‘స్వామియే శరణం అయ్యప్పా!’ అని శరణుఘోష మిన్నంటుతుండగా, కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు వెంటరాగా... 40 రోజుల దీక్షని పూర్తి చేసిన సంతృప్తి కనులలో కదలాడుతుండగా, భక్తిభావం నిలువెల్లా ముంచెత్తుతుండగా... వేలాది భక్తులు గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకుంటూ... కనిపిస్తుంటారు ఈ వారమంతా ఇంచుమించు అన్ని ఆలయాలలోనూ కనిపించే దృశ్యాలివే! ఇంతకూ ఇరుముడిలో ఏముంటుందో తెలుసా... ఇరు అంటే రెండు అని అర్థం.
ఇరుముడి అంటే రెండు భాగాలు కలది అని చెప్పుకోవచ్చు. ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి.
కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్కరోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి, మనశ్శరీరాలను భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రార్దబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి.
Comments
Please login to add a commentAdd a comment