నిర్ణయాలను గౌరవించండి! | Respect the decisions! | Sakshi
Sakshi News home page

నిర్ణయాలను గౌరవించండి!

Published Wed, Mar 12 2014 12:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నిర్ణయాలను గౌరవించండి! - Sakshi

నిర్ణయాలను గౌరవించండి!

 గృహిణి-ఉద్యోగిని.. ఇద్దరికీ చేతినిండా పని ఉంటుంది. గృహిణులు బిజీగా ఉండరనేది పెద్ద అపోహ మాత్రమే. నేను ఇది రాస్తుండగా... నా చిన్నకొడుకు వాడి బొమ్మ కనిపించడం లేదని అరుస్తున్నాడు. మా ఆయనేమో సబ్బు కనబడడం లేదని పిలుస్తున్నారు... నా ఇల్లు నా చుట్టూ భూమి తిరుగుతున్నట్టు తిరుగుతోంది.

 ప్రస్తుతం ఇంట్లో నా ఉద్యోగాల చిట్టా.. వంట మనిషి, వెయిటర్, డాక్టర్. ఇంకా రకరకాల పనులతో బిజీగా ఉంటాను. గృహిణి - ఉద్యోగిని రెండు పాత్రలూ పోషించినదాన్ని కాబట్టి నాకు రెండింటి గురించి పూర్తిగా తెలుసు.

 మా చిన్నాడు పుట్టినపుడు ఆరు నెలలు ప్రసూతి సెలవులు ఇచ్చారు. తర్వాత ఆఫీసుకెళ్లగానే అందరూ రకరకాల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. బోలెడన్ని సలహాలు కూడా ఇచ్చేవారు. వారి ప్రశ్నలు, సందేహాలు, సలహాలు... ఇవన్నీ నా బుర్రలో చేరడంతో బాలింత ఉద్యోగంలో చేరడం తప్పేమో అనుకునేదాన్ని. ‘పసిపిల్లాడితో ఉద్యోగం ఎలా చేస్తున్నావు...?’ అని కనిపించినవారల్లా అడుగుతుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పి ఊరుకునేదాన్ని. కాని మనసులో మాత్రం ఏదో తప్పు చేస్తున్న భావన. ఆ సమయంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది.

కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం మానేశాను. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న ప్రశ్నలు మరింత బాధ పెట్టాయి. ‘అంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుకున్నావు, అంత పెద్ద చదువు వృథా అయిపోయినట్టే కదా! నీ పరిస్థితిలో నన్ను నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేకపోతున్నాను, అసలు నువ్వు ఖాళీగా ఇంట్లో ఎలా కూర్చోగలుగుతున్నావు?... ఇలా అందరూ నా బుర్రను తొలిచేసేవారు. వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు.

 ఒక సందర్భంలో ఉద్యోగినిగా సమాధానాలు చెప్పలేకపోయాను. మరో సందర్భంలో గృహిణిగా సమాధానాలు చెప్పలేకపోయాను. భారతదేశంలో ఒక మహిళని ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూనే ఉంటారని అర్థమైంది. పెళ్లి తర్వాత పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎలా పెంచాలి... అన్నింటిలో మరొకరి పెత్తనం ఉంటుంది. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకుంటే పొగరుబోతు అని ముద్ర వేస్తారు. ఇంట్లో అందరూ చదువుకున్నవారే అయినా ఆ ఇంటి మహిళ ఉద్యోగం విషయంలో సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండదు. ఉద్యోగం చేయడం ఇష్టం లేని మహిళలు కూడా ఉద్యోగం చేస్తుంటారు జీతం కోసం.
 

చాలామంది తల్లులు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండడం వల్ల ఎంతో నష్టపోతున్నట్టు భావిస్తారు. అన్నీ వచ్చినా... ఏం చేయలేపోతున్నామనే భావన వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంది. అలాగే ఉద్యోగం చేసే మహిళలు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సమయమంతా ఆఫీసుల్లోనే గడిచిపోతోందని, ఇల్లు, పిల్లలూ తమకు దూరమయిపోతున్నారనే అపరాధభావనతో ఇబ్బందిపడుతుంటారు.

 ఒక స్త్రీ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటే... ఆమె సంకల్పం లేని మహిళ అని అనుకుంటారు. కానీ ఆమె ఉద్యోగమనే ఎనిమిదిగంటల పనిని వదులుకుని ఇల్లనే 24 గంటల పనిలో చేరిందని గుర్తించాలి.
 

పిల్లల్ని పెంచడం, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం చిన్న విషయం కాదు. ఇక్కడ రోజంతా పని ఉంటుంది. ఎంత పని ఉంటుందంటే ఒకోసారి ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగే అవకాశం కూడా ఉండదు. అలాగే ఉద్యోగానికి వెళ్లాలనుకునే మహిళ 24 గంటలపనిని తక్కువ సమయంలోనే ముగించుకుని... మరో ఎనిమిది గంటల పని చేయడానికి కూడా సిద్ధపడినట్టు. మొత్తానికి గృహిణి, ఉద్యోగిని ఇద్దరూ రెండు చేతులనిండా పనులతో బిజీగా ఉంటారు.
 

ఇంతటి భారాన్ని మోస్తున్న మహిళలకు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం దురదృష్టకరం. వారిని పనులను హర్షించేవారుంటారు గాని వారి నిర్ణయాలను గౌరవించేవారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మగవారికి ఓ చిన్నవిన్నపం... మీ ఇంటి మహిళ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు... ఆమె వైపు నిలబడి ఆలోచించండి. వీలైనంత ఎక్కువ అర్థం చేసుకోండి.
 - వై.సరళ, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement