నా కళ్ల ముందే....
నాకు బైక్‌లు ఇంటే ఇష్టం. వాటిని వేగంగా నడపడం అంటే మరీ ఇష్టం. ఎంత వేగంగా నడిపితే అంత హీరోయిజం అనుకునేవాడిని. ఒకరోజు నేను రోడ్డు మీద రయ్యిమని దూసుకెళుతుంటే నాన్న చూశారు. ఆ రోజంతా క్లాసు తీసుకున్నారు. రెండు రోజుల వరకు బైక్ ఇవ్వలేదు. ఆ తరువాత మళ్లీ మామూలే.
ఇంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం స్లోగా నడిపేవాడిని. పరిసరాలు దాటగానే విపరీతమైన వేగంతో బైక్ నడిపేవాడిని. స్నేహితులు చెప్పినా, పేపర్లో రోజూ యాక్సిడెంట్ వార్తలు చదివినా నాలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండేది కాదు. ఒకరోజు అయితే త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆరోజు మాత్రం భయపడ్డాను. మరుసటి రోజు షరా మామూలే.
దసరా పండక్కి రెండు రోజుల ముందు ఒక పని ఉండి బైక్ మీద వెళుతున్నాను. నా కళ్ల ఎదుటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ కుర్రాడికి ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు. మితిమీరిన వేగంతో నడపడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ దృశ్యం చూసి మనసు వికలమైంది. ఇక ఆ రోజు నుంచి అత్యవసరం అయితే తప్ప బైక్‌ను వాడడం లేదు. ఒకవేళ వాడినా వేగంగా బండి నడపడం లేదు. గతంలో నేను బైక్ మీద వెళుతున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తుండేవాడిని. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినే వాడిని. ఇప్పుడు అలాంటివేమీ చేయడం లేదు. నా కళ్ల ముందు జరిగిన ఒక విషాద సంఘటన నాలోని చెడు అలవాటును తుడిచేసింది.
-కె.అనిల్‌కృష్ణ, హైదరాబాద్