అమ్మో! భోగిపళ్లు!!
♦ పండగ సణుగుడు
‘ఏవండీ! ఈసారి పిల్లలకు పండగ మూడ్రోజులూ మూడు జతల బట్టలు కొందామండీ’ అని మా ఆవిడ పండగ నెల పట్టినప్పటినుంచే చెవులు కొరకడం మొదలెడుతుంది. అవి మా అమ్మ అంతకుముందు అదే విషయం మీద ఆల్రెడీ కొరికి వదిలి పెట్టిన చెవులేనని తనకి తెలుసో లేదో నాకు తెలీదనుకోండి! ‘సరే చూద్దాంలే’ అనే సి నేను అదో పెద్దవిషయం కానే కాదన్నట్టు పోజుపెడుతుంటాను కానీ నాకు మాత్రం ముచ్చట ఉండదూ... ఒకరు కాదు ఇద్దరు బంగారు తల్లులు కొత్తబట్టలు తొడుక్కుని కళకళలాడుతూ కళ్లముందు తిరుగుతుంటే చూడాలని!
బట్టలు కొనడమంటే నేను ఆట్టే కంగారు పడను కానీ, బోగిపళ్లంటేనే కొంచెం కలవరపడతాను. ఎందుకంటే బట్టలు ఆన్‌లైన్‌లో బుక్ చేసి పారేయొచ్చు, క్రెడిట్‌కార్డ్ పుణ్యమా అని ఇరవైనాలుగ్గంటలూ అందుబాటులో ఉండే ఇంటర్నెట్టు మహాతల్లి చలవ వల్ల ఇంచక్కా కొనిపడేస్తుంటాను... ఆ తర్వాత నెలాఖరులో జీతం రాగానే (మాకు నెల చివరి తారీక్కే జీతాలు ఇస్తారు) తిట్టుకుంటూనే గుట్టుచప్పుడు కాకుండా బిల్లు కట్టేసి, మూడోరోజు నుంచి మళ్లీ వద్దువద్దనుకుంటూనే కార్డు తీస్తుంటాను... అద్సరే! బోగిపళ్లంటే ఎందుకంత బెంబేలు అని కదూ సందేహం! మా చిన్నప్పుడు రూపాయిస్తే చాలు... పళ్లు పులిసిపోయేటన్ని పళ్లొచ్చేవి! ఇప్పుడు భాగ్యనగరంలో రేగుపళ్లు వందగ్రాములు ఇరవై రూపాయలు... లెక్కపెడితే ఇరవై కూడా సరిగా ఉండవు.
పావుకేజీ యాభై రూపాయలు. అదీ నార్మల్ డేస్‌లో అయితేనే... ఇక బోగిపళ్ల రోజుల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. చచ్చూపుచ్చూ చూసుకోకపోతే కాస్త చవగ్గానే వస్తాయి కానీ, వాటిని పిల్లల తలమీద పోసినప్పుడు ఆ కంగారుకు పాపం అవి వాటి ఇళ్ల నుంచి (రేగుపళ్ల నుంచి) తలలు బయటపెట్టి చూస్తాయి. కొండొకచో పిల్లల తలమీదనుంచి ఒంటిమీదికి పాకుతుంటాయి. మంచివి తీసుకుందామంటే కేజీ రెండొందలకు పైమాటే!
చిన్నప్పుడు పదిరూపాయలు పడేస్తే మానెడు వచ్చే రేగుపళ్లకు చూస్తూ చూస్తూ రెండుమూడొందలు పెడదామంటే ప్రాణం ఒప్పదు. అదీ కనీసం రెండుకేజీలన్నా తీసుకోకపోతే ఏం బాగుంటుంది... ఇద్దరు పిల్లలకు పోయాలాయె! భోగిపళ్లు పోయడమంటే ఒక్క రేగుపళ్లు కొంటే సరిపోదు, సెనగలు, తమలపాకులు, వక్కపొడి ప్యాకెట్లు.... వగైరా వగైరాలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ కరకురొక్కం (హార్డ్ క్యాష్) ఇవ్వక తప్పదు, క్రెడిట్ కార్డిస్తే వాళ్లు విసిరి మొహాన కొట్టినా కొడతారు. ‘పోనీ, ఎంత వెతికినా రేగుపళ్లు దొరకలేదు.. ప్చ్!’ అని ముఖం వేలాడేసుకుని ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తేనా... అమ్మో! ఇంకేమన్నా ఉందా?!
- బాచి