బాబు గీరుకుంటున్నాడు. సమస్య ఏమిటి? | sakshi health councling | Sakshi
Sakshi News home page

బాబు గీరుకుంటున్నాడు. సమస్య ఏమిటి?

Published Mon, Nov 21 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

sakshi    health councling

హోమియో కౌన్సెలింగ్

మా బాబు వయసు 12 ఏళ్లు. గత మూడు నెలలుగా చేతి వేళ్లు, మెడ భాగంలో దురద వస్తోంది. రాత్రిపూట తీవ్రంగా ఉంటోంది. మావాడు డస్ట్‌లో ఎక్కువగా ఆడుతుంటాడు. శుభ్రంగా ఉండడు. దీనికి హోమియోలో పరిష్కారం చెప్పండి. - నర్సింహారావు, ఆదిలాబాద్
ఇది ఒక అంటువ్యాధి. ఇది సర్కోప్టిస్ స్కేబీ అనే పరాన్నజీవి (ప్యారసైట్) వల్ల వస్తుంది. పరాన్నజీవి (ప్యారసైట్) అంటే తన ఆహారం, నివాసం కోసం ఇతరులపై ఆధారపడే జీవులు. ఇది చిన్నగా 1 - 3 మిల్లీమీటర్ల పొడవుంటాయి. ఇవి చర్మంలో కన్నాలు/రంధ్రాలు (బరోస్) చేసి దురదను కలిగిస్తాయి. ఆ రంధ్రాలు దారాల లాగా కనిపిస్తాయి. ఇవి 2 -15 మిల్లీమీటర్ల పొడవుంటాయి. దురద వల్ల ఈ కన్నాలు కనిపించకపోవచ్చు. ఈ ప్యారసైట్లు పాకుతాయి. ఎగరలేవు. స్కేబీస్ అనే పదం లాటిన్‌లో స్కేబర్ నుంచి వచ్చింది. అంటే గోకడం అని అర్థం. ఇది సాధారణంగా శరీర శుభ్రతా వ్యవస్థ లోపించిన వారిలో, లింఫోమా ఉన్నవారిలో కనిపించవచ్చు.

కారణాలు : వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం  స్కూలు పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం  ఇతరుల పక్కబట్టలను వాడడం  కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువుల నుంచి కూడా వ్యాపించవచ్చు.

లక్షణాలు : చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి. ఇవి చేతి వేళ్ల మధ్యలో, మణికట్టు, కీళ్ల వెనక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లల్లో ముఖం, మెడ, అరచేతులు, అరికాళ్ల మీద రావచ్చు. ఇవి బొబ్బల మాదిరిగా కనిపిస్తాయి. దురద రాత్రివేళ ఎక్కువగా కనిపిస్తుంది. మొదట తక్కువగానే ఉన్నా... వ్యాధి వచ్చిన 1 - 2 నెలల తర్వాత అది చాలా ఎక్కువై నిద్రాభంగం కూడా అవుతుంది.
చికిత్స : స్కేబిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను, రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. మెర్క్‌సాల్, హెపార్‌సల్ఫ్, సల్ఫర్, పెట్రోలియం వంటి మందులు ఈ వ్యాధి చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి  ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి, హైదరాబాద్

సర్జరీ లేకుండానే... గుండె రంధ్రాలను పూడ్చవచ్చు!
కార్డియాలజీ కౌన్సెలింగ్

మా బాబుకు ఐదేళ్లు. వాడు పుట్టినప్పుడు ఒకవైపు ఛాతీ ఉబ్బినట్లుగా ఉండటం, బరువు తక్కువగా ఉండటం, బరువు తక్కువతో పాటుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు. డాక్టర్లు పరీక్షించి, గుండెలో చిన్న హోల్ ఏర్పడిందని, కంగారు పడాల్సిన పనిలేదనీ, మందులతో పూడ్చేయవచ్చనీ సలహా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాం. అయితే మా బాబు ఆరోగ్య పరిస్థితిలో కొంతకాలం నుంచి పుట్టినప్పుడు కనిపించిన ఆరోగ్య సమస్యలే మళ్లీ చోటుచేసుకుంటున్నాయి. కార్డియాలజిస్ట్‌కు చూపిస్తే పరీక్షలు చేసి, గుండెలో వెంట్రికల్ గదుల మధ్య 5.5 ఎం.ఎం.కు పైగా రంధ్రం ఉందని, సర్జరీ చేయాలని అంటున్నారు. సర్జరీ కాకుండా మరేమైనా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా? దయచేసి మా బాబు సమస్యకు పరిష్కారం చూపండి.  - సుజాత, వైజాగ్
పిల్లల్లో గుండెకు సంబంధించిన రంధ్రాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. గర్భం దాల్చిన సమయంలో ఒక పొడవాటి గొట్టం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకోవడం, వాటి భాగాలు అభివృద్ధి చెందడం జరుగుతాయి. ఈ దశలో ఏర్పడే లోపాలే తదనంతరం గుండెలో రంధ్రాలకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలు కూడా ఈ రంధ్రాలకు కారణమవుతాయి. ఆట్రియా లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే రంధ్రాల కారణంగా రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 - 30 శాతం మంది వీఎస్‌డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగిందని మీరు వెల్లడించిన వివరాలను బట్టి చెప్పవచ్చు. అప్పటి కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు అదే రంధ్రం వల్లనే మీ బాబు మళ్లీ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షలో రంధ్రం పరిమాణం 5 ఎం.ఎం. కంటే పెద్దదిగా ఉందని తేలిందన్నారు. ఈ రంధ్రాలు పూడ్చటానికి అప్పట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది.

అలాంటి పిల్లలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి వచ్చేది. అలాగే మచ్చలు శాశ్వతంగా మిగిలిపోయేవి. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల  ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారిపోయింది. ఇందుకోసం సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్‌ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు. అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియో కాంట్రాస్ట్‌ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు. ఆ తర్వాత ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష చేసి, రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికాకుండా మీ బాబును కార్డియాలజిస్ట్‌కు చూపించి మెరుగైన, శాశ్వతమైన చికిత్సను అందించండి.

డాక్టర్ ఆర్. ప్రసాద రెడ్డి
సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement