర్వాత ఆఫీసుకు వెళ్లగలిగినట్లు షిఫ్ట్ మార్చుకోవడానికి అనుమతించింది. పుష్ప నిస్వార్థమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది.
పరీక్షకు రానివ్వని రోజు
‘‘అప్పుడు ఏడవ తరగతిలో ఉన్నాను. క్లాసులో మిగిలిన వాళ్లంతా పరీక్షకు సిద్ధమవుతున్నారు. నన్ను మాత్రం పరీక్ష రాయడానికి వీల్లేదన్నారు. మా అమ్మానాన్న స్కూలు ఫీజు కట్టని కారణంగా నన్ను పరీక్ష రాయవద్దని చెప్పేశారు టీచర్లు. నా జీవితంలో అత్యంత దుర్దినం అది. ఆ రోజు మా పొరుగింటి వాళ్లు ఫీజు కట్టి ఆ గండాన్ని గట్టెక్కించారు. మరో నాలుగేళ్లకు పియుసిలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి. అప్పుడు ఒక పోలియో వ్యాధిగ్రస్థుడు ఆర్థిక సహాయం చేయడంతో ఆ కష్టం నుంచి బయటపడ్డాను. సమాజం నుంచి తీసుకున్నాను, సమాజానికి తిరిగి ఇవ్వాలి. నేను చేయగలిగింది చేయాలని మాత్రమే అనుకున్నానప్పుడు.
ఇలా పరీక్షలు రాయాలనే నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి ఎన్‌జీవో నడుపుతున్న మా ఫ్రెండ్ విజువల్లీ చాలెంజ్‌డ్ స్టూడెంట్‌కి పరీక్ష రాస్తావా అని అడగడంతో 2007లో పరీక్ష రాశాను. అప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ, విజువల్లీ చాలెంజ్‌డ్, ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్లకు స్క్రైబ్‌గా (పరీక్ష రాయలేని వాళ్లకు, వాళ్లు చెప్తుంటే పరీక్ష రాసి పెట్టడం) చేస్తున్నాను. ఎక్కువగా టెన్త్‌క్లాస్ వాళ్లకు స్క్రైబ్‌గా ఉన్నాను. చాలా ప్రశ్నలకు ఆన్సర్‌లు కంఠతా వచ్చేశాయి. స్టూడెంట్స్ సమాధానం చెప్పడంలో మధ్యలో తడుముకుంటున్నా సరే నాకు సమాధానం సాగిపోతుంటుంది. నిత్య విద్యార్థిని కదా మరి’’ అన్నారు పుష్ప సంతృప్తిగా నవ్వుతూ.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment