హోమియో కౌన్సెలింగ్
నా వయసు 44. నాకు కొంతకాలంగా కొద్దిదూరం నడిస్తేనే ఆయాసంగా, ఛాతీ బరువుగా అనిపిస్తోంది. నేను పని చేసేది ఫ్యాక్టరీలో కావడం వల్ల, పైగా నాకు పొగతాగే అలవాటున్నందువల్ల ఇది గుండెకు సంబంధించిన వ్యాధి అనుకుని పరీక్షలు చేయిస్తే, అన్ని రిపోర్టులూ నార్మల్‌గానే వచ్చాయి. అయినా నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రమణారెడ్డి, పటాన్‌చెరు, హైదరాబాద్Z
ఊపిరితిత్తులకు హాని కలిగి శ్వాస తీసుకోవడంలో తలెత్తడాన్ని క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడి) అంటారు. సాధారణంగా మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా ట్రకియా అనే నాళాన్ని చేరుతుంది. ట్రకియా చివరి భాగంలో రెండు నాళాలుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి ఊపిరితిత్తులతో ప్రవేశించి, కొన్ని వేలసంఖ్యలో ఉన్న అతి సన్నని నాళాలుగా విభజింపబడతాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఈ నాళాలు మిక్కిలి చిన్న గాలి తిత్తులుగా ఏర్పడతాయి. వీటిపై చిన్న రక్తనాళాలు ప్రయాణిస్తుంటాయి. గాలి వాయుతిత్తుల వరకు చేరినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్తనాళాలకు చేరుతుంది. అదే సమయంలో రక్తనాళాలలో కార్బన్ డై ఆక్సైడ్ ఈ వాయుతిత్తులను చేరుతుంది. తద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు వెలుపలికి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఎక్స్‌ఛేంజ్ అంటారు. ఈ వాయుద్వారాలు, గాలి తిత్తులు సాగే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి గాలి పీల్చుకున్న సమయంలోనూ, వదిలినప్పుడూ ఒక గాలిబుడగలా పని చేస్తాయి. దీర్ఘకాలికంగా ధూమపానం చేయడం వల్ల గాలితిత్తులు, వాయుద్వారాలు దెబ్బతిని వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇతర కారణాలు: ఎక్కువగా కాలుష్యవాయువులను పీల్చడం, వృత్తి రీత్యా కొన్ని పొగలను, రసాయనాలను, దుమ్మును పీల్చవలసి రావడం, జన్యుపరమైన కారణాలు.
లక్షణాలు: శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తరచు దగ్గు, ఊపిరి తీసుకున్నప్పుడు గురగురమనే శబ్దాలు వినిపించడం, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి.
జాగ్రత్తలు: పొగతాగే అలవాటు వుంటే వెంటనే మానివేయడం ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు దూరంగా ఉండటం, అవి శరీరంలోకి ప్రవేశించకుండా ముక్కుకు మాస్క్ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శారీరక తత్వాలను బట్టి, కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
కాళ్ల వాపులు... సమస్య ఏమిటి?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితేనే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. - రవికిశోర్, విజయవాడ
సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు.
నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. - గోపాలరావు, నెల్లూరు
కాలేయం కొవ్వును నిల్వ చేసి ఉంచుతుంది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం) , కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు.
ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి.
డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్