బార్బీ మాత!
కొత్తగా పుట్టిన బిడ్డకు.. కొత్తగా తల్లి అయిన అమ్మాయికి ఉన్నన్ని ‘కష్టాలు’ ఉండవు. కొత్త బిడ్డ చీకూచింతా లేకుండా రోజంతా కొత్త తల్లిని అంటుకునే ఉంటుంది. కొత్త తల్లే పాపం.. బిడ్డతో నానా అవస్థలు పడుతుంటుంది. చివరికి పాలు పట్టడం కూడా - అలవాటయ్యే వరకు - ఆ అమ్మాయికి అవస్థే. బిడ్డ ఆకలితో ఏడిస్తే నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఈ ‘కొత్త అమ్మ’ పాలు పట్టవలసి వస్తుంది. అయితే దాన్ని అవస్థ అనుకోదు. పరిసరాలను చూసుకోదు. పాలు పట్టేస్తుంది అంతే. కానర్ కెండాల్ అనే అమెరికా అమ్మాయి కూడా ఇలాగే తన నెలల బిడ్డకు పాలు పట్టింది.
కెండాల్ ఆ రోజు ‘టీజీఐ ఫ్రైడేస్’ అనే రెస్టారెంట్‌లో కూర్చొని ఉంది. వెయిటర్ కోసం చూస్తూ ఉంది. ఈలోపు ఆమె చేతుల్లోని బిడ్డ ఏడుపు మొదలుపెట్టాడు. ఎంతకూ ఆపడం లేదు. డైపర్ చూసింది. అది డ్రైగానే ఉంది. వాడు పాలకోసం ఏడుస్తున్నాడని అర్థం చేసుకుంది. వెంటనే తన టాప్‌ని ఓ వైపు మెడ కిందికి లాగి, వాడి నోటికి చనుబాలు అందించింది. ఏడుపు మాయం! తల్లి మనసు నెమ్మదించింది. తన ఆకలి మరిచిపోయింది. వెయిటర్ తెచ్చిపెట్టిందేదో ఇంత తినేసి వచ్చేసింది.
తర్వాత కొద్ది రోజులకు ఇంటర్నెట్‌లో తన ఫొటో చూసి షాక్ తింది కెండాల్. ఆ రోజు రెస్టారెంట్‌తో తన కొడుక్కి పాలు పడుతున్నప్పటి ఫొటో అది! ఎవరో ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు! కెండాల్ భయపడిపోయింది. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఎవరో ఫొటో కింద కామెంట్స్ కూడా రాశారు. ‘‘బిడ్డ ఆకలి తీర్చడానికి మీరు పాలు పట్టారు. నేను అర్థం చేసుకోగలను. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరు అలా చేసి ఉంటారు. కానీ, మీ బ్రెస్ట్ కనిపించకుండా పైన ఏదైనా కప్పుకోవచ్చు కదా. దీనికి మీ సమాధానం ఏమిటి?’’ అని ఉంది అందులో! ఆ కామెంట్‌కి కెండాల్ రిప్లయ్ ఇచ్చారు. ఆ రిప్లయ్ కూడా ఒక అమ్మాయి ఇచ్చినట్టుగా గడుసుగా కాకుండా, ఒక తల్లి ఇచ్చినట్టుగా ‘తొందరపడి ఎవర్నీ అనేయకూడదు’ అని ఉగ్గుపాలతో చెప్పినట్టుగా ఉంది! ‘‘తలపై గుడ్డ కప్పితే, దాన్ని తీసేవరకు నా బిడ్డ పాలు తాగడు. అందుకే నేను బ్రెస్ట్‌పై క్లాత్ కప్పలేదు’’ అని తన రిప్లయ్‌లో వివరణ ఇచ్చింది కెండాల్. వివరణతో పాటే ఆ వ్యక్తి ‘చూపు’ను సరిచేసే ప్రయత్నం చేశారు. ‘‘బ్రెస్ట్ ఉన్నది బిడ్డలకు పాలు పట్టడానికే. వాటిల్లో మీకు ఇంకేదైనా భావం కనిపిస్తే అది మీ దృష్టి లోపం’’ అని రాసింది.
ఇది జరిగి ఏడాదిన్నర అయింది. అప్పటి నుంచీ ‘పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్’పై ఎక్కడ చర్చ జరిగినా కానర్ కెండాల్ అనుభవం ఒక ఉదాహరణగా ముందుకు వస్తోంది. ఇప్పుడు తాజాగా బెట్టీ స్ట్రాన్ అనే ఆస్ట్రేలియా యువతి... బిడ్డకు పాలు పడుతున్న బార్బీడాల్‌ను డిజైన్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడంతో కానర్ కెండాల్ వంటి కొత్త తల్లుల మనోభావాలకు ఒక బలమై సమర్థింపు లభించినట్లయింది. ‘‘బిడ్డకు తల్లి బహిరంగంగా స్తన్యం పట్టడంపై మన సమాజంలో ఉన్న సంకోచాలను, అభ్యంతరాలను పోగొట్టడానికి నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందనే అనుకుంటున్నాను’’ అని స్ట్రాన్ అంటున్నారు. బ్రిస్బేన్‌లో ఉంటున్న ఈ ఇద్దరు పిల్లల తల్లి తన బార్బీకి ‘మామ్స్ వరల్డ్‌వైడ్ బార్బీ’ అని పేరు పెట్టారు. బార్బీల రూపురేఖల్ని మార్చే అభిరుచి ఉన్న స్ట్రాన్ గతంలో ప్రెగ్నెంట్ బార్బీని కూడా డిజైన్ చేశారు. గర్భధారణ, స్తన్యం పట్టడం... ప్రకృతికి నిండుదనాన్నిచ్చే స్త్రీ సహజ ధర్మాలు. ఈ ధర్మాలపై నిర్ణయాలకు గానీ, తీర్మానాలకు గానీ హక్కు కూడా పూర్తిగా స్త్రీలదే.