రుచైనా | sakshi food special | Sakshi
Sakshi News home page

రుచైనా

Published Fri, Jan 29 2016 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

రుచైనా

రుచైనా

ఏ రుచైనా... పదార్థాలన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే కదా నాలుకకు తృప్తి! ఎంతైనా చైనా రుచులు కదా.. మనకెలా కుదురుతుందనుకుంటున్నారా..? మరేం ఫర్వాలేదు.. భేషుగ్గా కుదురుతుంది. మన దగ్గర విరివిగా దొరికే పదార్థాలతోనే... మన వంటిళ్లలో చైనా ఘుమఘుమలు గుబాళించడం సాధ్యమవుతుంది.
 
లెమన్ కోరియండర్ సూప్
కావల్సినవి:
క్యారట్‌లు - 2
క్యాబేజీ - చిన్న ముక్క
బీన్స్ - 6
(ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
 
వెజ్ స్టాక్ (క్యాబేజీ, క్యారట్, బీట్‌రూట్.. ఇలా నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను సన్నగా కోసి అందులో 4 నల్లమిరియాలు, 4 వెల్లుల్లి, బిర్యానీ ఆకు, లీటరు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ నీళ్లు సగం అయ్యేంతవరకు ఉడికించాలి) - అర లీటరు
కొత్తిమీరను మెత్తగా రుబ్బిన ముద్ద - 3 చెంచాలు మొక్కజొన్న పిండి - చెంచాడు (మూడు చెంచాల నీళ్లలో ఉండలు లేకుండా కలుపుకోవాలి)ఉప్పు - తగినంత నిమ్మరసం - పెద్ద చెంచా

తయారీ: ఒక గిన్నెలో కాయగూరల ముక్కలన్నీ వేసి, గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. నీళ్లను వంపేసి కూరగాయల ముక్కలను ఒకగిన్నెలోకి తీసుకోవాలి.   మరుగుతున్న వెజ్ స్టాక్‌లో సిద్ధంగా ఉంచుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమం పోసి, నూరిన కొత్తిమీర ముద్ద, ఉప్పు కలిపి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. 5-7 నిమిషాలు ఉడికాక దించి, అందులో సిద్ధంగా ఉంచుకున్న కూరగాయల ముక్కలు, నిమ్మరసం కలిపి, అందించాలి.
 
కావల్సినవి: నూడుల్స్ - 300 గ్రా.లు; రొయ్యాలు (ప్రాన్స్) - 200 గ్రా.లు
క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్, బఠాణీలు, క్యాప్సీకమ్.. తరుగు - అన్నీ 2 టేబుల్ స్పూన్ల చొప్పున
వెల్లుల్లి - 3 (తరగాలి); కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నూనె - 3 టీ స్పూన్లు
సోయా సాస్ (టొమాటో గుజ్జు కూడా వాడుకోవచ్చు)- అవసరమనుకుంటే 2 టీ స్పూన్లు
 
తయారీ: నూడుల్స్‌ను ఉడికించి, నీళ్లన్నీ వార్చి పక్కనుంచాలి.  శుభ్రం చేసుకున్న ప్రాన్స్‌లో అర టీ స్పూన్ పసుపు వేసి, ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి, వేడయ్యాక కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. టొమాటో గుజ్జు కూడా వేసి ఉడికాక, ఇందులో రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరగా నూడుల్స్, సోయా సాస్ వేసి బాగా కలిపి, కొత్తిమీర చల్లి దించాలి.  ఘాటుగా కావాలనుకుంటే సోయాసాస్, మసాలా పొడి వాడుకోవచ్చు.
 
 ట స్ప్రింగ్ రోల్స్ కావల్సినవి:
క్యాబేజీ తరుగు - కప్పు; క్యారెట్ - 1 (సన్నగా తరగాలి)
పాలకూర - కప్పు; ఉల్లికాడలు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు  - 2 టీ స్పూన్; ఛీజ్ తరుగు - అర కప్పు
వెల్లుల్లి - 2 సన్నగా (తరగాలి); ఉప్పు - తగినంత
స్ప్రింగ్ రోల్ రేపర్స్- 6 (ఇంట్లో చేసుకోవాలంటే కప్పు మైదాలో చిటికెడు ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు కలిపి, చిన్న చిన్న ఉండలు చేసుకొని, పూరీలా చాలా పలచగా వత్తుకోవాలి)
 
తయారీ:  కూరగాయల ముక్కలు, ఉల్లికాడలు, పాలకూర, ఛీజ్, ఉప్పు ఒక గిన్నెలో వేసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాతో చేసిన పూరీలో పెట్టి రోల్ చేయాలి. రెండు చివరల మూసి ఉంచాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక రోల్స్‌ని అందులో వేసి అన్ని వైపులా దోరగా వేయించుకోవాలి. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చికెన్ ఖీమా/మటన్ ఖీమాని కలిపి కూడా వీటిని తయారుచేసుకోవచ్చు. (మైదాకు బదులుగా బియ్యం పిండిని వాడి, నూనెలో వేయించకుండా వీటిని ఇడ్లీ కుకర్‌లో పెట్టి, ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు)
 
మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్
కావల్సినవి: అన్నం - 5 కప్పులు
మొక్కజొన్న గింజలు -
3  చెంచాలు; క్యారట్ తరుగు - 2 చెంచాలు
పచ్చి బఠానీ - 2 చెంచాలు
బీన్స్ తరుగు - 2 చెంచాలు ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 చెంచాలు
 
వెజిటబుల్ బ్రోత్ పౌడర్ - (ఎండిన కొత్తిమీర ఆకులు గుప్పుడు, వెల్లుల్లి పొడి చెంచాడు, ఉప్పు అర చెంచాడు, అర చెంచాడు మిరియాలు, అర చెంచాడు పసుపు కలిపి పొడి చేయాలి)
 
తయారీ: కడాయిలో నూనె వేసి వేడయ్యాక చెంచాడు జీలకర్ర- ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి వేగాక, మొక్కజొన్న గింజలు, క్యారెట్, బీన్స్, ఉప్పు, వెజిటబుల్ బ్రోత్ పౌడర్ వేసి, చివరగా అన్నం వేసి కలిపి గిన్నెలోకి తీసుకొని వడ్డించాలి.
 
డేట్ పాన్ కేక్స్
కావల్సినవి: మైదా - పావు కప్పు; నీళ్లు - కప్పు
బేకింగ్ పౌడర్ - 1 పెద్ద చెంచాడు; కోడిగుడ్లు - 4
పంచదార - 1 పెద్ద చెంచాడు; ఖర్జూరం - అర కప్పు (గింజ తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసి, చెంచాడు నువ్వుల నూనె వేసి కలిపి ఉంచాలి); పంచదార పాకం - 1 పెద్ద చెంచాడు
 
దాల్చిన చెక్క - చిన్న ముక్క
 తయారీ:  మైదా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఈ పిండిలో పంచదార, గుడ్ల సొన వేసి బాగా కలపాలి. అర గంటపాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి.
 
ఖర్జూరం మిశ్రమాన్ని చిన్న చిన్న పరిమాణంలో తీసుకొని, అదిమి, పక్కన ఉంచాలి.    దోసెల పెనం (నాన్‌స్టిక్ పాన్) పైన రెండు చోట్ల చెంచాతో కొద్ది కొద్దిగా మైదా మిశ్రమం వేసి, గరిటతో వెడల్పు చేయాలి. కిందివైపు మిశ్రమం కాలుతుండగా ఆ పైన ఖర్జూరం మిశ్రమం పెట్టి, ఆ పైన కాలుతున్న రెండో పాన్ కేక్‌తో మూసేయాలి. సన్నని మంటమీద ముదురు గోధుమరంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలా తయారుచేసుకున్న పాన్‌కేక్స్‌ను త్రికోణాకారంలో కట్ చేసుకోవచ్చు. పైన పంచదార పాకం పోసి, ఐస్‌క్రీమ్ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి.
 
ట ఆరెంజ్ చికెన్
కావల్సినవి:
చికెన్ బ్రెస్ట్ - 2 (బోన్‌లెస్, స్కిన్ లెస్)
మైదా  - కప్పు
ఉప్పు - (పావు చెంచాడు/తగినంత)
మిరియాల పొడి - పావు చెంచాడు
ఆలివ్ ఆయిల్/వంటనూనె - 3 చెంచాలు
సాస్ కోసం కావల్సినవి:
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఆరెంజ్ జ్యూస్ - 2 టేబుల్ స్పూన్లు
వెనిగర్ - అర కప్పు
సోయాసాస్ - 2 చెంచాలు
ఆరెంజ్ జెస్ట్
(ఆరెంజ్ తొక్కను సన్నగా తరిగినది) - చెంచాడు
అల్లం తరుగు - అర చెంచాడు
వెల్లుల్లి తరుగు - అర చెంచాడు
ఉల్లికాడల తరుగు - 2 చెంచాలు
ఎండుమిర్చి (కచ్చాపచ్చా చేసినది) - పావు చెంచా
మొక్కజొన్న పిండి - 2 చెంచాలు (మూడు చెంచాల నీళ్లలో కలపాలి)
నీళ్లు - 3 చెంచాలు
 
తయారీ:
కడాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో మొక్క జొన్న పిండి మినహా అన్నీ వేసి, మరిగించి, దించి, చల్లారనివ్వాలి.    ప్లాస్టిక్ కవర్ బ్యాగ్‌లో చికెన్ వేసి, అందులో అర కప్పు సాస్, ఉప్పు కలిపి, మూట గట్టి, ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచాలి. మరొక ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ తీసుకొని అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి, ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్ వేసి బాగా షేక్ చేయాలి. దీంతో మైదా మిశ్రమం పైన పొరలా చికెన్‌కు పడుతుంది.కడాయిలో నూనె వేసి వేడయ్యాక బాగా నానిన చికెన్ ముక్కలను వేసి, వేయించి, పేపర్ టవల్ మీద వేయాలి. మరిగించి, చల్లారిన ఆరెంజ్ జ్యూస్ మిశ్రమాన్ని వేడిచేసి, అందులో మొక్కజొన్న పిండి మిశ్రమం కలిిపి ఉడకనివ్వాలి. ఇది చిక్కటి గ్రేవీలా తయారయ్యాక మంట తగ్గించి, చికెన్ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉంచి, దించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement