భర్త ఇచ్చిన కానుక | sakshi family legal counseling | Sakshi
Sakshi News home page

భర్త ఇచ్చిన కానుక

Published Tue, Nov 15 2016 11:06 PM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

భర్త ఇచ్చిన   కానుక - Sakshi

భర్త ఇచ్చిన కానుక

లీగల్   స్టోరీస్

కానుకలు సంతోషాన్నిస్తాయి.
కాని ఆ కానుక భార్యే అయితే..?
గిఫ్ట్‌ర్యాప్ ఉల్లిపొర చీర అయితే?
ఆ సంతోషం ఇంకోవరికో ఇస్తే?
భార్యను పణంగా పెట్టిన ధర్మరాజు గురించి చదివాం...
నడివీథిలో భార్యను అమ్మిన సత్య హరిశ్చంద్రుడి గురించి విన్నాం...
వెగటనిపిస్తోంది.. వేదన కలుగుతోంది..అసహ్యం పుడుతోంది!
ఈ కథ రాయాలన్నా.. చదవాలన్నా..అలాగే అనిపిస్తోంది.. కానీ తప్పదు!
మన సమాజంలో ఇలాంటి భర్తలూ కొందరున్నారు...
భార్యను కానుకగా ఇస్తున్నారు!
దీన్ని నిలువరించడానికి బలమైన సెక్షన్లున్నాయి..
అంతకన్నా బలమైన సమాజం ఉంది!!

‘సుజాతా! మా బాస్ వాళ్ల ఫ్యామిలీ ఇంకా ఇక్కడికి షిఫ్ట్ కాలేదు కదా.. పాపం భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేపు ఎలాగూ సండే... అందుకే లంచ్‌కి ఇన్వైట్ చేశాను’ చెప్పాడు భార్యతో ఆనంద్. చిర్రెత్తుకొచ్చింది సుజాతకు ఆ మాట వినగానే. అయినా తమాయించుకుంది. ‘బోలెడన్ని హోటల్స్ ఉన్నాయి. వెళ్లి తినడం నచ్చకపోతే పార్సిల్ తెచ్చివ్వడానికి అటెండర్స్ ఉన్నారు’ అంది... బాస్ తమ ఇంటికి భోజనానికి రావడం తనకు ఇష్టం లేదనే భావన వినిపించేట్టుగా! ‘సుజాతా! ఆయన మా బాస్. అతనితో చాలా పనులుంటాయి’ అన్నాడు తన నిర్ణయానికి తిరుగుండదు అనే అర్థం వచ్చేలా!

నిస్సహాయత మౌనాన్ని మిగిల్చింది సుజాతకు. ఫ్రిజ్‌లోంచి కూరగాయలు తీసి తరగసాగింది. మెదడు ఖాళీ లేకుండా ఆలోచనలు ముసురుకున్నాయి. ఈ మధ్య తన భర్త ప్రవర్తన చాలా వింతగా ఉంటోంది. తను పేదింటి పిల్ల. తండ్రి లేడు. డబ్బు లేకపోయినా గుణం ఉంది, అందం ఉంది అని ఆనంద్ వాళ్ల మేనత్త ఈ సంబంధాన్ని కుదిర్చింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయి కావడంతో తన వాళ్లూ కాదనలేదు. కానుకలు తప్ప కట్నం అడగలేదు కాబట్టి వద్దు అనడానికి ఏ కారణమూ కనిపించలేదు. అందుకే మూడుముళ్లూ పడ్డాయి ఏడేళ్ల కిందట. పెళ్లయిన ఏడాదికే భర్త నైజం పూర్తిగా అర్థమైంది. విపరీతమైన ఆశ... డబ్బు సంపాదించాలని. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, ఇంకోవైపు వ్యాపారం చేయాలనే ఆరాటం. దానికోసం అందిన చోటల్లా అప్పులు చేశాడు. ఇప్పుడు తన పనికి ‘ఎప్పుడో ప్రమోషన్ రావాలి.. ఇంకా రాలేదు.. ఎలాగైనా రాబట్టుకోవాలి’ అని ప్రయత్నం చేస్తున్నాడు.

భర్త తీరుతో ఒక్కోసారి తను చాలా భయపడుతోంది. ఈ మధ్య అయితే మరీ. అదీ కొత్త బాస్ విషయంలో. ప్రమోషన్ కోసం బాస్‌ను ఇంప్రెస్ చేయడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి, బాధ, చిరాకు, కోపం.. ఏవగింపూ కలుగుతున్నాయి. తనను తాను మరిచిపోతున్నాడు. వ్యక్తిత్వం లేని మనిషిలా బిహేవ్ చేస్తున్నాడు.

ఏంటో... అవసరం లేకపోయినా బాస్‌కి తనని పరిచయం చేశాడు. కొలీగ్ కొడుకు బర్త్ డే అయితే అలాంటి గేదరింగ్స్‌కి ఎన్నడూ తనను తీసుకెళ్లని మనిషి కేవలం తన బాస్ వస్తున్నాడని తీసుకెళ్లాడు. ఆ బాసేమో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వెకిలి నవ్వులతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆనంద్‌తో తను చెప్పింది కూడా. ‘సోషల్ పార్టీల్లో అవి కామన్. వాటిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు’ అని కొట్టిపారేశాడు. ఇప్పుడేమో ఏకంగా ఇంటికే తీసుకొస్తున్నాడు భోజనానికి అని. తను భరించలేకపోతోంది. ‘దేవుడా! దీనికి ఎండ్ ఎక్కడా’ అనుకుంది తరిగిన కూరగాయలను చాప్ బోర్డ్ మీద నుంచి గిన్నెలోకి వేస్తూ... మెదడులోని ఆలోచనలకు నిట్టూర్పుతో ఫుల్‌స్టాప్ పెడుతూ!

లంచ్ అవర్
తింటున్నంతసేపూ సుజాతను పొగుడుతూనే ఉన్నాడు ఆనంద్ బాస్. అతనికి వంత పాడుతున్నట్టుగా ఉంది ఆనంద్ వ్యవహారం. వంటింట్లో ఉన్న సుజాతకు ఒళ్లు మండిపోతోంది. సందర్భం లేకపోయినా మాటిమాటికీ భార్యను పిలుస్తూ, ‘బాస్‌కు అది వడ్డించు.. ఇది వడ్డించు’ అని ఆర్డర్ వేస్తున్నాడు. తను వడ్డించొచ్చు కదా... కళ్లల్లో ఆమె మండిపాటు కనపడుతున్నా లెక్క చేయట్లేదు ఆనంద్. భోజనం వంకతో దాదాపు మూడు గంటలు గడిపాడు వాళ్లింట్లో బాస్.

యాన్ ఈవెనింగ్ అవర్...
‘మీరసలు మనిషేనా? బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? మీ కొలీగ్స్ అంతా వాళ్ల పెళ్లాలను ఇలాగే ... ’ దుఃఖంతో మాట రావట్లేదు సుజాతకు భర్త ఆలోచన విన్నాక. ‘ఎవరి సంగతి నాకక్కర్లేదు. వాళ్లకు ఈ ఉద్యోగం తప్ప ఇంకే ఆశలు లేవేమో. కాని నేనలా కాదు. ఉన్నదాంతో సర్దుకుపోయే రకం కాదు. అయినా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను నిన్ను పెళ్లిచేసుకోక ముందు నీ పరిస్థితేంటో తెలుసు కదా.. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు మీ అమ్మానాన్నలు నీకు. నా దగ్గర... ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావ్? ఎప్పుడైనా అనుకున్నావా ఇలాంటి జీవితం నీ సొంతమవుతుందని. నేను చేసుకోకపోతే.. ఏ గంతకు తగ్గ బొంతో దొరికుండేవాడు. అలాగే ఓ పూట తింటూ ఓ పూట మాడుతూ చచ్చేదానివి’ ...చాలా తీవ్రంగా ఉంది భర్త గొంతు. ఖంగుతింది సుజాత... అతని మనసులో తన పట్ల ఉన్న అభిప్రాయానికి.

‘పతివ్రత మాటలు మాట్లాడక నేను చెప్పింది చెయ్. నోర్మూసుకొని మా బాస్ దగ్గరకు వెళ్ళు ఈ రాత్రి. అంతే!’ ఆజ్ఞాపించాడు. సుజాత మొహం పాలిపోయింది. నోట మాట రావట్లేదు. నేల కుంగిపోయి తాను అందులోకి జారిపోతే బాగుండు అనుకుంటోంది. వాళ్ల అరుపులు ఎందుకో అర్థం కాని ఆరేళ్ల కొడుకు బిత్తరపోతున్నాడు. బీరువాలో నుంచి ఓ చీర తీసి సుజాత మీదకు విసిరాడు... ‘వెళ్లు.. వెళ్లి చీర మార్చుకురా..’ అన్నాడు.

‘ఏంటీ. మార్చుకునేది’ నిలదీసింది. ఈసారి కోపం ఆనంద్‌కు షిఫ్ట్ అయింది. ‘నేను పెడుతున్న తిండి తింటూ నా మాటకే ఎదురు తిరుగుతావా?’ అంటూ చెంప మీద కొట్టాడు. భర్తను తోసేసింది. అహం దెబ్బతిన్న ఆనంద్ సుజాత జుట్టు పట్టుకొని బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లాడు. ఈ హఠాత్పరిణామానికి భయపడ్డ వాళ్ల అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో వాడిని ఎత్తుకుంటూ ‘బాబును తీసుకొని బయటకు వెళ్తున్నా. త్వరగా రెడీ అవ్వు. ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్‌లో బాస్ వస్తాడు’... బెదిరింపు, ఆజ్ఞాపన కలగలిసి ఉన్నాయి ఆ మాటలో.

యూ ఛీట్....
‘మిస్టర్ ఆనంద్! వాట్ డు యూ థింక్ ఎబౌట్ మి?’ ఫోన్లో అరుస్తున్నాడు బాస్. ‘వాట్.. సర్.. వాట్ హ్యాపెన్డ్?’ అయోమయంతో ఆనంద్. ‘ఏయ్! ఏమీ తెలీనట్టు మాట్లాడకు. నువ్వు, నీ భార్య కలిసి నాటకం ఆడుతున్నారా? లేక నన్ను పట్టిద్దామనుకున్నారా?’  బెదిరిస్తున్నా... బాస్ గొంతులో భయంతో కూడిన వణుకుంది.  ‘అయ్యో.. సర్! నిజంగా నాకేం తెలియదు. మా ఆవిడ ఏమన్నా..’ ఆగాడు.  ‘యూ.. ’ఆవేశంతో మాట రాక ఆగాడు బాస్. ‘ఇంట్లో నీ పెళ్లాం లేదు ఇడియట్’...గొంతు కాస్త తగ్గించి చెప్పాడు.ఈ సారి ఆనంద్ ఆశ్చర్యపోయాడు.సహాయం కావాలి...రాత్రి పది గంటలు.‘ముందు ఈ నీళ్లు తాగండి’.. నీళ్ల బాటిల్ ఇస్తూ చెప్పింది లాయర్. బాటిల్ నీళ్లను గటగటా తాగేసింది. చీర కొంగుతో మొహానికి, మెడకు పట్టిన చెమటను తుడుచుకుంటూ. ‘సారీ మేడమ్! ఈ టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నా సమస్య అలాంటిది. దారిన వెళ్తూ మీ ఇంటి ముందున్న మీ బోర్డ్ చూసి వచ్చాను’ ... సంజాయిషీ చెబుతున్నట్లుగా అంటోంది సుజాత. ‘పర్లేదు.. అర్థం చేసుకున్నా. ముందు మీరు స్థిమితపడండి..’ అనునయించింది లాయర్. కాస్త ఆగి.. విషయం చెప్పింది సుజాత. ‘భయపడకు.. నీకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా సహాయం చేస్తా’...భరోసా ఇచ్చింది లాయర్. పరిష్కార మార్గం కూడా చూపించింది.

ఏమిటా పరిష్కారం?
భార్య పట్ల ఆనంద్ ప్రవర్తన క్రూరత్వం, మానసిక వేదనకు గురి చేయడం కిందకు వస్తుంది. భార్యను అలా ఇంకొకరి దగ్గరకు వెళ్లమని బలవంతం చేయడం క్రూరత్వంగా పరిగణిస్తుంది చట్టం. అంతేకాదు మానసిక వేదనకు గురిచేయడం కూడా అవుతుంది. అందుకే అలాంటి కారణాల కింద మహిళలకు హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 13 విడాకులు తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఒకవేళ విడాకులు తీసుకోకుండా... భర్త నుంచి రక్షణ మాత్రమే కావాలనుకునే వాళ్లకు డొమెస్టిక్ వయెలెన్స్ యాక్ట్ ప్రకారం రక్షణ ఉత్తర్వునూ మంజూరు చేసి, భద్రతను కల్పిస్తుంది.

ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
Parvathi advocate2015@gmail.com

- సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement