హోమియో కౌన్సెలింగ్
నేను కెమికల్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ మేనేజర్‌ను. కడుపులో మంట, వికారం ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. ఎండోస్కోపీ చేసి అల్సర్ అన్నారు. దీనికి హోమియో శాశ్వత పరిష్కారం చూపించండి.
- అనిల్‌కుమార్, కరీంనగర్
ఈ మధ్య కాలంలో ఆరోగ్యసమస్యలను వ్యాధులుగా పరిగణించడం జరుగుతోంది. కానీ వాటిని జబ్బుగా అనుకోవడం కంటే జీవనశైలి లోపాలుగా చెప్పుకోవడం సబబు. అలాంటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రధానంగా కనిపించే సమస్యలో ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్. శరీరంలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆసిడ్ ఉండటం అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్స్ తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని యాసిడ్‌తో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే యాసిడ్‌ను తట్టుకొని జీవిస్తుంది. పైగా యాసిడ్ ఉత్పత్తి అధికంగా జరిగేలా దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయ అల్సర్లు మొదలవుతాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్... ముఖ్యంగా 60 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ జనాభాలో 35 శాతం నుంచి 40 శాతం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇందులో ముఖ్యంగా మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు.
గ్యాస్ట్రిక్ అల్సర్స్‌కు కారణాలు: మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం మద్యపానం, పొగతాగడం సమయానికి ఆహారం, నీరు వంటివి తీసుకోకపోవడం కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా మన శరీరంలో క్రిములు చేరి, జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి.
లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్ధకం తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్తవిరేచనాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం నోటిలో ఎక్కువగా నీరు ఊరడం.
వ్యాధి నిర్థారణ: ఎక్స్‌రే, ఎండోస్కోపీ, రక్తపరీక్షలు, బయాప్సీ, మలపరీక్ష వంటివి.
చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సినిక్ ఆల్బ్, ఆసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు చక్కగా పనిచేస్తాయి.
పల్మొనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. మేము ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇటీవల నాకు తీవ్రంగా దగ్గు, ఆయాసం వస్తోంది. ఊపిరిపీల్చడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాను. ‘ఇది సాధారణ సమస్యే కదా, అదే తగ్గుతుందిలే’ అని అంతగా పట్టించుకోలేదు. ఈ సమస్య తగ్గకపోగా... రోజురోజుకూ తీవ్రమవుతోంది. మా కాలనీలోనే ఒకరికి ఇలాంటి లక్షణాలే ఉంటే హాస్పిటల్‌లో చూపించుకున్నారు. తనకు ఆస్తమా ఉందని తేలింది. నాకూ అలాంటి సమస్య ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
- సునీత, హైదరాబాద్
మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలుతో కూడిన గాలి పీల్చినప్పుడు... కాలుష్యాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలర్జీ, ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీకు కొంతకాలంగా దగ్గు, ఆయాసం తగ్గడం లేదని తెలిపారు కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, శ్వాసకోశ సంబంధ వ్యాధులను వాటికి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలగుతారు. మీరు సాధ్యమైనంతవరకు మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో పచ్చటి చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పచ్చదనంతో కాలుష్యప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దాంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేసేలా చూడండి. ఎందుకంటే పొగతాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి కూడా అది ప్రమాదమే. పరిశ్రమలతో పొగతో పాటు, సిగరెట్ కాల్చితే వచ్చే పొగ... ఈ రెండింటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి.
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి.
- ధనలక్ష్మి, విజయవాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం 47 శాతం మంది స్కూలు పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇది చాలా సాధారణ సమస్య. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలా పడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి.
అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్ కూడా ఈ రకంగానే కనిపించవచ్చు.
సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడే జాగ్రత్తలు.
ఇక మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.
స్కూల్లో కళ్లు తిరిగి పడిపోతే...?
Published Mon, Nov 16 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM
Advertisement
Advertisement