దేవుడు వరమిచ్చినా..పూజారి లోపలికి రమ్మన్నా..దర్శన భాగ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఆచారాల కారణంగా మహిళలు శబరిమల ఆలయం బయటే ఉండిపోవలసి వస్తుందా? నేడు అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి. శ ‘రణ’ ఘోషలో స్వామివారు ఈ భక్తురాళ్ల వేడుకోలును వింటాడా?
దిక్కుతోచని స్థితి సాధారణంగా ప్రకృతి విలయాలప్పుడు ఉంటుంది. అప్పుడు దేవుడే దిక్కు అనుకుంటాడు మనిషి. ఇటీవలి వరదల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ.. ప్రస్తుతం మరో ‘విలయానికి’ సిద్ధంగా ఉంది. అది ‘దేవ విలయం’! దేవుడు సృష్టించిన విలయం అని కాదు. దేవుడి చుట్టూ మనుషులు సృష్టించుకుంటున్న విలయం! శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక.. ఆ తీర్పుపై అయ్యప్ప భక్తులు ‘ఒకటిగా’ విడిపోయారు. దీనర్థం ఏమిటంటే.. స్త్రీ, పురుష భక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలను, ప్రగతివాదులను విభేదించి ఒక పక్కకు వచ్చేయడం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారికి, సమర్థిస్తున్నవారికి మధ్య పోరు మొదలై.. మేఘాలకు పేరైన కేరళను ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.విలయంలో మనిషికి దేవుడే దిక్కయినట్లు.. ఇప్పుడీ యుద్ధస్థితిలోనూ దేవుడు మనిషికి మార్గం చూపించగలడా? చూపించినా మనిషి చూడగలడా?
నేడు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. ప్రతి నెలా పూజల కోసం ఐదు రోజులు గుడి తలుపుల్ని తెరిచినట్లే ఈసారీ తెరుస్తున్నారు. అయితే ఎప్పటిలా భక్తులకు నెమ్మదైన మనసుతో అయ్యప్పను దర్శించుకునే భాగ్యం ఉంటుందా అన్నది సందేహం. గర్భగుడిలోకి వెళ్లేందుకు భక్తులు మొదట ‘పంపా’ ప్రాంతానికి చేరుకోవాలి. శబరిమల శిఖరానికి బేస్‌క్యాప్ (ఎక్కే చోటు) అది. అక్కడి నుంచి కొండ ఎక్కుతూ ఆలయం ఉండే ‘నిలక్కల్’కు చేరుకోవాలి. అయితే ఈ రెండు చోట్లకు ఇప్పటికే భక్తుల కన్నా ఎక్కువ సంఖ్యలో దాదాపు 30 వరకు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. వీళ్లందరి ధ్యేయం ఒక్కటే. ఆలయ దర్శనం కోసం వచ్చే 10–50 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీలను నిరోధించడం. తిరిగి వెనక్కు పంపించడం!
శబరిమలకు ఆత్మాహుతి దళం
ఆలయంలోకి వెళ్లనివ్వకుండా మహిళల్ని అడ్డుకోవడం.. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుకు భంగం కలిగించే చర్య. అయితే పై సంస్థల వాళ్లెవరూ తీర్పును నేరుగా వ్యతిరేకించడం లేదు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తీర్పును సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ శాతం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగా.. స్థానిక ‘శివసేన’ కార్యకర్తలు, ‘అయ్యప్ప ధర్మసేన’ సభ్యులు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రుతుక్రమ వయోపరిమితి మధ్య ఉన్న మహిళల్ని ఆలయంలోకి అనుమతించేది లేదని అంటున్నారు. శివసేన అయితే.. ఆలయ ఆచారాలను అతిక్రమించి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి దళాన్ని ఇప్పటికే శబరిమలకు పంపినట్లు ప్రకటించింది కూడా! ‘‘పంపాను దాటనివ్వం. ఒకవేళ ఆ స్త్రీలు దాటారంటే మా కార్యకర్తల మృతదేహాల మీదుగానే కొండపైకి ఎక్కాలి’’ అని సేన నాయకుడు పెరింగమల అజి అంటున్నారు. తృప్తి దేశాయ్ అయినా సరే.. ఆచారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ఆమె పేరును ప్రస్తావించారు. అంతకుముందు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించే.. మలయాళ నటుడు కొల్లం తులసి (69).. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని అనడం తీవ్ర వివాదాస్పదం అయింది.
కొండ కింద మానవ కంచె!
శివసేనతో పాటు, అయ్యప్ప ధర్మసేన కూడా గట్టిగానే ఉంది. ధర్మసేనకు రాహుల్ ఈశ్వర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో మరణించిన శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరరు మహేశ్వరరు మనవడే రాహుల్ ఈశ్వర్. ఆయన కూడా మíß ళల్ని అడ్డుకునేందుకు కొండ కింద ఒక మానవ కంచెను నిర్మిస్తున్నారు. ఈయనదీ శివసేన మాటే. కొండపై ఆలయానికి వెళ్లేందుకు నాలుగు ప్రధాన మార్గారంభాలు ఉన్నాయి. ‘‘ఆ నాలుగు చోట్లా మావాళ్లు ఉంటారు. వాళ్లకై వాళ్లు.. ఈ ఆచారాలను అతిక్రమించాలని చూసే మహిళల్ని భౌతికంగా ఏమీ అనరు. అయితే.. ఆ మహిళలు మా మృతదేహాలను దాటుకుంటూ వెళ్లాలి. మాది గాంధీ మార్గం’’ అంటున్నారు రాహుల్.
నిలక్కల్‌లో సత్యాగ్రహం
భారతీయ జనతా పార్టీ కూడా ఇదే దారిలో ఉంది. అయ్యప్పస్వామి జన్మస్థలంగా భావిస్తున్న పందరం నుంచి రాష్ట్ర సచివాలయానికి ఇటీవల యాత్ర జరిపిన బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శబరిమలకు కూడా నిరసన యాత్ర చేపట్టబోతోంది. పార్టీ మహిళా విభాగం ‘మహిళా మోర్చా.. ఈ నేడు (అక్టోబర్ 17) నిలక్కల్‌లో సత్యాగ్రహానికి కూర్చొంటోంది. బీజేపీ, అనుబంధ పార్టీల డిమాండ్ ఒక్కటే.. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వెయ్యాలని. లేదా తీర్పును శూన్యీకరించేలా ఒక ఆర్డినెన్స్ తేవాలని. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఇందుకు సిద్ధంగా లేరు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై ఆయన సుముఖంగా ఉన్నారు. శబరిమల ఆలయం ‘ట్రావంకూర్ దేవస్వమ్ బోర్టు’ పరిధిలోకి వస్తుంది. బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ కూడా అన్నివర్గాల వారినీ ఆహ్వానించి, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి తను చేయగలిగింది చేస్తున్నారు.
మహిళా పోలీసుల సహాయం
ఐదు రోజుల పూజల కోసం అక్టోబర్ 17న శబరిబల ఆలయ ద్వారాలు తెరుస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై పోలీస్ యంత్రాంగం ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేసిందో బయటికి వెల్లడించడం లేదు. ఈ ఐదు రోజుల పూజ తర్వాత.. కొద్ది రోజుల్లోనే అయ్యప్పల సీజన్ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే 500 మంది మహిళా పోలీసులతో ఈ మహిళా భక్తుల సమస్యను నివారించవచ్చా అని శబరిమల ఉన్న పట్టణంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ టి.నారాయన్ యోచిస్తున్నారు.
ఆహ్వానించిన ఆలయాల్లో అడుగుపెట్టాలి కానీ...
ఆచారాలు, సంప్రదాయాలపట్ల, భగవంతుడిపట్ల భక్తి విశ్వాసాలు ఉన్నవారు వాటిని గౌరవించాలి కదా! మా గుడికి రావద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే, ఆ గుడికి స్త్రీలు వెళ్లడం అవసరమా? స్త్రీలు కూడా చూడదగ్గ ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిని సందర్శించి రావచ్చు కదా! ఎక్కడైతే ఆడవారికి ఆదరణ, గౌరవం, అభిమానం ఉంటాయో ఆ ఆలయానికి వెళ్లడం మర్యాద అనిపించుకుంటుంది. అంతేకానీ, కొన్ని వందల ఏళ్లుగా స్త్రీలు అడుగుపెట్టడం నిషేధించిన ఆలయానికి వెళ్లడం అవసరమా? ఇరువైపుల వాదనలూ ఓపిగ్గా విని, ఎవరి సంప్రదాయానికీ భంగం వాటిల్లకుండా ఉండేలా తీర్పులు ఇవ్వడం సముచితం. ఆడవాళ్లని ఎవరినీ రావద్దని అనడం లేదు. రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం రాకూడదని అంటున్నారు. దానిని గౌరవించి, ఆ ఆచారానికి కట్టుబడి ఉండటం సముచితం అనిపించుకుంటుందని నా అభిప్రాయం.
– డా. ఎన్.అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త
వారిని తక్కువ చేసినట్లు కాదు కదా!
భారతదేశ సంప్రదాయంలో దేవాలయాలకు సంబంధించిన ఆగమశాస్త్రంలో ఎక్కడా స్త్రీలని కించపరచినట్టు కనిపించదు. స్వయంభూ లింగాలు, విగ్రహాలు ఉన్న ఆలయాలలో స్త్రీల విషయంలో స్పర్శదర్శనంతో సహా ఏ విధమైన అభ్యంతరమూ వ్యక్తం అయిన సందర్భాలు లేవు. తరతరాలుగా, యుగయుగాలుగా కూడా ఎక్కడా స్త్రీ పురుషులని వేరుగా చూడటం కానీ, స్త్రీలని తక్కువ చేసినట్లుగానీ లేవు.యజ్ఞోపవీతార్హత ఉన్నవారిలో కూడా.. పురుషులే యజ్ఞోపవీతం ధరిస్తారు కానీ స్త్రీలు యజ్ఞోపవీతం ధరించరు. ఏ ఆలయానికి సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు ఆ ఆలయానికి ఉంటాయి.ప్రాంతీయాచారాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు స్త్రీలకు నిషేధం ప్రకటించినట్లే, పురుషులకు ప్రవేశార్హతను నిషేధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. మనకు దేనికైనా రుషుల మాట ప్రమాణం. కొన్ని యంత్ర తంత్ర సిద్ధులతో మంత్రబద్ధం చేసి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్త్రీలు ప్రవేశించకూడదన్న ఆచారం ఏళ్ల తరబడి ఉన్నప్పుడు దానిని గౌరవించడం మంచిది కదా! ఆలయంలో ప్రవేశం లేదని చెప్పినంత మాత్రాన వారిని తక్కువ చేసినట్లు భావించడం సరికాదు కదా!
– మాతా రమ్యానంద భారతి, అధ్యక్షురాలు, శక్తిపీఠం
Comments
Please login to add a commentAdd a comment