అమరిక : కొలువు తీరిన సంక్రాంతి శోభ
సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు. ఇవేకాదు... వీటితో సమానంగా ప్రాచుర్యంలో ఉన్న మరో వేడుక బొమ్మలకొలువు. సంక్రాంతికి బొమ్మలను అందంగా అమర్చడం లో కొందరు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. బొమ్మలకొలువు అమర్చడం పండుగకు నాలుగైదు రోజులు ముందుగానే ప్రారంభమవుతుంది. పండుగ మూడు రోజులూ ఇరుగుపొరుగులను పిలిచి పేరంటం చేయడం ఒక వేడుక. ఈ బొమ్మలకొలువుకి బొమ్మల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్లడం కాకుండా, ఒక పద్ధతిలో అందం గా అమర్చడం గొప్ప కళ.
త్రిమూర్తులు, రామలక్ష్మణులు, పంచపాండవులు, షట్చక్రవర్తులు, సప్త ఋషులు, అష్టలక్ష్ములు, నవగ్రహాలు, దశావతారాలు,... ఇలా అంకెల వరుసలో బొమ్మలను అమర్చుకోవచ్చు. అదేవిధంగా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రతిబింబించేలా, మన ఊరిలోని వీధుల పేర్లు, పేటల పేర్లు వచ్చేలా అమర్చుకోవచ్చు. జాతీయసమైక్యతను ప్రతిబింబించేలా భారతదేశపటం ఆకారంలో అమర్చి, ఆయా రాష్ట్రాల సంప్రదాయాలను మేళవించేలా బొమ్మల అమరిక ఉంటే బాగుంటుంది. ఎలా చేస్తామన్నది మన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక్కడ బొమ్మలకొలువుకి సంబంధించిన కొన్ని నమూనాలు ఇస్తున్నాం. వీటిని ఆధారంగా చేసుకుని మీకు నచ్చిన రీతిలో బొమ్మలను అమర్చండి. మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయండి. అంతేకాదు మీ ఇంటికి బొమ్మలకొలువు పేరంటానికి ఆహ్వానం కూడా ఇలాంటి కార్డ్‌తో మెయిల్‌లో పిలవండి.