సెన్స్ ఆఫ్ ప్లేస్!
సెన్స్ ఆఫ్ ప్లేస్!
Published Fri, Aug 9 2013 10:39 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఊరో, పల్లెటూరో, నగరమో, మహా నగరమో, అరణ్యమో, నది పరీవాహకమో...ఏదైతేనేం....ప్రతి ప్రదేశానికి తనదైన ‘సారం’ ఉంటుంది. ఆ సారాన్ని వెలికితీయడం అనేది మన కళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కళ్లకు ‘లెన్స్’ తోడైతే ఆ అనుభవం, ఆనందమే వేరు! నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజైన్ ‘లెన్స్’కు పని చెబుతుంది. సారాన్ని ఆవిష్కరించమని చెబుతుంది.
గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్’ ఫొటో కాంటెస్ట్ నిర్వహిస్తుంది. చేయితిరిగిన ఫొటోగ్రాఫర్లతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఫొటోలలో ప్రపంచ భౌగోళిక అందం కళ్లకు కడుతుంది. 2013 ఫొటోకాంటెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 15, 500 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
‘‘విజేతలను ఎంపిక చేయడం ప్రతి సంవత్సరం కష్టమైన పనే’’ అంటాడు ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కెయిత్ బెలో. ఆయన అన్న మాట అక్షరాల నిజమే మరి. ‘ఎంపిక’ కోసం ‘ఎంపిక’ చేయాల్సిందేగానీ ఏ ఫొటో కూడా తక్కువ తినలేదు. భౌగోళిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో దేని ప్రత్యేకత దానిదే.
‘‘ఫొటోల నాణ్యత, కొత్తదనం గతంతో పోలిస్తే బాగుంటుంది. ఒకేసారి ఇన్ని అద్భుతమైన ఫొటోలను చూడడానికి రెండు కళ్లు చాలవేమో’’ అంటాడు సంతోషంగా బెలో. పోటీని నాలుగు విభాగాలుగా విభజించారు.
ఒకటి: ట్రావెల్ పోట్రాయిట్స్, రెండు: ఔట్‌డోర్ సీన్స్, మూడు: సెన్స్ ఆఫ్ ప్లేస్, నాలుగు: స్పాంటేనియస్ మూమెంట్స్. వేలాది ఫొటోల్లో నుంచి న్యాయనిర్ణేతలు ఏడు ఫొటోలను ఎంపిక చేసి చివరికి అందులో నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. మరో ఫొటోను పాఠకులు ఎంచకుంటారు. మీరు చూస్తున్న ఫొటోలు న్యాయనిర్ణేతలు, పాఠకులు మెచ్చినవి.
Advertisement