పద్ధతి గల మహిళలు | Puma Company Is Giving New Lessons To Girls On Instagram By Four Celebrities | Sakshi
Sakshi News home page

పద్ధతి గల మహిళలు

Published Fri, Oct 18 2019 1:55 AM | Last Updated on Fri, Oct 18 2019 1:55 AM

Puma Company Is Giving New Lessons To Girls On Instagram By Four Celebrities - Sakshi

‘అమ్మాయిలూ.. మీరెలా ఉంటే అదే పద్ధతి. మీరెలా ఉండాలనుకుంటే అదే పద్ధతి’ అంటూ ‘రూల్స్‌ని బ్రేక్‌ చేయడం ఎలా?’ అని ప్యూమా కంపెనీ.. నలుగురు సెలబ్రిటీల చేత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అమ్మాయిలకు కొత్త పాఠాలు చెప్పిస్తోంది. అవి వినే పాఠాలు కాదు! కలిసి ఆడే పాటలు, కలిసి పాడే ఆటలు!

స్త్రీలు అలా ఉండాలని, ఇలా ఉండాలని వాళ్లు పుట్టినప్పట్నుంచీ సమాజం స్టిక్‌ పట్టుకుని పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మేథ్స్, ఫిజిక్స్‌లా.. ఒద్దిక, అణుకువ అనేవి అమ్మాయిలకు సమాజం టీచ్‌ చేసే ముఖ్యమైన సబ్జెక్టులు! ఆ సబ్జెక్టుల్లో పాస్‌ అయితేనే చివరికి వారికి ‘ప్రాపర్‌ లేడీ’ అనే ప్రశంసాపత్రం వస్తుంది. ఆ పత్రం ఉంటేనే అమ్మాయి అమ్మాయిగా పెరిగినట్లు. ‘ప్రాపర్‌ లేడీ’ అంటే పద్ధతిగా పెరిగిన పిల్ల అని!
అయితే ఇప్పుడు ‘ఫ్యూమా’ అనే అంతర్జాతీయ స్పోర్ట్స్‌ కంపెనీ ‘పద్ధతిగా లేకపోవడమే పద్ధతి’ అనే ఒక వీడియో క్యాంపెయిన్‌ మొదలు పెట్టింది! ‘ఎప్పుడూ ఎంపవర్‌మెంట్‌ని సాధించే పనేనా? సాధించిన ఎంపవర్‌మెంట్‌ని వేడుక చేసుకునేది ఎప్పుడు?’.. అని సారా అలీ ఖాన్, మేరీ కోమ్, అంజలీ లామా, ద్యుతీ చంద్‌ ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతారు.

మీ చెయ్యి పట్టుకుని వాళ్లలోకి మిమ్మల్ని లాగేసుకుంటారు. సారా అలీఖాన్‌ బాలీవుడ్‌ వర్ధమాన నటి. మేరీ కోమ్‌ ఇండియన్‌ ఒలింపిక్స్‌ బాక్సర్‌. ద్యుతీ చంద్‌ ఇంటర్నేషనల్‌ అథ్లెట్, అంజలీ లామా ట్రాన్స్‌జెండర్‌ మోడల్‌. వీళ్లంతా స్టార్స్‌ కదా! పద్ధతిగా పెరగకపోతే, పద్ధతిగా ప్రాక్టీస్‌ చెయ్యకపోతే ఇంతవరకూ వస్తారా అనేదే మీ సందేహమైతే ఆ సందేహాన్ని తుడిచిపెట్టేయండి. వాళ్లు వాళ్లలాగే ఉంటూ.. ఇంత పైకి వచ్చారు. ‘వాళ్లలాగే అంటే..?’ అని ఇంకో డౌటా! ఒరిజినల్‌గా వీళ్లేమిటో ప్యూమా కంపెనీ తయారు చేయించిన ‘మీట్‌ ద ప్రాపర్‌ లేడీ’ వీడియో చూడండి.

ఒక్కొక్కరిలో ఒక్కో పోకిరి పిల్ల్ల, కుండల్ని బద్దలు కొట్టే పిల్ల, ఎవరేమనుకుంటే నాకేంటి అనే పిల్ల, నీ గేమ్‌ నీ లైఫ్‌ అనే పిల్ల సాక్షాత్కరిస్తుంది. కుర్చీలో ‘అదోలా’ కూర్చుంటుంది ద్యుతీచంద్‌. నోటినిండా బబుల్‌గమ్‌ ఊదుతూ ఇంత కళ్లేసుకుని చూస్తుంది సారా అలీఖాన్‌. ‘ఉంటే జిమ్‌లో ఉండు.. లేదంటే స్ట్రీట్‌ ఫైట్‌లో ఉండు’ అంటుంది రింగ్‌లో జారి గిలబడి ఉన్న మేరీకోమ్‌. ‘నాకు ఇష్టమైనది తప్ప నాకు ఇంకేదీ వద్దు’ అని తెగే వరకు లాగి చెప్పేస్తుంది అంజలీ లామా! నేడో రేపో ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో కూడా ‘మీట్‌ ద ప్రాపర్‌ లేడీ’ అనే ఈ ప్యూమా కంపెనీ ప్రచారం ప్రారంభం కాబోతోంది. చూడండి. ‘పద్ధతిగా ఉండండి’.

నీ గేమ్‌.. నీ లైఫ్‌..!

సారా అలీఖాన్‌
నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చినట్లు నేనుంటా.

మేరీ కోమ్‌
పంచ్‌ ఇస్తే తప్ప లైఫ్‌ దారికి రాదనుకుంటే పంచ్‌ ఇవ్వాల్సిందే

ద్యుతీ చంద్‌
ఒకటేదైనా అనుకుంటే వదిలిపెట్టకు. నువ్వు అనుకున్నదాని కోసం నిన్ను నువ్వు వదులుకున్నా తప్పేం లేదు.

అంజలీ లామా
నా అన్వేషణ శిఖరంపై ఉన్నప్పుడు నేనెందుకు నేలపై వెదుక్కుంటాను?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement